మనసొకటి... మాటొకటి! | Intentions is something, word is different thing | Sakshi
Sakshi News home page

మనసొకటి... మాటొకటి!

Published Sat, Jan 3 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

మనసొకటి... మాటొకటి!

మనసొకటి... మాటొకటి!

అపారమైన ప్రకృతి వనరులు, మేలురకం మానవ వనరులు ఏపీలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త ఏడాది ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్‌ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడంవల్ల అయోమయం తప్ప ఫలితముంటుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానే లేదు. ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప.
 
 ఢిల్లీ దర్బార్‌లో ఇటీవల ఒకరోజు. సింహాసనం ఎదుట ఆం.ప్ర. ఏలిక.
 ‘దేవరా, మోదీవరా! కొత్తరాష్ర్టంగా ఏర్పడ్డాం, పీకల్లోతు కష్టాల్లో వున్నాం. పెద్ద మనసుతో ఆదుకోవాలి’.
 ‘మీ అర్జీ మాకు తెలుసు. మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకు వచ్చారు. కానీ...’
 ‘అయ్యో, ఎంత మాట! అది అయ్యేపనికాదని మీకూ తెలుసు... మాకూ తెలుసు’.    
 ‘మరి?... పోలవరం తక్షణం పూర్తి చేయమంటారు. అంతేనా?’
 ‘తొందరేమి లేదు. ప్రస్తుతానికి ఎత్తిపోతల స్కీముతో ఎత్తిపోసుకునే ఆలో చన చేస్తున్నాము. ఆ  విషయాన్ని మీరు సావకాశంగా పరిశీలించవచ్చు.’
 ‘అయితే మీ మనసులోని మాటేమిటో... ఎన్టీఆర్‌కు భారతరత్న అడిగేం దుకు వచ్చారు. ఔనా?. కానీ, ఈసారికి నిర్ణయం జరిగిపోయింది. భవిష్యత్తులో చూద్దాం.’
 ‘నా మనసేమిటో తెలిస్తే మీ నోటి వెంట ఇలాంటి ప్రశ్న వచ్చేదే కాదు.’
 ‘మరి మీ కోరికేమిటో మీరే సెలవీయండి.’
 ‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్‌ను చేపట్టాము. మావాళ్లంతా ఈ ప్రాజెక్టు మీద గంపెడాశలు పెట్టుకు న్నారు. భూసమీకరణకు ప్రత్నిస్తున్నాము. కానీ భూసేకరణ చట్టాన్ని అలుసుగా తీసుకొని కొందరు సహకరించడం లేదు. మీరు తక్షణం ఆ చట్టం కోరలు పీకేయాలి.’
 ‘మేమూ అదే ఆలోచిస్తున్నాము. మా మీదా ఒత్తిడి పెరుగుతోంది. తప్పని సరిగా సవరిద్దాం. వచ్చే బడ్జెట్‌లో సుమా...’
 ‘అప్పటి దాకా ఆగలేము. అతి పే...ద్ద ప్రాజెక్టు. ప్రారంభం కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాము. మిమ్మల్ని ఇంకే కోరికా కోరము. హుద్‌హుద్ తుపాను సాయం కోసం కూడా పట్టుబట్టలేదు. ఈ విషయంలో మాత్రం తక్ష ణం ఆర్డినెన్స్ బాణాన్ని ప్రయోగించాలి. తప్పదు.’
 ‘మాకూ అవసరం... మీకూ అవసరం. అలాగే చేసేద్దాం. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ఎనభై శాతం మంది సమ్మతి, సామాజిక ప్రభావాల అంచనా వంటి నిబంధనల్ని తొలగిద్దాం’.
 ‘చట్టంలో మరో దుర్మార్గ నిబంధన కూడా వుంది. ముక్కారు పంటలు పండే భూములను అభివృద్ధి కోసం సేకరించవద్దట. ఆ నిబంధన కూడా తొల గించాలి. మా రాజధాని భూముల్లో మూడు పంటలూ పండుతాయి...’
 ‘ఇంకేమీ అడగనన్నారుగా... మీ కోసం అలాగే... ఆల్ ది బెస్ట్’
 కేంద్ర  సర్కార్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన సంభాషణలేమిటో మనకు తెలియదు కానీ, సారాంశం మాత్రం పైన చెప్పిందేనని ఢిల్లీ రాజకీయవర్గాల భోగట్టా. అపార రాజకీయానుభవశాలి, అపర చాణక్యుడు, హైదరాబాద్ నవ నిర్మాత వగైరా బిరుదులతో మీడియా చేత పిలిపించుకోవాలని తెగ ఉబలాట పడే చంద్రబాబునాయుడు గడచిన ఏడు మాసాల పాలనలో కేంద్రంలోని మిత్రపక్షం వద్ద చక్రం తిప్పి సాధించిన ఏకైక ఘన కారం్య- భూసేకరణ చట్టం కోరలు పీకే ఆర్డినెన్స్‌ను ఆగమేఘాల మీద జారీ చేయడమే.
 
