
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న పథకాల్లో లబ్ధిని పెంచడం, కొత్త పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. ఆసరా పింఛన్లను మరో రూ.వెయ్యి మేర పెంచడం నుంచి స్థలాలున్న పేదలు సొంతిల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలిచ్చే ‘గృహలక్ష్మి’ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడం దాకా కీలక అంశాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్ మేని ఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్నారని అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే కొన్ని కొత్త పథకాల అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పేర్కొంటున్నాయి.
ప్రతిపక్షాలకు దీటుగా ఉండేలా..
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యువత, రైతు డిక్లరేషన్లను ప్రకటించింది. ఇతర వర్గాలను ఆకట్టుకునే హామీలు, డిక్లరేషన్లపై కసరత్తు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పలు రకాల హామీలను గుప్పిస్తోంది. ప్రజలను ఆకట్టుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రకటించే హామీలు, మేనిఫెస్టోలకు దీటుగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉండేలా ప్రణాళిక రూపొందుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేయడం కేసీఆర్ ప్రభుత్వ ప్రత్యేకత అని, ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్‌ఎస్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం.
మైనారిటీ వర్గాలకు రూ.లక్ష ఆర్థిక సాయం
రాష్ట్రంలో దళితులకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక చేయూతను అందించే దళితబంధు పథకం 2021లో ప్రారంభమైంది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ.. రెండో విడతలో రాష్ట్రంలో 1.30లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇదే తరహాలో వెనుకబడిన తరగతుల్లో కులవృత్తులపై ఆధారపడిన 3 లక్షల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇక సొంత జాగా కలిగిన పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘గృహలక్ష్మి’ లబ్ధిదారుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. తాజాగా మైనారిటీ వర్గాల వారికి కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆకట్టుకునేలా..
తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి సవరణ వేతన కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల మేరకు 2018 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ జరిగింది. తొలి పీఆర్సీ గడువు గత నెలలోనే ముగిసింది. రెండో పీఆర్సీ ఏర్పాటు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో వీరిని ఆకట్టుకునేలా త్వరలో రెండో పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ అయి, మధ్యంతర భృతిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన విధంగా.. ఎన్నికల వేళ గ్రామాల వారీగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment