‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ | RDA inquiry bogus pass books | Sakshi
Sakshi News home page

‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ

Published Thu, Sep 25 2014 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

RDA inquiry bogus pass books

 జూలూరుపాడు : అటవీ భూముల్లో పోడు నరికి సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోగస్ పట్టాలు జారీ చేసిన వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‘డూప్లికేటుగాళ్లు’ అనే శీర్షికన ఈనెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కథనంపై స్పందించిన  కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలపై విచారణ చేపట్టాలంటూ కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్‌ను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ బుధారం విచారణ చేపట్టారు. బోగస్ పట్టాతో మోసపోయిన  వినోభానగర్ గ్రామానికి చెందిన  భూక్యా సురేష్, అతని భార్య ఉమ ఆర్డీఓను కలిశారు. తాము మోసపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుగులోతు సరోజ, బాదావత్ విజయ, గుగులోతు సుజాత, భూక్యా జ్యోతి పేరు మీద ఉన్న  బోగస్ పట్టాలను ఆర్‌డీఓ పరిశీలించారు.  పట్టాపాస్ పుస్తకాలపై ఉన్నవి కలెక్టర్, భద్రాచలం ఐటీడీఓ పీఓ సంతకాలు కావని, ఇవి ఫోర్జరీ అని గుర్తించారు.

అదేవిధంగా ప్రభుత్వ ముద్ర కూడా కాదని తేల్చారు. పట్టాపాస్ పుస్తకాలపై పోడు రైతు భార్యాభర్తల ఫొటోలు ఉండాలి కానీ, ఒకరిది మాత్రమే ఉందన్నారు. వీటిపై అప్పటి జూలూరుపాడు తహశీల్దారు డి.నాగుబాయి పేరుతో సంతకం చేసి ఉందని చెప్పారు. ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎవరిచ్చారని బాధిత రైతులను ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా అనిల్ ఎకరానికి  రూ.10 వేలు చొప్పున తీసుకుని చేయించాడని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తుంటే మీరేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్డీఓ ప్రశ్నించారు.

 దీనిపై వారు సమాధానం ఇస్తూ తమకు ఏమీ తెలియదని, అనిల్ చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామని తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, పట్టాలు తిరిగి ఇవ్వాలని కోరారు. గుగులోతు సరోజ భర్త గుగులోతు నరసింహారావు మూడెకరాలకు   రూ.30 వేలు, మల్లయ్య అనే రైతు తమ పెద్ద కూతురు బాదావత్ విజయ పేరు మీద పట్టా చేసినందుకు ఐదెకరాలకు రూ.50 వేలు, చిన్న కూతురు గుగులోతు సుజాత పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇచ్చినందుకు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు,  భూక్యా జ్యోతి భర్త రాంబాబు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు పట్టా పాస్ పుస్తకాల కోసం భూక్యా అనిల్‌కు ఇచ్చినట్లు వివరించారు.

 తమతోపాటు వినోభానగర్, ఏన్కూరు మండలంలోని అక్కినాపురంతండా, కేసుపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పట్టాలు చేయిస్తానని అనిల్ డబ్బులు తీసుకున్నాడని  తెలిపా రు. దీంతో  ఆర్డీఓ  వీరి నుంచి  స్టేట్ మెంట్‌ను రికార్డు చేయాలని తహశీల్దారు తోట విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో ఆర్‌ఐలు బాధిత పోడు రైతుల నుంచి స్టేట్‌మెంటు రికార్డు చేశారు.  స్థానిక ఎస్సై ఎన్.గౌతమ్‌ను పిలిపించి ఈ కేసు విషయాన్ని ఆర్డీఓ చర్చించారు.

 కఠిన చర్యలు తప్పవు
 బోగస్ పాస్ పుస్తకాలు ఇప్పించిన భూక్యా అనిల్ అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆర్డీఆఓ దేశించారు. దీనికి భూక్యా అనిల్ తనపై కావాలనే తమ  గ్రామానికి చెందిన ఓ పోడు రైతు వీరందరితో ఫిర్యాదు చేయించాడని చెప్పడంతో ఆర్డీఓ స్పందించారు. వీరిద్దరిని అదుపులోకి విచారించాలని, నిజ నిజాలు తెలుస్తాయని ఎస్సైతో అన్నారు. విచారణ అనంతరం ఆర్డీఓ విలేకరులతో  మాట్లాడారు. పట్టా పాస్‌పుస్తకాలు బోగస్‌విగా గుర్తించామని తెలిపారు.

జూలూరుపాడు మండలంలో 1,090 మందికి పోడు పట్టాలు ఇచ్చామని, వీరికి 3301.73 ఎకరాలు భూమి కేటాయించామని అన్నారు. వినోభానగర్ గ్రామంలో 32.46 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ అయ్యాయని తెలిపారు.  ఏనిగ్జిర్-6లో నమోదు చేసి,   స్కానింగ్ కూడా జరిగిందని, అయితే ఇంకా 30 నుంచి 40 మాత్రమే నమోదు కాలేదని అన్నారు.  బోగస్ పట్టా పాస్ పుస్తకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చెందిన సంతకాలు మాత్రం కావని  అన్నారు.

అదేవిధంగా డీఎఫ్‌ఓ సంతకం అవునో కాదో తనకు తెలియదని, అప్పటి తహశీల్దారు డి.నాగుబాయి సంతకం చేశారని తెలిపారు.  ఖాళీ పాస్ పుస్తకాలు ఎలా బయటకు పోయాయని అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి బోగస్ పట్టా పాస్ పుస్తకాలు చాలా ఉండే అవకాశం లేకపోలేదని, పూర్తి స్థాయిలో విచారణ జరగిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement