సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 110 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. గతంలోనూ టీఆర్‌ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసిన సందర్భంలో పార్టీ లేచి దెబ్బకొడితే విపక్షాలకు నషాళానికి అంటింది. నేను ఫైటర్‌ను.. దేనికీ భయపడేది లేదు’అని గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
‘టీఆర్‌ఎస్ దేశంలోనే ఓ ప్రబల రాజకీయ శక్తి. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష. అసెంబ్లీ, పార్లమెంటు.. అన్ని ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన టీఆర్‌ఎస్ గ్రేటర్ ఎన్నికల్లోనూ గెలుస్తుంది. గ్రేటర్ అభ్యర్థుల జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయి. అందరికీ న్యాయం చేస్తాం, కంగారుపడొద్దు’అని పార్టీ నేతలకు సూచించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.. ఈ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలి. దిక్కుమాలిన, సంకుచిత ఆలోచనలతో దేశాన్ని నడిపే శక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత టీఆర్‌ఎస్ పార్టీపైనా, తెలంగాణ రాష్ట్రంపైనా ఉంది. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను టిఆర్‌ఎస్ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలి’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రశాంత వాతావరణంతోనే పెట్టుబడులు
‘హైదరాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణంతో నగరానికి పెట్టబడులు తరలివస్తున్నాయి. అమెజాన్ కంపెనీ ఒక్కటే 21 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ది సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు గమనించారు’అని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా? అగ్గిమండే హైదరాబాద్ కావాలా? మతకల్లోలాల హైదరాబాద్ కావాలా? మతసామరస్యం వెల్లివిరిసే హైదరాబాద్ కావాలా? మతం పేర కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా? అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండే హైదరాబాద్ కావాలా? నగరంలో అభివృద్ది కావాలా? అశాంతి రాజ్యమేలాలా? ప్రజలు ఆలోచించుకోవాలి’’అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
రైతులు, పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు, కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ‘దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ చేయని దుష్ప్రచారం, ఆడని అబద్ధం లేదు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, బ్యాలెట్ పేపర్ మీద హరీశ్‌రావు ఫోటోలేదని అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆమెను ఆగౌరవపరుస్తూ పోస్టింగులు పెట్టారు. ఇంత దుర్మార్గం ఉంటదా? ఇంత నీచమైన ప్రచారం చేస్తరా? జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా ఇలాంటి దారుణాలే చేయాలని చూస్తరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టాలి’అని కేసీఆర్ కోరారు.
వరద బాధితులకు రూపాయి ఇవ్వలేదు
‘భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బురద రాజకీయం చేస్తోంది. పేదలను ఆదుకునేందుకు ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు రూ.550 కోట్లు విడుదల చేశాం. ఇప్పటికే 6.78 లక్షల మందికి వరదసాయం అందగా, మిగతా వారి నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకుని బాధితులు అందరినీ అదుకుంటాం. కేంద్రం రూపాయి ఇవ్వకపోగా... పేదలకు ఆర్థికసాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. పేదల నోటికాడి బుక్క లాక్కునేలా చిల్లర రాజకీయాలు చేస్తోంది’అని కేసీఆర్ విమర్శించారు.
నాయినికి నివాళి
తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తిగా, రాజకీయాల్లో నైతికత గల వ్యక్తిగా నాయిని నర్సింహరెడ్డి నిలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో నాయినిని నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
– ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గుప్తాలను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా ఇన్‌చార్జిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.67 వేల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ది కార్యక్రమాల జాబితాను తయారు చేసి, వాటిని డివిజన్ల వారీగా ఇన్‌చార్జిలకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment