సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్‌లో జరిగింది.
ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు.
శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment