టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు | Telugu Association Of North Texas TANTEX Telugu Sahitya Vedika | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు

Published Thu, Sep 26 2024 10:35 AM | Last Updated on Thu, Sep 26 2024 10:35 AM

Telugu Association Of North Texas TANTEX Telugu Sahitya Vedika

ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ  శనివారం  డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక  206 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ 53  వ టెక్సాస్ సాహిత్య  సదస్సు కోపెల్, టెక్సాస్  నగరంలో  నిర్వహించారు.  'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సదస్సు జరిగింది. ఈ  ''సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల'' సదస్సు  ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ ''"రామ నామ ఉమ్మే....'' భక్తి గీతాన్ని  చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగానూ వీనుల విందుగాను  పాడి  సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను  చేసింది.

 టాంటెక్స్  పాలక మండలి సభ్యులు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు.  ఇటీవలే దివంగతులయిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ సంస్మరణగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు  పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల  అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు.

తర్వాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్  శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ''సాహిత్యంలో నారీభేరీ''అంశం గా  ప్రస్తుత సమాజంలో మహిళల  స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ''రామాయణ కల్పవృక్షం ''కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు. అలాగే  కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన  వైనాన్ని ఉదాహరణంగా వివరించటమేగాక వారి రచనలలోని తెలుగు భాషా  మాధుర్యాన్ని వివరణాత్మక ఉపన్యాసించడాన్ని  గుర్తుచేశారు.   

                                                                              

డాక్టర్ నరసింహా రెడ్డి  ఊరిమిండి  గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకున్నది.  ఈ కార్యక్రమంలో   శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో  పాటు,  అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుంచిసమాధానాలను రాబట్టడంలో విజయవంతమయ్యారు.

మహాకవి గురజాడ 162  వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు  గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకం రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని  పోయిన ద్వంద ప్రమాణాలను  కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరును  సోమసుందర్ గారు అద్భుతంగా వివరించారు. 

ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని  సోమసుందర్  అకాంక్షించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్  ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు. తర్వాత  ''సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణంలో కృష్ణశాస్త్రి  గారి రచన ప్రతిభా  పాటవాల్ని" శ్రీ  నరేందర్  చక్కగా విశ్లేషించడం జరిగింది.  ''సాహిత్యము, దాని ప్రభావము-మానవజీవన పరివర్తన'' అనే అంశముపై విట్టల్ రామశర్మ గారి ప్రసంగము,,''శ్రీ రామ రక్ష'' అంశంపై డా వెంకట నక్త  రాజు గారి ప్రసంగము, ''సమాజంపై గురువుల ప్రభావం''అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన '''శ్రీమతి ప్రేమలేఖ ''కథ సాహితీ ప్రియుల మనసులను  రంజింప చేశాయనడంలో సందేహం లేదు .

అనంతరం  వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ విరచిత ''దేశమును ప్రేమించుమన్నా''గేయాన్ని  దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల , చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా  ఆలపించడం జరిగింది. డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.  

ఈ  సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు, అలాగే మంచి విందు భోజనాన్ని అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.

ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ రెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,  జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి,  చిన సత్యంల తోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ మరియు  డాలస్,హ్యూస్టన్ ,ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. దయాకర్  మాడ  వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు  సతీష్ బండారు , సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక  మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులు   అభినందనీయులు .

(చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement