nikhileshwar
-
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పౌర హక్కుల కోసం పోరాడిన కన్నభిరాన్
లక్డీకాపూల్: పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడిన శక్తి కేజీ కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ’వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కేజీ కన్నభిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను కల్పనా కన్నభిరాన్ ఆంగ్లంలో అనువదించగా.. ‘ది స్పీకింగ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించింది. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. సభలో ఇంగ్లిష్ పుస్తక అనువాదకర్త, ఎడిటర్ కల్పన, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లా డారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. -
అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?
జాతీయోద్యమ కాలం నుంచీ ఒక ఉమ్మడి భాషగా హిందీ వ్యాపించిన వాస్తవాన్ని కాదనలేం. మరీ ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ (పాటలతో పాటు) మూలంగా దేశం నలుమూలలా హిందీ భాషను అర్థం చేసుకోగల వాతావరణం ఏర్పడింది. సాహిత్యపరంగా ప్రేమ్‌చంద్, రాహుల్ సాంకృత్యాయన్, జయశంకర్ ప్రసాద్, దిన్కర్ నిరాలా వంటి రచయితలు – కవులు, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పాఠకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ... హిందీయేతర ప్రాంతీయులకు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్ ప్రాబల్యం పెరిగిన తర్వాత, హిందీ వెనుకబడిపోయింది. ఇక అసలు వివాదమెక్కడంటే భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన (ఇంగ్లిష్తో సహా) 23 భాషలన్నీ జాతీయ భాషలే అనే యథార్థాన్ని హిందీవాదులు విస్మరించడం! ఫలితంగా హిందీ భాష ఆధిపత్యమనే ప్రమాదమున్నదని... ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేకత పెరిగింది. అయినా అక్కడే చెన్నైలో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ చేసిన భాషా సేవను తక్కువగా అంచనా వేయలేం. జాతీయ సమైక్యతకు హిందీ ఒక వాహికగా ఉండగలదనే నమ్మకమే ఆ ప్రచారానికి దోహదపడింది. ఇక ప్రాంతాల పరస్పర సంబంధాల రీత్యా, మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వారంతా మాతృభాషతోపాటు హిందీ –ఇంగ్లిష్ నేర్చుకొంటే... ఉత్తరాది వాళ్లు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లిష్తో సరిపెట్టుకొన్నారు. ప్రయోగ రీత్యా హరియాణా– పంజాబ్, బిహార్–ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో దక్షిణాది భాష లను అక్కడి కొన్ని విద్యాలయాల్లో బోధించినా ప్రోత్సాహం లభించలేదు. ఈ వైరుద్ధ్యం వల్ల ఈనాటికీ దక్షిణాది–ఉత్తరాది ప్రజల మధ్య భాషాపరంగా ఒక అగాథం మిగిలిపోయింది. బహుభాషా రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశంలో... ప్రాంతీయంగా అక్కడి భాష అధి కార భాషగా ఉన్నప్పటికీ చాలావరకు ఇంగ్లిష్‌లోనే పరిపాలన సాగుతున్న యథార్థాన్ని కాదనగలమా? తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు తప్ప ఇతరత్రా అక్కడి ప్రజల భాషలో అధికార తతంగ మంతా ఇంగ్లిష్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు హిందీని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగాల్లో, బ్యాంకు, పోస్టల్ సర్వీసుల్లో సమాంతరంగా ప్రవేశపెట్టి అధికార భాషగా చాలాకాలం కిందటే అమలు చేసింది. ఇక్కడే ఒక ఆచరణా త్మక వాస్తవాన్ని గుర్తించక తప్పదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో, కేంద్ర పాలనలో మిగతా 22 భాషలను అధికార భాషలుగా అమలు చేయడం ఆచరణలో అసాధ్యం. అందువల్ల ఉమ్మడి భాషలుగా ఇంగ్లిష్–హిందీ భాషలు మన వ్యవహారంలో అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాన్ని తిరస్కరించి, హిందీ పట్ల ద్వేషం పెంచుకోవడం భారతీయ భాషల పట్ల అపచారమే! బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి ద్వారా ఇంగ్లిష్ (మనదేశంలో వలస పాలన) ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఆ భాషను మనం సామ్రాజ్యవాద భాష అని తిరస్కరించామా? ఒకప్పుడు లోహియా సోషలిస్టులు ‘అంగ్రేజీ హఠావో’ (ఇంగ్లిష్‌ను తొలగించండి) అని ఉద్యమించినా, ఉపాధి రీత్యా, సాంకేతిక తదితర విద్యాబోధనా మాధ్యమంగా ఇంగ్లిష్ అనివార్యమై ప్రాథమిక స్థాయి నుంచే దానిని నేర్చుకోవాలనే స్థితికి చేరుకున్నాం. మరో అతి ముఖ్యమైన అంశం– అనుసంధాన భాషగా హిందీ ఈ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాష. భాషా పరంగా అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఒక రచయితగా నేను ఈరోజు హిందీలో కూడా రచనలు చేయగలుగుతున్నాను. హైస్కూలు స్థాయి నుంచి ‘త్రిభాషా సూత్రం’లో భాగంగా హిందీ రెండో భాషగా నేర్చు కోవడం వల్ల అది సాధ్యమైంది. గతంలో ఉర్దూ పదాల కలయికతో ‘హిందూస్తానీ’ భాషగా ప్రజల్లోకి వెళ్లిన హిందీని, ఉత్తరాది భాషా దురభిమానులు పనిగట్టుకుని సంస్కృతభూయిష్టంగా, పరిమితు ల్లోకి నెట్టివేశారు. అందువల్లే హిందుత్వ ఛాదస్తుల ప్రమాదం మరిం తగా భాషాపరంగా ఉందని చాలామంది భయపడుతున్నారు. ఇతరత్రా హిందీ మెజారిటీ ప్రజల భాష అనే వాదన పట్ల కొన్ని అభ్యంతరాలున్న మాట కూడా వాస్తవం. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన సంపాదకుడు, ప్రముఖ భాషావేత్త, జీఎన్ దెవీ వివరణ ప్రకారం– 2011లో నమోదైన (సంఖ్యాపరంగా) హిందీ భాషీయులు 52.83 కోట్లు. అయితే ఈ హిందీ అనే ప్రాంతా లలోనే భోజ్‌పురి, మైథిలి, ఛత్తీస్‌గఢ్, రాజస్థానీ, పవాడీ మొదలైన స్థానిక భాషలు కలిసి ఉన్నాయి. వీటిని తీసివేస్తే, హిందీ అనేది 32 శాతానికి దిగి వస్తున్నదని దెవీ వాదన. (క్లిక్: ఆంగ్లంతోనే అనుసంధానం) హిందీ ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నదే. దెవీ భావిస్తున్నట్టు హిందీ అందమైన భాష. సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకున్నది. హిందీ సినిమా జనామోదం వల్ల దేశానికి ఎంతో ఖ్యాతిని, విదేశీ మారకాన్ని సంతరించి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల, పాలనా సౌలభ్య రీత్యా హిందీని అనుసంధాన భాషగా గౌరవించాలి. ఇంగ్లి ష్‌తో పాటు హిందీ అవసరాన్ని గత వందేళ్ల చరిత్ర నిరూపించింది. (చదవండి: ఒక్క భాషకు పెత్తనమా?) - నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత -
నా జీవితమంతా సంఘర్షణే: నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాల సాహిత్య చరిత్రలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్. సమాజంలో ఉన్న జాడ్యాలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా దిగంబర సాహిత్యానికి అంకురార్పణ చేసిన ఆయన.. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. యువత సంకుచిత భావాలను పక్కనపెట్టినప్పుడే పురోగతి సాధ్యమని చెప్పే ఆయన.. 83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా, వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తాను రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కిగాను శనివారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆధునిక రచనలపై అభిప్రాయాలను, తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరం ఇప్పుడున్నది రచయితలకు పరీక్షా సమయం. జాతీయతను, దేశభక్తిని ప్రతీవ్యక్తి కోరుకుంటారు. కానీ ప్రజాస్వామిక, లౌకిక విధానాలతో, విలువలతో బ్రతుకుతున్న ఈ దేశంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరంగా పరిణమించాయి. పాలకులు అసహనంతో ఉన్నారు. తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపితే సహించడం లేదు. అణచిపెట్టి జైలుపాలు చేస్తున్నారు. భీమా కోరేగావ్ మొదలు వరవరరావును జైలులో పెట్టడం దాకా అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజల క్షేమం కోరే రచయితలు నిజంగా అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నట్టే. విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి గత 20 ఏళ్లలో ప్రధానంగా అస్తిత్వ పోరాటాల పరిణామం చోటు చేసుకుంది. ప్రతీవారు తమ ఉనికి కోసం, గుర్తింపు కోసం రచనలు చేయాలన్న ఆలోచన పెరిగింది. గుర్తింపుకోసం జరిగిన పోరాటంలో విప్లవ గ్రూపులుగానీ, కమ్యూనిస్టులుగానీ స్త్రీవాదులను, దళితులను పట్టించుకోలేదనే కారణంతో స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీవాదం ఏర్పడ్డాయి. ఆయా వర్గాల్లో కొత్త రచయితలు రావడం మంచి పరిణామమే అయినా.. కేవలం వారి వర్గాలపైనే రచనలను కేంద్రీకరించడం వల్ల ప్రధానమైన విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి. దేశంలో ఈ అస్తిత్వ పోరాటాలు, వ్యక్తిత్వవాదుల సంఖ్య పెరిగింది. కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు జరగాలి ఆరు దశాబ్దాల సామాజిక జీవిత అనుభవంతో గమనిస్తే.. తర్వాత తెలుగు సాహిత్యం ఇప్పటికీ సజీవంగా ఉందని కనిపిస్తోంది. చాలామంది సీనియర్ కవులు మంచి రచనలు చేస్తున్నారు. అయితే.. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని వ్యక్తివాద, సంకుచితదృష్టి నుంచి, మతవాదం నుంచి, కులతత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. సువిశాల దృష్టితో కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు చేయాల్సి ఉంది. సగంమంది అమ్ముడుపోయారు రచయితల్లో కెరీర్‌పై దృష్టిపెట్టేవారు, డబ్బు కోసం రచనలు చేసేవారు ఎక్కువయ్యారు. నిబద్ధతతో ప్రజా ఉద్యమాలకు, ప్రజలకు గొంతుకగా మారడానికి తక్కువ మందే మిగిలారు. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా చిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ సగంమంది రచయితలు పాలకవర్గాలకు అమ్ముడుపోయారు. వారి బాకాలుగా మారిపోయారు. బుద్ధిజీవులు, మేధావులు సైతం తమ బాధ్యత మరిచిపోతున్నారు. పదవులకు, అవార్డులకు ఎగబడటం వల్లే ఈ పరిణామం ఏర్పడింది. సాహిత్యంలో ఒక విభజన రేఖ వచ్చేసింది. ఆ సాహిత్యాన్ని అపార్ధం చేసుకున్నారు దిగంబర కవుల పేరిట వచ్చిన మూడు సంపుటాలకు ప్రశంసలు, విమర్శలు రెండూ పొందాం. యువతరం, అభ్యుదయభావాలు ఉన్నవారు.. ఇది సమాజంలో ఒక షాక్ ట్రీట్మెంట్గా ఉందని, తిరుగుబాటు లక్ష్యాన్ని పొందుతుందని ప్రశంసలు ఇచ్చారు. కానీ ఇందులో అశ్లీల పదజాలాన్ని, బూతులు వాడారంటూ సాహితీవేత్తలు అపార్థం చేసుకొన్నారు. వారి విమర్శలను ఈ విషయంపైనే కేంద్రీకరించుకున్నారు. అంతేతప్ప దిగంబర కవుల నిజాయతీని, ధర్మాగ్రహాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ భిన్నాభిప్రాయాల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాం. జీవితమంతా సంఘర్షణే.. నా జీవితమంతా సంఘర్షణే. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో మా అమ్మ నగరానికి తీసుకొచ్చి పెంచి పోషించారు. అక్కడి నుంచే నా జీవిత పోరాటం మొదలైంది. హైస్కూల్ దశ దాకా అన్వేషణ, వెతుకులాట, దిశాహీనమైన పరిస్థితులను చూశాను. హైస్కూల్ దశ దాటుతుండగా సాహిత్యం, నిరంతర పఠనం నన్ను కాపాడాయి. కుంభం యాదవరెడ్డి పేరుతో రచనలు మొదలుపెట్టాను. కళాశాలలో చేరినప్పుడు తీసుకున్న ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్ సబ్జెక్టులు నా జీవితానికి సాహిత్యపరంగా, అవగాహనపరంగా ఊతమిచ్చాయి. రెండు, మూడు ఉద్యోగాలు మారడం, ప్రేమ వివాహం చేసుకోవడం మరో సంఘర్షణగా మిగిలాయి. గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో తీపి, చేదు అనుభవాలు పొందాను. సాహిత్య పఠనం, నిరంతర అధ్యయనం నన్ను రక్షించాయి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని గత పదేళ్లుగా ప్రతి ఏటా నా మిత్రులు భావిస్తూ వచ్చారు. కానీ నేను ఏనాడూ అవార్డుల కోసం ఆశపడలేదు. ఇప్పుడు అవార్డు వచ్చినందుకు ఆనందంగానే ఉంది. ఆ కారణంగానే ‘విరసం’నుంచి బయటికి వచ్చాం దిగంబర కవులుగా 1965, 1967, 1968 సంవత్సరాల్లో మూడు సంపుటాలు వెలువరించాం. అందులోని దిగంబర కవులు నాటి యువతరానికి, వారి ధర్మాగ్రహానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ మూడు సంపుటాల్లోనూ తాత్వికమైన, సిద్ధాంతపరమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాం. ఈ పరిణామ క్రమంలో యువతరంలో సినిమా రంగం, రాజకీయ రంగాల పట్ల భ్రమలు తొలగిపోయాయి. నిరాశ, నిస్పృహలు, నిరుద్యోగం వల్ల ఆగ్రహం పెరిగింది. 1968–70 సమయంలో అంతర్జాతీయంగా ఉద్యమాలు వచ్చాయి. సహజంగానే నాటి యువ రచయితలు, మిగతావారు రచనలపరంగా, ప్రజలపరంగా మార్పు రావాలని కోరుకున్నారు. విప్లవమే మార్గమని యువత భావిస్తున్న సమయంలో.. నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు వంటివి ఆశాకిరణంగా కనిపించాయి. యువతరం ఆ వైపు మొగ్గింది. ఆ క్రమంలోనే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. కానీ 1970–75 మధ్య విప్లవానికి ఏ పంథా అవసరం, ప్రజలు ఎలా పాల్గొంటారు, రచయితలు స్వతంత్రంగా రాయగలిగి ప్రజలకు చైతన్య స్ఫూర్తిని ఇవ్వాలే తప్ప పార్టీకి తోకగా మారవద్దన్న ఆలోచన మొదలైంది. దీనితో విరసంలో చీలిక వచ్చి.. 1975లో బయటికి వచ్చేశాం. -
ప్రజా నిబద్ధతే నిఖిలేశ్వర్ కవిత్వ కొలబద్ద
నిఖిలేశ్వర్ ‘అగ్ని శ్వాస’కు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినా, ప్రజా నిబద్ధతే కొలబద్దగా వారి కవిత్వాన్ని తెలుగు సాహిత్య లోకం ఏనాడో గుర్తించింది. ‘నన్నయ్యను నరేం ద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి– లేపకు– నీ పీక నులిమి గోతిలోకి లాగు తాడు’ అంటూ దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్ కవితా ప్రస్థానం ఆరున్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎంకి పాటలు పాడుకుంటూ, కరుణశ్రీ పద్యాలకు మురిసిపోతూ, భావకవిత్వం ఊపులో కవిత లల్లుతూ, ఆత్మానుభూతి నుంచి సమష్టిలోకి, లోకానుభూతిలోకి తొలి అడుగులు వేసిన కుంభం యాదవరెడ్డి దిగంబర కవిత్వం ద్వారా నిఖిలేశ్వర్‌గా రూపాంతరం చెందారు. ప్రజాపోరాటాలతో పెనవేసుకుని, వర్గ చైతన్యాన్ని పెంచే విప్లవ కవిగా శ్రామిక విప్లవ పోరాటాలతో మమేకమయ్యారు. నల్లగొండ జిల్లా వీరవల్లి గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో ఏకైక సంతానంగా 1938లో నిఖిలేశ్వర్ పుట్టిన ఏడాదికే తండ్రి నరసయ్య మరణించారు. ‘గునుగుపూల తెల్లని జడలు, మోదుగుపూల చిలుక ముక్కులు, గుల్మొహర్ పరచిన ఎర్రతివాచీ’ వంటి బాల్యపు జ్ఞాపకాలు ఆయన కవిత్వంలో పరిమళిస్తుంటాయి. నిజాం పాలనలో గ్రామాలపై రజాకార్లు పడి దాడులు చేస్తుంటే, గడ్డివాముల్లో దాక్కున్న బాల్యం ఆయనది. పొట్ట చేతపట్టుకుని తల్లితో కలిసి భాగ్యనగరానికి వలస వచ్చారు. సుల్తాన్ బజార్, బాకారం, ముషీరాబాద్ వీధి బడులలో విద్యా భ్యాసం. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీలో కూలీగా తల్లి నర్సమ్మ శ్రమజీవనం. ఆయన ఆలోచనలు ఆర్యసమాజం మీదుగా హేతు వాదంలోకి, యామినితో కులాంతర వివాహానికి దారితీశాయి. నిఖిలేశ్వర్ 1956 నుంచే హిందీలో కవిత్వం రాయడం మొదలు పెట్టారు. కె. యాదవ రెడ్డి పేరుతో 1960–65 మధ్య భావకవిత్వం రాశారు. ‘నవ్యత నింపుకోవాలంటే కోపంగా వెనక్కి చూడు’ అంటూ ఆత్మానుభూతి నుంచే లోకానుభూతి వైపు తొంగి చూశారు. సమాజం కులతత్వం, మతత్వం, అవినీతి, బంధుప్రీతి తప్ప, సమష్టి ప్రయోజనం కోల్పోయిన దశలో కొత్త పేర్లతో ఆరుగురు దిగంబర కవులు 1965లో ఆవిర్భవించారు. ప్రపంచపు అచ్ఛాదనల్ని చీల్చుకుని, పెద్ద పెద్ద అలలతో దిగంబర కవిత్వం ఒక ఉప్పెనలా విరుచుకుపడింది. ఆనాటి సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ ఆరుగురు దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్‌ది సొంత గొంతుక. ‘ఈ దేశంలో ప్రతినగరం నవ నవలాడే మహాగాయం. దూరం నుండి అది ఎర్రగులాబి. దగ్గరకు వెళితే అది రక్తస్రావపు వ్రణం’ అంటారు. దిగంబర కవులు 1966ను నిఖిలేశ్వర్ నామ సంవత్సరంగా నామకరణం చేశారు. దిగంబరత్వం మానసికమైనదేకానీ భౌతికమైనది కాదు. అయినా, ఆరుగురు దిగంబర కవుల్లో అతి తక్కువ బూతు పదాలు వాడింది నిఖిలేశ్వరే. ఆయన ఆర్మీలో సివిలియన్ ఉపాధ్యాయుడిగా, మద్రాసు ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ క్లర్కుగా చేసినా, హైద రాబాద్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా స్థిర పడ్డారు. అంతకు ముందు గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా కూడా చేశారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కూడా కవిత్వం రాశారు. అనేక కథలు, సాహిత్య వ్యాసాలు రాశారు. వీరి కవిత్వం ఇంగ్లిష్, హిందీతోపాటు పలు భాషల్లోకి అనువాద మైంది. ‘గోడల వెనుక’ జైలు జ్ఞాపకాలు 1972లో వచ్చింది. భారత–చైనా మిత్రమండలి తరపున 2015 డిసెంబర్లో, పదిమంది సభ్యుల బృందంతో కలిసి నిఖిలేశ్వర్ పదిరోజుల పాటు చైనాలో పర్యటించారు. నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు నిఖిలేశ్వర్‌ను నిమ్మళంగా కూర్చోనివ్వలేదు. జ్వాలా ముఖి, చెరబండరాజు, నగ్నమునితో కలిసి విరసం వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఆయన కలం నుంచి ‘మండుతున్న తరం’ వచ్చింది. పీడీ యాక్టు కింద జ్వాలాముఖి, చెరబండరాజుతో కలిపి నిఖిలేశ్వర్‌ను 1971లో అరెస్టు చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ‘రోజూ తూర్పున ఎరుపెక్కే ఆకాశాన్ని, ద్వీపపు గోళాల్ని ఛేదించుకువచ్చే కిరణాల్ని, పశ్చిమాన ఎరుపెక్కే చంద్రుణ్ణి, రక్తస్నానం చేయించే సూర్యుల్ని ఎవరూ బంధించలేరు’ అంటారు జైలు నుంచి ‘నేరస్తుల ద్వీపం’లో. ‘దుక్కి దున్నిన చేతులకు దక్కిన దేమిటి?’ అని ‘ఈనాటికీ’ ప్రశ్నిస్తారు. ‘పిచ్చికుక్కల్లా కాటేసిన తుపాకుల చేతులు తిరిగి మన్నులోనే వెతుక్కోవాలి మానవత్వాన్ని’ అంటూ ఇంద్రవెల్లి కాల్పులపై పోలీసులకు ఆత్మబోధ చేస్తారు. ‘యథార్థాన్ని వికృతం చేసి వికటాట్టహాసం చేస్తున్న వెండితెర’ని తూర్పారబడతారు. బాల్యంలో వీరవల్లి వదిలాక నిఖిలేశ్వర్‌ను హైదరాబాదే అక్కన చేర్చుకుంది. ‘ప్రతి మారుమూలా గతుకుల, అతుకుల గల్లీల్లో అడుగులేస్తూ, పడుతూ, లేస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ’నే తిరిగారు. ‘సహనానికి హద్దులు చెరిపేసిన మతోన్మాదం’ అంటూ నాలుగు దశాబ్దాల నా మహానగరం’లో ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘ద్వేషపు కత్తులతో అతి చల్లగా నెత్తుటి నెలవంక’ను ఆ మహా నగరంలో చూశారు. ‘ఈ దేశంలోని ప్రతినగరం నవనవలాడే మహాగాయం’ అని బాధపడుతూనే, దీనికి హైదరాబాద్ ఏమీ అతీతం కాదని సమాధానపడతారు. ‘ప్రశ్నించే గొంతులను, తెగించే యువకులను ఎన్కౌంటర్ చేస్తున్నదెవరు?’ అని ప్రశ్ని స్తారు. ‘చరిత్రపాఠాలను నేర్పలేని వారు చరిత్రను అసలే నిర్మిం చలేరు’ అని కుండబద్దలు కొడతారు. ‘అనామకమైన ఈ బతుకు లోయలో నా పాదముద్రల ఆనవాళ్ళు చూడాలని వెనక్కి తిరిగితే గతమంతా తవ్వని జ్ఞాపకాల గనిగా మారిపోయింది. పెంటకుప్పల మీంచి గంతు లేసి, వరి పొలాల తల నిమరగానే పట్నం గల్లీల్లో పరుగు పెట్టిన కాళ్ళు కొంత దూరం ఎగిరిపోయిన అక్షరాల పావురాళ్ళ’ అని ‘జ్ఞాపకాలకొండ’ను తవ్వితీస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని ముసుగేసు కున్న కొత్త నియంత–గుర్రమెక్కి దౌడుతీస్తున్న వర్తమానం’ అని వ్యాఖ్యానిస్తారు. ‘కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కొడిగట్టే క్షణాలతో చేయూతనిచ్చే జీవనోత్సాహం’ అని ‘అగ్నిశ్వాస’లో ‘అగ్ని స్పర్శ’ను అనుభవిస్తారు. ‘మన అడుగుల కింద నలిగి కూడా దుమ్ము దులుపుకుని లేచి వడివడిగా నడిచే పిపీలికం’ లోని పట్టుదలను కూడా ‘అగ్నిశ్వాస’లో మనకందిస్తారు. నిఖిలేశ్వర్ కవిత్వం ఒక్కసారిగా విరుచుకుపడి ఆగిపోయే ఉప్పెన కాదు. నిరంతరం అలలతో కదలాడే జీవనదిలా సాగుతుంది. తన చుట్టూ ఉన్న మనుషులతో, తనతో తాను నిత్యం సంభాషి స్తున్నట్టుంటుంది. ఉద్యమాల ఉధృతి, అనుభవాల గాఢత నిఖి లేశ్వర్ కవిత్వాన్ని నడిపిస్తాయి. ఆయన కవిత్వమంతా జీవితాన్ని వ్యాఖ్యానించడంతో సరిపెట్టుకోదు, జీవితాన్ని మార్చేదిశగా ఆలోచింపజేస్తుంది. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94932 26180 -
‘నిఖిలేశ్వర్’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. తెలుగులో దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందిన నిఖిలేశ్వర్‌ను ఈ ఏడాది కేంద్రం సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాసకుగాను ఈ పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్. దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం అనే గ్రంథానికి గాను మొయిలీకి ఈ అవార్డు ప్రదానం చేశారు. నిఖిలేశ్వర్‌తో పాటు కన్నెగంటి అనసూయకు బాలసాహితీ పురస్కారం లభించింది. ఆమె రచించిన రచించిన "స్నేహితులు" లఘు కథల సంపుటికిగాను ఈ అవార్డు లభించింది. అలానే ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆమె రచించిన "మిలింద" లఘు కథల సంపుటికి అవార్డు లభించింది. విజేతలకు కేంద్ర సాహిత్య అకాడమీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం అందజేయనుంది. -
స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్య పతనమే
గత 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయా దశలలో పౌరుల అభివ్యక్తి స్వేచ్ఛపై ఆంక్షలు అధిక మవుతూనే ఉన్నాయి. అస మ్మతిని గౌరవించినపుడే ప్రజాస్వామిక మనుగడ సాధ్యమనే వాస్తవాన్ని పాల కులు మరిచిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలోని భాజపా సర్కార్, దేశభక్తి జాతీయవాదం– సంస్కృతి పేరిట ఈ అసమ్మతి హక్కును అన్ని విధాలా అణచి వేస్తున్నది. ప్రజా ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నా తమ అధికారానికి ముప్పు వాటిల్లగలదనే మానసి కత రాజ్యం చేస్తున్నది. అందులో భాగంగానే భీమా కోరేగావ్ దళితుల కార్యక్రమంపై క్రిమి నల్ కేసులు పెట్టి, మిత్రులు వరవరరావు ఇతర ప్రజా స్వామిక ఉద్యమకారులపై కక్షపూరితంగా నేరాలు మోపి, కనీసం బెయిల్ రాకుండా చేస్తున్నారు.ప్రస్తుతం ఉపా (యూఏపీఏ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఏకపక్ష నిర్బంధాల మూలానా వివిధకేసులలో, విచారణ లేకుండా మేధా వులు–ప్రజాస్వామికవాదులు జైళ్లలో మగ్గిపోతు న్నారు. కనీసం బెయిల్‌పై వచ్చే అవకాశాలు కోల్పో తున్నారు. ఒకవిధంగా ఇది రాజ్యహింసకు మరో రూపం. ఈ నేపథ్యంలో రాజ్యాంగ యంత్రాంగం ముసుగులో పాలకులు నియంతలుగా మారిపోతే, ప్రజల ఆగ్రహాన్ని తిరుగుబాట్లను చూడవలసి ఉంటుంది. అభివ్యక్తి స్వేచ్ఛను హరించినప్పుడల్లా ప్రజల గొంతులుగా, నాడిగా రచనలు చేసే కవులు– రచయితలు తమ ఆత్మవిశ్వాసాన్ని–నిబద్ధతను చాటు తూనే ఉన్నారు. మరోవైపు రాజ్యాంగపరంగా పేదలకు రక్షణ ఉన్నా, వలస కాలం నాటి చట్టాలు, నేరస్మృతిలో భాగంగా– ఆ రక్షణను లాగేసి, నిర్బంధాలను అమలు చేస్తున్నారు. ఈ దేశంలోని సెక్యులర్ వామపక్ష భావాలు గల వారందరినీ అణచివేయాలనే కక్షపూరిత వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. 1948లోనే రాజ్యాంగసభలో ప్రసంగిస్తూ మహానాయకుడు డా. అంబేడ్కర్ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ నూతన రాజ్యాంగపరంగా ఏవైనా తప్పులు జరిగితే మనకు చెడ్డ రాజ్యాంగం ఉందనేది కారణం కాదు. మనిషి నీచుడిగా (దుష్టుడిగా) పరిణమించాడని మనం అను కోవలసి ఉంటుంది’. ‘స్వేచ్ఛాభివ్యక్తి నేరం కాదు’ అనే శీర్షికన వెలువడిన పెంగ్విన్ ప్రచురణ ఇలాంటి అనేకానేక నిషేధాలను, నిర్బం ధాలను వెల్లడిస్తున్నది. వివిధ రూపాలలో రచయిత లను, జర్నలిస్టులను ఆయా దేశాలలోని ప్రభుత్వాలు ఎలా పీడిస్తున్నాయో వివరిస్తున్నది. ఇటీవల మన దేశంలో వెలువడిన ప్రచురణ (భారత్ అసమ్మతి) సంపాదకుడు అశోక్ వాజ్‌పేయి. ఈ దేశంలో భిన్నాభిప్రాయంతో ప్రశ్నించే సాంప్ర దాయం తరతరాలుగా కొనసాగుతున్నదనే చరిత్ర సంకలనమది. అన్ని కోణాల నుంచి నిజాన్ని దర్శించ గలిగే స్వతంత్రమైన చర్చ మాత్రమే యథార్థాన్ని వెలికితీయగలదు! ఈ ఆలోచనా క్రమంలోనే హెరాల్డ్ పింటర్ (2005 నోబెల్–సాహిత్య పురస్కార ప్రసంగం) జాతి–రంగు–భాష–లింగ భేదాలను దేశాల సరిహద్దులను దాటి ప్రపంచ రచయితల ఆత్మపరిశీలన కోసం, మనమంతా మననం చేసుకో వలసిన భావాలను వ్యక్తం చేశాడు. గతంలో అంతర్జాతీయ వార్తలతో సంచలనం లేవ దీసిన ప్రఖ్యాత టర్కిష్ నవలా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత అర్హన్ పాముక్ ఉదంతంతో ముగిస్తాను. పాముక్ ఒక స్విస్ వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నాడు ‘మా దేశంలో గతంలో 30 వేల కుర్దు జాతీయులను, 10 లక్షల ఆర్మేనియన్లను చంపివేశారు. నేను తప్ప మరెవరూ కూడా దాని గురించి మాట్లాడే సాహసం చేయడం లేదు’. ఈ చారిత్రక వాస్తవాన్ని తమ జాతీయుడే వెల్లడించేసరికి, టర్కీ ప్రభుత్వం జీర్ణించుకోలేక, పాముక్‌పై దేశద్రోహ నేరం మోపి న్యాయస్ధానానికి ఈడ్చింది. అయితే టర్కీ దేశంలోని న్యాయస్థానాలకు ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ పవిత్ర మైనదనే నమ్మకం ఆనాటికి ఉంది కాబట్టి పాముక్‌కు ఎలాంటి శిక్ష విధించలేకపోయింది. విచారణను వాయిదా వేస్తూ, టర్కీ దేశంలోని ప్రజాస్వామిక అభి వ్యక్తి స్వేచ్ఛకు అర్థమేమిటని కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.మనదేశంలో కూడా ప్రజా ఉద్యమాలు, రచ యితల, మేధావుల సంఘీభావ సహకారం, న్యాయాన్ని పరిరక్షించే న్యాయమూర్తులు–రాజ్యం విధించే నిషేధాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ సృజ నాత్మక రచయితలను రక్షించుకోగలరనే నమ్మకం మిగిలి ఉంది. వ్యాసకర్త: నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, మొబైల్ : 91778 81201 -
సవాళ్లకు ప్రజాతంత్ర సంస్కృతే సమాధానం
సాహిత్యం, సమాజం, రాజకీయాలలో నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రజాతంత్ర సంస్కృతే ప్రత్యామ్నాయం. పాలకులు పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ ఆ ప్రజలనే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. మరికొందరు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్ కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి. ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవోద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయం. సందర్భం దేశంలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా, సమాజంలో భాగంగా ఆయా రంగాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మనం అంటే– రచయితలుగా, మేధావులుగా, బుద్ధి జీవులుగా మాట్లాడుకుంటున్నాం. సమకాలీన సమాజంలో అందరికంటే ముందుగా మేల్కొని హెచ్చరిస్తున్న వాళ్లుగా ఆలోచిస్తున్నాం. శుష్క వాగ్దానాలతో, నినాదాలతో అధికారానికి వస్తున్న పాలకులు నేలపైనున్న వాస్తవాలను మరచి, ఆకాశంలో అంచనాలు వేస్తున్నారు. సమస్యల మూలాల నుంచి దారి మళ్లించి తాత్కాలిక ఉపశమనంతో బతుకు భారాన్ని మోయమంటున్నారు. ఆయా పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ వారినే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోయే ప్రయోగాలతో వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఎదిగిన ఇండియాను ఒకవైపు, ఇక్కడి నేలపై రుణ భారంతో, వ్యవసాయం గిట్టుబాటుగాక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దీనమైన భారత్‌ను మరోవైపు చూస్తున్నాం. రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్న వైరుధ్యాలు,అంతరాల మధ్యనే సామాజికంగా మతతత్వం, కుల జాడ్యం విస్తరించిన ఈ వ్యవస్థలో జీవిస్తున్న కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. భావప్రకటన, అభివ్యక్తి స్వేచ్ఛ అనే మౌలికమైన ప్రాథమిక, మానవ హక్కులను బంధించాలని పాలకవర్గాలు కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉండవలసిన కవులు, కళాకారులు, మేధావులు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. డిజిటల్ ఎలక్ట్రానిక్ విప్లవం వచ్చిన తర్వాత, నయా ఫాసిజం కోరలు చాస్తున్నది. అన్ని మానవ రంగాలపై నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నది. దళారీ పెట్టుబడిదారీ వర్గం సంపన్నుల సౌలభ్యం కోసం ఉన్నత మధ్యతరగతిని పెంచి పోషిస్తున్నది. క్యాపిటలైజేషన్లోని న్యాయమైన పోటీని కూడా అమలు చేయకుండా, మన రాజకీయ నాయకులు, పాలకులు భూస్వామ్య, ఫ్యూడల్ మానసికతతో పాలిస్తున్నారు. ఇక ఇంతవరకు అణగారిన కులాలు, తమ అస్తిత్వ పోరాటాల ద్వారా ఉనికిని చాటుకోవడం న్యాయమే. అయితే తాత్కాలికంగానైనా రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్‌కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి. ఇదే సందర్భాలలో వామపక్ష ఉద్యమాల వర్గపోరాటాల స్ఫూర్తిని తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామంవల్ల దళిత, వెనుకబడిన కులాల నుంచి వచ్చే ప్రజలు కేవలం కుల పోరాటాలకే పరిమితం కాగా వామపక్ష పోరాటాలు బలహీనపడిపోయిన వాస్తవాన్ని గుర్తించక తప్పదు. సమాంతరంగా విప్లవ రాజకీయ పక్షాల ప్రజా పోరాట చరిత్ర ఉంది. ప్రజానుకూల పంథాలో అతి, మితవాదాలను ఎదిరిస్తూ విప్లవకారులు ఏకం కావలసి ఉంది. ప్రస్తుతం మనకు రాజ్యాంగపరమైన హక్కులున్నా, వాటిని కాపాడవలసిన న్యాయ వ్యవస్థ బలహీన పడుతున్నది. ప్రజల మాన, ప్రాణాలను రక్షించవలసిన చట్టాలన్నీ అవినీతి పాలకుల కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి. పవిత్రమైన గ్రంథమనుకొనే మన రాజ్యాంగాన్ని వందసార్లు సవరించుకొన్నాం. సోషలిజం, సెక్యులరిజం నామమాత్రంగా అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. మరోవైపు గ్రామీణ ప్రజల కులవృత్తులు ధ్వంసమైన తర్వాత, ఉపాధి కోల్పోయి, పేదల సంఖ్య పెరిగి నగరాలకు వలసబాట పడుతున్నారు. ఇక సహజ వనరుల విధ్వంసం జరిగి పర్యావరణ సమతౌల్యం పెద్ద సవాలుగా మనముందున్నది. విద్య, వైద్యం సామాన్యుడికి అతి ఖరీదైపోగా, ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమైనాయి. విగ్రహాలు, మందిరాల నిర్మాణమే ప్రాధాన్యతను సంతరించుకోగా, ఆయా మతాచార్యులు, కాలం చెల్లిన సంప్రదాయాలతో సామాజిక జీవితాల్ని నిర్దేశిస్తున్నారు. పాలకులు తమ పదవుల భద్రత కోసం స్వాములవార్లకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎన్నికలు జూదంగా పరిణమించి, ఓటర్లను కొనివేయగలమనే ధీమా ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఈ రాజకీయ, సామాజికమైన సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ప్రజా పోరాటాల ద్వారానే సాధించుకోగలమనే నమ్మకం మిగిలి ఉంది. కార్మిక, రైతాంగ విప్లవపోరాటాల మార్గాన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస సామ్రాజ్యవాద శక్తులను ఓడించగలం. కీలకమైన వ్యవసాయిక విప్లవంతో భూమి సమస్య పరిష్కారం కాగలదని చరిత్ర చెబుతున్నది. మరో ముఖ్యమైన సవాలు–వర్తమాన సాంఘిక వ్యవస్థలోకి మార్కెట్ ఆర్థిక విధానాలవల్ల వాడకం దినుసుల వ్యామోహంతో విలాసాలకు ఎగబడే మన స్తత్వం వ్యాపించింది. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వికృతమైన వినోదం, లైంగిక విశృంఖలత మూలంగా స్త్రీ పురుష సంబంధాలలో, సహజమైన ప్రేమానుబంధాలు నశించిపోతున్నాయి. వ్యక్తి తోపాటు, కుటుంబాలు మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఇది. ఈ సంక్షోభాన్ని, మానవ సంబంధాలలో వచ్చిన మార్పును మన సమకాలీన సాహిత్యం చిత్రించడం లేదు. ఇప్పటికీ మధ్యతరగతి మనస్తత్వంతో, సంకుచిత వ్యక్తి స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్నది. పాలకుల ఫాసిస్టు చర్యలను ఎండగట్టే ప్రజలకు మనో ధైర్యాన్ని, ప్రతిఘటనా శక్తిని ఇవ్వవలసిన రచయితలు మౌనం వహిస్తున్నారు. పాలకులు భజనపరులైన కవులు, కళాకారుల అవకాశవాదాన్ని సహిస్తున్నారు. మెజారిటీ ప్రజాస్వామ్యం పేరిట, హిందుత్వ భావజాలంతో గోవుల రక్షణ, ఆహార వ్యవహారాలపై ఆంక్షలతో హత్యలను ప్రోత్సహిస్తున్న సంస్కృతిని సామూహిక స్వరం ద్వారా, సామూహిక ప్రజాతంత్ర సంస్కృతి ద్వారా ప్రతిఘటించక తప్పదు. ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవో ద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. అంతిమంగా మానవీయ విలువల కోసం, సామ్యవాద స్వప్నాన్ని నిజం చేయగల శక్తి ఈ దేశ ప్రజలకే ఉన్నదని నమ్ముతున్నాం. శ్రామికశక్తితో, మన ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో, రచయితలు తమ సృజనాత్మక శక్తితో వివిధ ప్రక్రియలలో పాపులిస్టు, కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయ మార్గం. (23.12–2018 జ్వాలాముఖి 10వ వర్ధంతి సదస్సులో చదివిన పత్రం) నిఖిలేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ కవి ‘ 91778 81201 -
అఖిల భారత కవితోత్సవానికి నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కవితా దినోత్సవాన్ని (వరల్డ్ పొయెట్రీ డే) పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో అఖిల భారత కవితోత్సవం నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో 22 భాషల కవులు తమ కవిత్వాలను వినిపించారు. తెలుగు నుంచి హైదరాబాద్‌కు చెందిన కవి నిఖిలేశ్వర్ పాల్గొన్నారు. విశ్వ సంస్కృతిలో కవిత్వం ఒక భాగమని, దేశంలో మానవ సంస్కృతి అంతరాత్మగా కవిత్వం వెలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. -
చిన్న బాహుబలి అనే పిలుస్తున్నారు..
బాహుబలి చిత్రంలో చిన్ననాటి అమరేంద్ర బాహుబలిగా.. అదేనండీ చిన్నప్పటి ప్రభాస్‌గా నటించిన నిఖిల్ గుర్తున్నాడుగా.. ఆ బాలనటుడు విశాఖలో శుక్రవారం ప్రారంభమైన బాలల జాతీయ చిత్రోత్సవానికి బుల్లి అతిథిగా హాజరయ్యాడు. బాహుబలి చిత్రం తనకు లభించిన గొప్ప అవకాశమనీ, అప్పట్నించీ తన పేరు చిన్న బాహుబలి అయిపోయిందని చెబుతున్నారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న నిఖిల్ సాక్షితో కొంతసేపు ముచ్చటించాడు. ఆ విశేషాలే ఇవి.. సాక్షి : హాయ్! నిఖిల్, నీ పూర్తి పేరు? నిఖిల్: నిఖిలేశ్వర్ సాక్షి : మీది హైదరాబాదేనా? నిఖిల్: మాది అమలాపురం దగ్గర నేదునూరు. కానీ డాడీ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. సాక్షి : ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎలా ఉంది? నిఖిల్: చాలా బాగుంది, నేను బాలల చిత్రోత్సవంలో పాల్గొనటం ఇదే తొలిసారి. ఇక్కడ ఇంత మంది పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశావు? నిఖిల్: 45 సినిమాలు పూర్తి చేశాను. మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నా. సాక్షి : నీ మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? నిఖిల్: నా మొదటి సినిమా లవ్లీ. ఆ సినిమా మా డ్యాన్సు మాస్టర్ ద్వారా వచ్చింది. నేను చిన్నప్పుడు సుబ్బరాజు మాస్టర్ దగ్గర డ్యాన్సు నేర్చుకునేవాడిని. నా ముఖంలో హావభావాలను గుర్తించి లవ్లీ డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చారు. సాక్షి : బాహుబలిలో నటించటం ఎలా ఉంది? నిఖిల్: బాహుబలి సినిమా నాకో గొప్ప అవకాశం. నేను ఎక్కడికి వెళ్లినా నా పేరుతో కాకుండా చిన్న బాహుబలి అని పిలుస్తున్నారు. సాక్షి : బాహుబలి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నిఖిల్: బాహుబలి సినిమా కోసం బాల నటుడు కావాలని ప్రకటించారు. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆడిషన్స్ నిర్వహించారు. ఆయనే నన్ను ఎంపిక చేశారు. సాక్షి : బాహుబలి–2లో కూడా నీ పాత్ర ఉందా? నిఖిల్: ఉంది. కానీ బాహుబలి మొదటి భాగంలోనే ఎక్కువ సేపు కనిపిస్తాను. రెండో భాగంలో నా పాత్ర కేవలం ఐదు నిమిషాలే. సాక్షి : మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంస? నిఖిల్: హీరో నాని అభినందన. కృష్టగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించేందుకు వెళ్లినప్పుడు బాహుబలిలో బాగా నటించావని నాని మెచ్చుకున్నారు. సాక్షి : రాజమౌళి లాంటి డైరెక్టర్‌తో పనిచేయటం ఎలా అనిపించింది? నిఖిల్: ఆయనతో పనిచేయటం చాలా గొప్ప విషయం. ప్రతీ సీన్ ను వివరించడమే కాకుండా ఎలా చేయాలో కూడా చేసి చూపించేవారు. అందుకే ఆయన డైరెక్షన్ లో చేయడాన్ని చాలా ఇష్టపడతాను. సాక్షి : మీ అభిమాన హీరో? నిఖిల్: సీనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ సాక్షి : తెలుగులో అందరి హీరోలతో నటించావా? నిఖిల్: లేదండీ.. ఈ మధ్య పవన్ కల్యాణ్ గారితో కాటమరాయుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆదే రోజు వేరే సినిమా షుటింగ్‌లో ఉండటం వలన నటించలేకపోయాను. సాక్షి : వైజాగ్ ఇంతకు ముందు వచ్చావా? నిఖిల్: ఇక్కడ మాకు బంధువులు ఉన్నారు. అందువలన నేను చాలా సార్లు వైజాగ్ వచ్చాను. నాకు ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టం. ప్రతీ సారి ఆర్కే బీచ్‌కు వెళ్తాను. సాక్షి : నీ ఫ్యూచర్ ప్లాన్? నిఖిల్: పెద్ద హీరోను కావటం. హీరోను కాకపోతే ఫుట్‌బాల్ ప్లేయర్ అవుతాను.