
అమెరికాలోని డాలస్‌లో భారతీయుడి దారుణ హత్య
హోటల్ మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్య తలపై వేటు వేసిన కార్మికుడు
ప్రాణభయంతో పరుగెత్తుతుండగా వెంటాడి హత్య
క్యూబా జాతీయుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్ అరెస్టు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు.
హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్‌పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్‌కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు.
అసలేం జరిగింది?
చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే హోటల్‌లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్‌తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు.
ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్‌ఫోన్‌ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకున్నారు. మారి్టనెజ్‌ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు.
ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్‌లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు.
కర్ణాటక వాసి నాగమల్లయ్య
నాగమల్లయ్య స్వస్థలం భారత్‌లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్‌టౌన్ సూట్స్ హోటల్‌లో మేనేజర్‌గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం.
