సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న ఒకే రోజు నిర్వహిస్తున్న సమగ్ర సర్వే - 2014ను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి జిల్లా ప్రజలను కోరారు. ఆ రోజున అందరూ ఇళ్లలోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వేనే ప్రాతిపదిక అవుతుందని చెప్పారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లోని 8,07,725 కుటుంబాలను సర్వే చేస్తున్నట్లు చెప్పారు.
ఉదయం ఎనిమిది గంటలకే సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన అన్ని వివరాల నమోదుకు ఒక్కో సిబ్బందికి 25 ఇళ్ల చొప్పున కేటాయించామని, జిల్లాలో ఉన్న ఇళ్ల సంఖ్యను బట్టి మొత్తం 26, 266 మంది సిబ్బంది అవసరం అవుతారని చెప్పారు. ఇందుకోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు తదితర 24 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే గుర్తించామన్నారు.
మిగిలిన సిబ్బంది కోసం జిల్లా కేంద్రంలోని మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని తెలిపారు. అన్ని ఇళ్లను సమగ్రంగా కవర్ చేసేలా రూట్, సెక్టార్ అధికారులను కూడా నియమించామని చెప్పారు. సర్వే కోసం 700 వాహనాలను వినియోగించుకుంటామని, ఇందులో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులను కూడా వాడుతున్నామని తెలిపారు. సర్వే పూర్తిగా ప్రభుత్వ సిబ్బందే చేస్తారని, ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులను ఇందుకోసం వినియోగించడం లేదని అన్నారు.
ప్రతి ఒక్కరినీ కవర్ చేస్తాం...
జిల్లాలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కవర్ చే స్తామని కలెక్టర్ ఇలంబరితి స్పష్టం చేశారు. సొంత ఇల్లు ఉన్నా, లేకున్నా, మురికివాడల్లో నివాసమున్నా... అందరినీ సర్వే చేస్తామని చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో లేని వారి వివరాలు రికార్డు చేయబోమని, బోగస్ రికార్డులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే చేసిన ఇళ్లకు స్టిక్కర్లు ఇస్తామని చెప్పారు.
సర్వే పూర్తయిన తర్వాత ఒక్కో సిబ్బందికి ఇచ్చే 25 కుటుంబాలకు సంబంధించిన బుక్‌లెట్‌లను మండల స్థాయిలో ఒక చోటకు చేర్చి పోలీస్ బందోబస్తు పెడతామని, మరుసటి రోజున డేటా బేస్ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా సర్వేలో తప్పిపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఒక్క రోజు చేసినా 99.9శాతం సర్వే పూర్తవుతుందని, అలాంటివి ఏవైనా తమ దృష్టికి వస్తే పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సర్వే జరిగే రోజున సెలవుదినంగా ప్రకటిస్తామన్నారు.
రూ. 2 కోట్లు విడుదల..
సమగ్ర సర్వే కోసం జిల్లాకు రూ.2 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పది జిల్లాల్లో సర్వే కోసం రూ.20 కోట్ల నిధులిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి. ఆచార్య సోమవారం ఉత్తర్వులిచ్చారు.
19న ఇళ్లలోనే ఉండండి
Published Tue, Aug 5 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement