మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాదసభకు హాజరైన ప్రజలు , అచ్చంపేట సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలతోపాటు అన్ని వర్గాలను కాపాడుకునేందుకు తన వంతు పనిచేశానని.. ఇప్పుడు ప్రజలే పోరాటం చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో చోటుచేసుకున్న మార్పును గుర్తించి, ఆలోచించాలని సూచించారు. ఎన్నికల కోసం బహురూపుల వేషాలతో వచ్చే వాళ్లను నమ్మి ఆగమైతే వైకుంఠపాళిలో పాములా మింగేస్తారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు, వలసల బతుకులే మిగులుతాయని.. రైతులు గోసపడతారని పేర్కొన్నారు. తాము ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమని, సాధ్యాసాధ్యాలపై ఆలోచించి క్రమపద్ధతిలో అమలు చేసేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. పూటకో పార్టీ మార్చుతూ, డబ్బు మదం, అహంకారంతో వచ్చేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అచ్చంపేట, వనపర్తి, నల్లగొండ జిల్లా మునుగోడులలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘24 ఏళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరిన.. నాడు ఎవడూ లేడు. పక్షిలా ఒక్కడినే తిరిగా. అదే ఇప్పుడు లేసినోడు, లేవనోడు అంతా వచ్చి కేసీఆర్ నీకు దమ్ముందా? అంటున్నారు. కొడంగల్ వస్తవా, గాంధీ బొమ్మకాడికి వస్తవా అంటున్నరు. ఇదేనా రాజకీయం? ఎన్నికలు వస్తయ్, పోతాయ్. కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగుపడతాయి. తెలంగాణకు ముందు ఈ సన్నాసులు ఎక్కడున్నరో, ఎవరి బూట్లు తుడిచారో చెప్పాలి. పదేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో ప్రజలే గమనించాలి.
కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసింది
ఎన్నికలు వస్తున్నాయని అంతా వస్తరు. ఉపన్యాసాలు ఇస్తరు. దేశంలో ఏ సీఎం, పీఎం కూడా మన దాంట్లో పది శాతం కూడా లేరు. కేసీఆర్ దమ్మేంటో ఇండియా చూసింది. నవంబర్ 30న దుమ్ము రేగాలి. నల్లమలలోని అప్పర్ ప్లాటు అమ్రాబాద్‌కు నీళ్లిచ్చే బాధ్యత నాది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 192 కేసులు వేసి అడ్డంపడ్డది కాంగ్రెస్ వాళ్లే. 1969 ఉద్యమంలో 400 మందిని పిట్టల్లా కాల్చింది, లక్ష మందిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో మన పొత్తుతో గెలిచి 2014 దాకా పదేళ్లు ఏడిపించారు. వాళ్లు ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు. తప్పనిసరై ఇచ్చారు. వాళ్లకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు, ఇక్కడి ప్రజలపై పెత్తనం కావాలి.
పైరవీకారుల పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ పైరవీకారుల పార్టీ. వాళ్లకు పాత దళారీలు కావాలి. రైతు బంధుకు సంవత్సరానికి రూ.15 వేల కోట్లు ఇస్తుంటే వాళ్లకు కడుపు మంటగా ఉంది. అందులో రెండు వేల కోట్లయినా తినొద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ దుర్మార్గులను రానిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. రైతు బంధు రాంరాం అవుతుంది. దళితబంధు జైభీం అయిపోతది. కరెంటు కాట గలుస్తది. మళ్లీ మొదటికే వస్తది.
కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. 5 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ నుంచి రేవంత్‌రెడ్డి దాకా అందరూ ధరణిని తీసేస్తాం అంటున్నరు. దీన్ని తమాషాగా తీసుకోవద్దు. రైతుకు అధికారం ఇస్తామంటోంది బీఆర్‌ఎస్ పార్టీ అయితే.. లాక్కుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ.. మీకు ఏ పార్టీ కావాలి? ఇప్పటిదాకా నావంతు పనిచేశా.. ఇప్పుడు మీదే బాధ్యత.
నష్టపోయేది ప్రజలే..
దళితబంధుతో దళితుల బతుకులు బాగుపడుతున్నాయి. మమ్మల్ని గెలిపించకపోతే వ్యక్తిగతంగా పోయేదేం ఉండదు. రెస్ట్ తీసుకుంటాం. కానీ నష్టపోయేది ప్రజలే. తెలంగాణ తెచ్చినవాడిగా చెప్తున్నా. రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ఉండాలో ఆలోచించాలి. మేం ఎన్నికల కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం లేదు. రూ.70, వంద అంటూ అర్థంపర్థం లేకుండా ఇచ్చిన పెన్షన్‌ను బీఆర్‌ఎస్ వచ్చాక రూ.వెయ్యికి, తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలవగానే రూ.మూడు వేలలకు పెంచి.. తర్వాత దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలోని 93 కోట్ల రేషన్‌కార్డు దారులకు రైతు బీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తాం. రేషన్‌పై సన్నబియ్యం ఇస్తాం.
అన్నింటినీ బేరీజు వేసుకొని ఆలోచన చేయాలి’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా.. అచ్చంపేట, వనపర్తి సభల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ , నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్.. మునుగోడు సభలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పల్లె రవికుమార్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగిన అచ్చంపేట, వనపర్తి సభల్లో స్థానిక ఎంపీ పి.రాములు పాల్గొనలేదు. దీనితోపాటు వనపర్తి సభలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
119 నియోజకవర్గాల అభ్యర్థులంతా కేసీఆర్‌లే..
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసే బీఆర్‌ఎస్ అభ్యర్థులు అందరూ కేసీఆర్‌లే. లేచినోడు, లేవలేనోడూ నాపై పోటీ చేస్తామంటూ బీరాలు పలకటం ఏమిటి? మా పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి కేసీఆర్‌తో సమానులే.
డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి
‘‘నల్లగొండ, మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతాలు. మీ చైతన్యం మూగబోవద్దు. పైసలు పట్టుకొని వచ్చేవాళ్లను, పూటకోపార్టీ మార్చేవాళ్లను నమ్మొద్దు. వాళ్లకో నియమం లేదు. సిద్ధాంతం, నిబద్ధత లేవు. నిన్నొక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ. డబ్బు మదం, అహంకారంతో ప్రజలను కొనగలుతాం అనుకుంటున్నారు. అలాంటి వారికి నల్లగొండ, మునుగోడు చైతన్యం చూపించి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చాం.
చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. 100 పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ 50–60 ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్‌తో ప్రజలు నడుములు వంగి, చనిపోయే వరకు చూశారే తప్ప నివారణ చేయలేదు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే ఫ్లోరైడ్ గోస పోయింది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే డిండి ప్రాజెక్టుకు, శివన్నగూడెంకు నీళ్లు వస్తాయి. ఆ బాధ్యత నాది. ఏడాదిన్నరలో మునుగోడు నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. తొలి నుంచీ ఉద్యమాల్లో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడులో గెలిపించాలి.
Comments
Please login to add a commentAdd a comment