సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ వరాల జల్లు కురిపించింది. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించింది. నాలుగైదు నెలల్లో దీన్ని రాష్ట్రమంతటికీ విస్తరిస్తామంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను పార్టీ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ... పలు ఇతర వరాలను కూడా కేసీఆర్ ప్రకటించారు.
‘మిషన్ భగీరథ పూర్తి చేసి 24 గంటలు ఉచితంగా తాగునీరు సరఫరా చేయడంలో భాగంగా మొదటిదశలో హైదరాబాద్ నగరంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా... ఢిల్లీ తరహాలో డిసెంబర్ నుంచి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా చేస్తాం. తద్వారా 97% ప్రజలకు ప్రయోజనం. సరఫరాను మెరుగుపరుస్తూ 24 గంటల పాటు నీటి సరఫరా ఉండే దిశగా చర్యలు తీసుకుంటాం. వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా ద్వారా ఆదాయం వస్తుంది. గృహాలకు ఉచిత సరఫరా మూలంగా జలమండలికి జరిగే రూ.400 కోట్ల నష్టాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాలుగైదు మాసాల తర్వాత అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తాం. ప్రైవేటు స్కూళ్లు, స్వచ్చంద సంస్థలు, అపార్ట్‌మెంటుల్లోనూ 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా చేస్తాం’అని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 70 వేల సెలూన్లకు డిసెంబరు నుంచి ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. లాండ్రీలకు, దోబీఘాట్లకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
అర్హులందరికీ వరద సాయం
‘గ్రేటర్ ఎన్నికల్లో ఇతరులు గెలిచినా చేసేదేమీ లేదు.. దేనికైనా రాష్ట్ర ప్రభత్వ సహకారం కావాలి. కోవిడ్ మూలంగా ఆర్థికంగా దెబ్బతిన్నా నగరంలో మౌలిక వసతుల కల్పన కొనసాగిస్తాం. దేశ చరిత్రలో వరద బాధితులకు రూ.10 వేల చొప్పున ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పటివరకు నగరంలో 6.56 లక్షల కుటుంబాలకు రూ.650 కోట్లకు పైగా పరిహారం ఇచ్చాం. ఎన్నికల సంఘం ఆదేశాలతో సాయాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. మీ సేవ ద్వారా వరద సాయం కోసం దాదాపు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో లక్ష మందికి పైగా సాయం అందజేశాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మరో రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించినా సరే... అర్హులందరికీ వంద శాతం సాయం అందజేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు.
తప్పుడు శక్తులకు ఓటేస్తే కాలనాగులా కాటేస్తుంది
కాస్మోపాలిటన్ సెక్యులర్ సిటీగా హైదరాబాద్‌కు ఉన్న ఇమేజీని కాపాడుకోవాలి. గ్రేటర్ ఎన్నికల్లో ఆషామాషీగా ఓటేస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లే. విద్వేషాలతో కూడిన నగరం మన భవిష్యత్ తరాలకు మంచిది కాదు. తప్పుడు శక్తులకు ఓటేస్తే అది కాలనాగులా కాటేస్తుంది. శాంతి, సామరస్యం దెబ్బతింటే కల్లోలాలు చెలరేగి హైదరాబాద్ రియల్‌ఎస్టేట్ రంగం దెబ్బతింటుంది. స్థిరాస్తి ధరలు పడిపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఉండే వాణిజ్య, వ్యాపారవేత్తలు, రియల్‌ఎస్టేట్ బిల్డర్లు, సామాజిక సేవా ధృక్పథం ఉన్నారు. కళాకారులు, మేధావులు అప్రమత్తంగా ఉండాలి.
ఏడేళ్లుగా టీఆర్‌ఎస్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడుకుంటూ వస్తోంది. కొన్ని ఇరుకు ఆలోచన కలిగిన శక్తులు, వ్యక్తుల.. దుర్మార్గపు వితండవాదనతో హైదరాబాద్‌కు చెడ్డపేరు వస్తుంది. శాంతి, సామరస్యం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. భగభగ మండే, కత్తులతో పొడుచుకునే, కల్లోలాలు చెలరేగే హైదరాబాద్ వద్దని తెలంగాణ పెద్దగా, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చెప్పడం నా బాధ్యత. ప్రగతిశీల హైదరాబాద్ కోసం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. బయట జరుగుతున్న పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు నేను ఈ రోజు స్వయంగా మేనిఫెస్టో విడుదల చేస్తున్నా’అని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారు తమ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు కల్చరల్ సెంటర్లు నిర్మించుకునేందుకు వారికి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
భిన్న సంస్కృతుల సమాహారం
‘దేశంలోనే నిజమైన కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్. ఈ నగరానికి ఉన్న చరిత్ర, వారసత్వం, వైవిధ్య సంస్కృతి, ప్రత్యేక జీవన విధానం కాపాడుకోవాలి. ప్రపంచం నలుమూల నుంచి ఎవరు వచ్చినా ఉపాధి కల్పించి అక్కున చేర్చుకుంటుంది. వారందరూ ఇక్కడి సంస్కృతిలో లీనమై గొప్పగా బతుకుతున్న పూలగుచ్ఛం లాంటి నగరం హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడంలో టీఆర్‌ఎస్ సఫలీకృతమైంది.
ఐటీ రంగంలో దేశంలో నంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నాం. తాగునీరు, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం. రోజూ 50వేల మందికి అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతున్నాం.సామరస్య, శాంతిపూర్వక వాతావరణం దెబ్బతినకుండా, మత, విచ్ఛిన్నకర శక్తులకు తావివ్వకుండా హైదరాబాద్‌ను కాపాడుకుందాం. ఈ నగరాన్ని మరింత పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడంలో చేయి కలిపి గతంలో కంటే మంచి విజయం అందించాలని’ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వాసులకు విజ్ఞప్తి చేశారు.
దేశానికి కొత్త పంథా కావాలి..
‘దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయింది. యాభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నా. భారతదేశానికి దశ, దిశను చూపడంలో ఈ రెండు పార్టీలకు అవగాహన లేదు. జీడీపీ మైనస్ 24 శాతానికి పడిపోయినా కట్టుకథలు, పిట్టకథలు చెప్తున్నారు. దేశంలో సంపద సృష్టించే తెలివితేటలు ఈ రెండు పార్టీలకు లేవు. దేశానికి కావాల్సింది చిల్లర పంచాయతీలు, తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కాదు. ఓ నూతన పంథా కావాలి. ఆ కొత్త పంథాను ఆవిష్కరించే క్రమంలో జాతీయస్థాయిలో ఎదగాలనే ఆలోచన నాకుంది. ఈ విషయమై చాలా మందితో మాట్లాడాను... త్వరలో మీరు ఫలితం చూస్తారు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
‘జాతి ప్రయోజనాలు కాపాడేందుకు టీఆర్‌ఎస్ అగ్రభాగాన ఉంటుంది. దేశాన్ని సరైన మార్గంలో నడిపేందుకు మీ తెలంగాణ బిడ్డగా ఏ త్యాగానికైనా సిద్ధం. నేను ఒక్కసారి ఎత్తుకుంటే ఏం జరుగుతుందో తెలుసు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘పెట్టుబడుల ఉపసంహరణ నిధులతో బడ్జెట్ సమర్పిస్తున్నారు. తెలంగాణలో సంపద సృష్టించి పేదలకు అనేక రూపాల్లో పంచుతున్నాం. చైనా తరహాలో మన దేశంలోనూ ప్రబలమైన మార్పు రావాలి. లైఫ్ ఇన్సూ్యరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాల్సిన అవసరం ఏముంది. త్వరలో దేశంలోని భావసారూప్య పార్టీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు యుద్ధభేరి మోగిస్తా. మీ పక్షాన పోరాడే వారికి మద్దతు ఇవ్వండి’ అని ప్రభుత్వ రంగ సంస్థల కార్మి కులు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ.. మేనిఫెస్టో
‘మన నగరం– మనపార్టీ– మన పాలన’... టీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
►డిసెంబరు నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా.
►నగరంలో 10 లక్షల గృహ వినియోగ నల్లా కనెక్షన్‌లు. వీరిందరికీ ప్రయోజనం.
►అపార్ట్‌మెంట్లకూ తొలి 20 వేల లీటర్లు ఉచితం. అలాగే స్కూళ్లు, స్వచ్చంద సంస్థలకు కూడా.
►రాబోయే రోజుల్లో పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు. ∙సమగ్ర జీహెచ్‌ఎం సీ చట్టం. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవల కోసం నూతన చట్టం. టీఎస్ బీ–పాస్ కఠినంగా అమలు.
►సినిమా థియేటర్లకు మార్చి నుంచి తిరిగి తెరుచుకునే వరకు మినిమం విద్యుత్ చార్జీలు రద్దు.
►రాష్ట్రవ్యాప్తంగా 3.37 లక్షల రవాణా మోటారు వాహనాలకు కరోనా కాలంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు రూ.267 కోట్ల పన్నులు రద్దు. ప్రైవేటు స్కూలు బస్సులకు కూడా ఆరు నెలల పన్ను మాఫీ.
►రూ.10 కోట్ల లోపు వ్యయంతో నిర్మితమయ్యే చిన్న సినిమాలకు జీఎస్‌టీ రాష్ట్ర వాటా 9 శాతం రీయింబర్స్‌మెంట్.
►ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు మున్సిపల్ బాడీస్‌కు బదులుగా ప్రత్యేక కౌన్సిళ్ల ఏర్పాటుకు విజ్ఞప్తి.
►వరద నీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్, ప్రణాళిక అమలుకు రూ. 12 వేల కోట్లు.
►మొత్తం 59 ఎస్‌టీపీలను నిర్మించడానికి ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళిక
►రూ. 370 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 2,700 చెరువుల సుందరీకరణ.
►పర్యావరణహిత నగరంగా మన హైదరాబాద్. కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు. అలాంటి పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తాం.
►చెత్త నుంచి మరో 43 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
►లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.
►ఆరేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటికే 17.8 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ∙యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కేంద్రాలు
►శాంతిభద్రతల పరిరక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి. ∙నగరంలో ఇప్పటికే 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పా టు. మరో ఐదు లక్షలు అమరుస్తాం.
►జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణుల 70 వేల సెలూన్లకు డిసెంబరు నుంచి ఉచిత విద్యుత్. రజకుల లాండ్రీలు, దోబీఘాట్లకూ డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్.
►అవసరమైన చోట అధునాతనమైన దోబీఘాట్‌ల నిర్మాణం.
►కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.52,750 కోట్ల నష్టం జరిగినా, రాష్ట్రంలోని అన్ని రకాలైన వ్యాపార, వాణిజ్య సంస్థలకు మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మినిమం విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు.
►సినిమా రంగంలో పనిచేసే 40 వేల మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులకు రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు
►పెద్ద సినిమాలకు ముంబై, ఢిల్లీ తరహాలో ఎన్ని షోలు అయినా వేసుకునే వెసులుబాటు.
►సినిమా థియేటర్లు తెరిచేందుకు ఉత్తర్వులు.
►గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలను గోదావరితో అనుసంధానించి పరిశుభ్రమైన నీటితో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి. కాలుష్య నియంత్రణకు చర్యలు.50 సంవత్సరాలకు సరిపోయే విధంగా... తాగునీటి గోస తీర్చేందుకు కేశవాపూర్‌లో రిజర్వాయర్. ∙సమగ్ర మురుగునీటి పారుదల ప్రణాళికలకు 13 వేల కోట్లు.
►ఔటర్ రింగురోడ్డు లోపలి గ్రామాలకు నిరంతర తాగునీరు.
►రెండో దశ మెట్రోరైలు రాయదుర్గం– విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్– మెహదీపట్నం వరకు విస్తరణ.
►హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోరైల్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
►మరో 90 కి.మీ ఎంఎంటీఎస్ రైళ్లు. ∙ఎస్‌ఆర్‌డీపీ రెండు, మూడు దశల ద్వారా 125 లింక్ రోడ్లు. మొత్తం రూ. 22 వేల కోట్ల వ్యయం. నగర వాసులకు సిగ్నల్ ఫ్రీ సిటీ.
►మెట్రో లేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం.
►ఓఆర్‌ఆర్ అవతల రీజనల్ రింగురోడ్డు నిర్మాణం. ట్రాఫిక్ ఫ్రీ నగరం.
►హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు. 132, 11 కేవీ హైటెన్షన్ ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు శాశ్వతంగా తొలగింపు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు, నాణ్యమైన విద్యుత్‌కు రూ.2వేల కోట్ల ఖర్చు. 24 గంటలు విద్యుత్ సరఫరా
►నగరంలో నలువైపులా టిమ్స్ సేవలు. గచ్చిబౌలి తరహాలో నగరంలో మరో మూడు టిమ్స్ నెలకొల్పుతాం.
►350 బస్తీ దవాఖానాలు. వీటిల్లో డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి.
►డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగింపు. కొల్లూరు వద్ద 60 వేల ఇండ్లతో అతిపెద్ద టౌన్‌షిప్ ఆవిష్కృతం కాబోతున్నది.
►వివాద స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలు క్రమబద్ధీకరణ. స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆర్థికసాయంతో ఇళ్ల నిర్మాణం.
►సంక్షేమానికి పెద్దపీట. సీనియర్ సిటిజన్ల కోసం లైబ్రరీలు, యోగా సెంటర్లు విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఈ లైబ్రరీలు .గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాం.
Comments
Please login to add a commentAdd a comment