 రాజధాని హడావుడిని మినహాయిస్తే, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా నిస్తేజమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలు అటకెక్కాయి. ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన సంతకాలకూ దిక్కులేదు. సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచనైతే పెంచారు కానీ, ఈ జాబితా నుంచి 18 లక్షల మందిని తొలగించారు. పునరుద్ధరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక, జీవనాధారం కోల్పోయిన షాక్‌ను తట్టుకోలేక గుండెపగిలి చనిపోతున్న వార్తలు ప్రతిరోజూ వినవస్తున్నాయి. రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాబు రుణమాఫీ మాటను నమ్మి తన విజయానికి తొలి కారణంగా నిలిచిన రైతు లోకాన్ని ఆయన వంచించిన తీరు రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నమ్మినందుకు ‘అన్న’కు వెన్నుపోటు తప్పనట్టే అన్నదాతకూ బాబు వెన్నుపోటు తప్పలేదు. బాబు వాగ్దాన భంగం దెబ్బకు మహిళల పొదుపు సంఘాలు కుదేలయ్యాయి. వారి పొదుపులు సగానికి సగం పడిపోయాయని ఒక అధ్యయనంలో తేలింది. రైతులకు పాత అప్పులు మాఫీకాక, కొత్త అప్పులు దొరకక వ్యవసాయం మూలనపడింది. దాంతో ఉపాధి లేక లక్షలాది మంది వలస బాట పట్టారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచే రెండున్నర లక్షలమంది కర్ణాటకకు వలస పోయారంటే  గ్రామాల పరిస్థితి ఎంత దైన్యంగా ఉందో తెలుస్తుంది. ఇంకా శీతాకాలంలోనే ఉన్నాం.
 
 వేసవికాలం రానే లేదు. అప్పుడే మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సుమారు రెండు వేల గ్రామాల గొంతు తడవాలంటే నీళ్ల ట్యాంకర్లు రావాల్సిందే. రక్షిత మంచినీటి వసతి లేక కలుషిత నీటి వాడకంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాథమిక వైద్యం పడకేసింది. బెజవాడ వంటి నగరంలోనే కుక్కకాటుకు మందులేక నిండు ప్రాణం బలైపోయిన సంఘటనను మనచిపోలేము. ఒక్క కర్నూలు జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే గడచిన సంవత్సరం 12 వేల మంది ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకొని బయటకొచ్చారు. వీరిలో కేవలం ఐదువందల మందికి మాత్రమే చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరికాయి. అవి కూడా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో. మిగతా ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగుల్లో కొందరు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుం టున్నారు. ఎక్కువ మంది నిరుద్యోగ సైన్యంలో కలసిపోయారు. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఇప్పటికే లక్ష మంది నమోదయ్యారు. ఇదే పరిస్థితి కొద్దిపాటి హెచ్చుతగ్గులతో రాష్ట్రమంతటా ఉంది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించేది. రాజకీయ కారణాలతో దాన్ని అటకెక్కించారు.
 
 హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో 1,500 కోట్ల నష్టం జరిగిందని అధికారులే తేల్చారు. ఇప్పటికీ పైసా పరిహారం రాలేదు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 670 మెకనైజ్డ్ బోట్లు ధ్వంసమై మత్స్యకారులు వీధినపడితే ఇప్పటికీ సాయం అందలేదు. పదమూడవ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల కోసం విడుదల చేసిన నిధులను కరెంటు బిల్లుల కింద ప్రభుత్వం కట్టేసుకుంది. ఇప్పుడు చీపుర్లుకొనే డబ్బులు కూడా లేని పంచాయతీలు స్వచ్ఛ భారత్ కోసం ఎలా కృషి చేస్తాయో చూడాలి. రాష్ట్ర వాస్తవ పరిస్థితులు ఇలావుంటే పూర్తి అసత్యాలతో కొత్త సంవత్సరం రోజున రాష్ట్రముఖ్యమంత్రి కొన్ని పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ప్రజల వివేకాన్ని, జ్ఞాపక శక్తిని కూడా ఎగతాళి చేసేదిగా ఉంది.
 
 జనవరి ఒకటో తేదీనాడు చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన సారాంశం- ‘‘2004 నాటికి నేను రాష్ట్రంలో ఒక స్వర్గాన్ని నిర్మించాను. ఆ తరువాత పాలకులు దానిని నరకంగా మార్చారు. సుదీర్ఘ పాదయాత్రలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగుల దుర్భర జీవితాలను చూసి చలించిపోయాను. వారి మోముల్లో వెలుగులు పూయిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందుకే అధికారంలోకి రాగానే రైతు రుణ విముక్తి, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల పెంపు, ఉద్యోగుల పదవీ విరమణ పెంపు, స్వచ్ఛమైన మంచినీరు, బెల్టుషాపుల రద్దు వంటి అంశాల ఫైళ్లపై సంతకం చేశాను. ఆ మేరకు రైతుకు రుణ ఉపశమనం చేశాను. తుపానును ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. యువశక్తి ఉంది. ఖనిజసంపద ఉంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుదాం.’’ కాబట్టి 2004 నాటికి రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ మేరకు అగ్రస్థానంలో నిలిపారో, ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో సూచించే కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం.
 
*    చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఆఖరు సంవత్సరం (2003- 04) రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల టన్నులు కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న చివరి సంవత్సరం (2008-09) ఆహార ధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులు.  
*    బీటీ పత్తి విత్తనాల ధర ప్యాకెట్‌కు చంద్రబాబు హయాంలో రూ. 1,850. రాజశేఖరరెడ్డి హయాంలో  రూ. 650.
*    రాష్ర్ట ఆర్థికవృద్థి చంద్రబాబు చివరి ఐదేళ్లలో 5.72% వైఎస్ ఐదేళ్ల కాలంలో 9.54%.
*    రాష్ర్ట ఆస్తులు- అప్పుల నిష్పత్తి చంద్రబాబు పాలనలో 45 :100, వైఎస్ పాలనలో 120 :100.
*    వరి కనీస మద్ధతు ధర చంద్రబాబు పాలనలో క్వింటాల్‌కు రూ. 490.  వైఎస్ పాలనలో రూ. 1,000.
*    ఐటీ ఉద్యోగుల సంఖ్య 2004 నాటికి 85,000. అదే 2009 నాటికి 2,50,000.
*    ఆర్టీసీ చార్జీలు చంద్రబాబు కాలంలో(1995-2004) ఐదుసార్లు పెరిగితే వైఎస్ కాలంలో (2004-2009) ఒక్కసారి కూడా పెరగలేదు.
*    అదే కాలంలో విద్యుత్ చార్జీలు చంద్రబాబు ఎనిమిదిసార్లు పెంచితే వైఎస్ ఒక్కసారి కూడా పెంచలేదు.
*    బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు. వైఎస్ మాత్రం ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, ఈబీసీ విద్యార్థు లకు ఈ పథకాన్ని అమలు చేశారు.
*   చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేశారు. వైఎస్ అమలు చేశారు.

 ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వ్యవసాయం చతికిలపడి, కులవృత్తులు మూలనపడి వయసొచ్చిన జనమంతా వలసబాట బట్టి కదల్లేని వృద్ధులతో, మొండి గోడలతో మిగిలిపోయి కళ తప్పిన నాటి గ్రామాలపై మహాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లే కన్నీరు పెడు తుందో’... అన్న గేయం ఒక్కటి చాలదా? చంద్రబాబు పాలనపై అంతకు మిం చిన అభిశంసన పత్రం ఇంకేముంటుంది? అపారమైన ప్రకృతి వనరులు- మేలు రకం మానవ వనరులు రాష్ర్టంలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త సంవత్సరం ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా (దృష్టిని కేంద్రీకరించాల్సిన రంగం) ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ (హార్డ్‌వేర్- సాఫ్ట్‌వేర్)-ఫార్మా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, పవర్‌ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడం వల్ల అయోమయం తప్ప ఫలితముం టుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానేలేదు.

ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప.   కొసమెరుపులాగా చంద్రబాబు పేద ప్రజలందరూ సంక్రాంతి రోజున పప్పన్నంలో నెయ్యి వేసుకొని తినాలని కోరుకుంటున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా ఆ ‘సంక్రాంతి గిఫ్ట్’ను అందజేయనున్నట్టు చెప్పారు. ఆయన అధికార దండం పట్టిన ఈ ఏడు మాసాల్లో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం, పంచదార తప్ప మరే సరుకూ అందలేదు! ‘పండక్కి పప్పన్నం, నెయ్యి’కి కూడా ఎన్నికల వాగ్దానాల గతే పట్టదనుకుందాం!
 - వర్ధెల్లి మురళి
 muralivardelli@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement