సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హరిత వనం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 40-45 పార్కులు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి ప్రహరీలు నిర్మించేందుకు నిధులు కూడా విడుదలయ్యాయి.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ ఖాళీ స్థలాలను పార్కులుగా మారుస్తామని, మూడునెలల్లో జిల్లా కేంద్రంలో వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. మరోవైపు ఖమ్మం నగర శివార్లలో ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆయన ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు.
కబ్జా కోరల నుంచి రక్షించేందుకే...
జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరమయినప్పటికీ ఖాళీగా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇందులో ప్రభుత్వ భూములు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు కబ్జాకు గురయిన వాటిని పక్కనపెడితే... ఇప్పటికీ కార్పొరేషన్ ఆధీనంలోనే కొన్ని ఖాళీ స్థలాలున్నాయి. వీటిని రక్షించాలన్న ఆలోచనతో పాటు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ఈ ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హోదాలో ఇలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ పరిధిలో 40-45 స్థలాలను గుర్తించారు. ఇప్పుడు వీటికి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయించేందుకు యుద్ధప్రాతిపదికన రూ.1.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం 13వ ఆర్థిక సంఘం నిధులు కాగా, మరో సగం కార్పొరేషన్ నిధులు. వీటితో గుర్తించిన ఖాళీ స్థలాలకు ప్రహరీల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత వాటన్నింటినీ పార్కులుగా మార్చనున్నారు.
జీహెచ్‌ఎంసీ తరహాలో...
ఈ పార్కులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని పార్కుల తీరులోనే నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు. కాలనీ, రెసిడెంట్స్ అసోసియేషన్‌లకు ఈ పార్కుల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. కొంత మున్సిపల్ నిధులు, మరికొంత అసోసియేషన్ నిధులతో ఈ పార్కులు నిర్వహిస్తారు. పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు వాచ్‌మెన్‌లను కూడా నియమించనున్నారు. ఇక.. నగర శివార్లలో భారీ పార్కు నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చేందుకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయేమో అన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ తన హయాంలోనే ఈ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
ఐఏఎస్ ఉంటేనే మేలు
ఇక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఉంటేనే మంచిదనే కోణంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే కార్పొరేషన్ అయినా ఖమ్మం నగరం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు యేటా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ఈ పోస్టును ఐఏఎస్‌లకు అప్పగిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ఈ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వ స్తుండడం గమనార్హం.
ఇక హరిత వనం
Published Sun, Sep 7 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement