సాక్షి, హైదరాబాద్: ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం... విద్యుత్, నల్లా నీళ్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయమూ ఉచితమే... సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో మహిళల ప్రయాణాలన్నీ ఫ్రీ... ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తాం... చలాన్లు కట్టాల్సిన పనిలేదు... కులాలవారీగా లబ్ధి కలిగిస్తాం... వరద బాధితులకు రూ. వేలల్లో పరిహారం. ఇవీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు. ఒక పార్టీ నెలకు 20 వేల లీటర్లు ఉచితం అంటే మరో పార్టీ 30 వేల లీటర్లు ఉచితమని, ఇంకో పార్టీ నల్లా బిల్లే కట్టాల్సిన పనిలేదంటూ పోటీలు పడి వరాలు కురిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ఓట్లే లక్ష్యంగా హామీల వర్షం కురుస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది.
ఎడాపెడా హామీలు
గతం కంటే భిన్నంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి రక్తి కడుతున్నాయి. గ్రేటర్ ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ఎడాపెడా హామీలిచ్చేస్తున్నాయి. చలాన్ల రద్దు, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, వరద సాయం రూ. 50 వేలు లాంటి హామీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా వరద సాయం కింద బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామని పార్టీలు చెబుతున్న మాటలు ప్రజల్లో ఆశలు రేపుతున్నా అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గ్రేటర్ బడ్జెట్ పరిధి ఎంత, ఈ ఉచిత హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెచ్చి నెరవేరుస్తారనే ప్రశ్నలకు రాజకీయ పార్టీలు ట్విస్ట్‌లు ఇస్తున్నాయి. హైదరాబాద్ ప్రజలు ఏటా రూ. లక్ష కోట్ల పన్నులు కడుతున్నారని, అన్నీ లెక్కలు కట్టిన తర్వాతే ఎన్నికల హామీలిస్తున్నామని, అవి ఎలా అమలు చేయాలో తమకు తెలుసని పార్టీల నాయకులు
చెప్పుకొస్తున్నారు.
ప్రభుత్వాలు చేయాల్సిన పని కదా!
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలను జీహెచ్‌ఎంసీ ఎలా అమలు చేస్తుందనే సంశయం గ్రేటర్ ఓటర్లలో వ్యక్తమవుతోంది. రూ. 10 వేల కోట్ల ప్రత్యేక నిధి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆస్తిపన్ను రద్దు, ఎల్‌ఆర్‌ఎస్ రద్దు లాంటివి అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జీహెచ్‌ఎంసీ తరఫున ఎలా చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశాలు, అక్కడి నుంచి వచ్చే నిధులు కూడా నేరుగా జీహెచ్‌ఎంసీకి వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment