ప్రతీకాత్మక చిత్రం
సాహిత్యం, సమాజం, రాజకీయాలలో నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రజాతంత్ర సంస్కృతే ప్రత్యామ్నాయం. పాలకులు పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ ఆ ప్రజలనే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. మరికొందరు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్ కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి. ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవోద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయం.
సందర్భం
దేశంలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా, సమాజంలో భాగంగా ఆయా రంగాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మనం అంటే– రచయితలుగా, మేధావులుగా, బుద్ధి జీవులుగా మాట్లాడుకుంటున్నాం. సమకాలీన సమాజంలో అందరికంటే ముందుగా మేల్కొని హెచ్చరిస్తున్న వాళ్లుగా ఆలోచిస్తున్నాం. శుష్క వాగ్దానాలతో, నినాదాలతో అధికారానికి వస్తున్న పాలకులు నేలపైనున్న వాస్తవాలను మరచి, ఆకాశంలో అంచనాలు వేస్తున్నారు. సమస్యల మూలాల నుంచి దారి మళ్లించి తాత్కాలిక ఉపశమనంతో బతుకు భారాన్ని మోయమంటున్నారు. ఆయా పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ వారినే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు.
అంతరిక్షంలోకి దూసుకుపోయే ప్రయోగాలతో వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఎదిగిన ఇండియాను ఒకవైపు, ఇక్కడి నేలపై రుణ భారంతో, వ్యవసాయం గిట్టుబాటుగాక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దీనమైన భారత్‌ను మరోవైపు చూస్తున్నాం. రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్న వైరుధ్యాలు,అంతరాల మధ్యనే సామాజికంగా మతతత్వం, కుల జాడ్యం విస్తరించిన ఈ వ్యవస్థలో జీవిస్తున్న కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. భావప్రకటన, అభివ్యక్తి స్వేచ్ఛ అనే మౌలికమైన ప్రాథమిక, మానవ హక్కులను బంధించాలని పాలకవర్గాలు కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉండవలసిన కవులు, కళాకారులు, మేధావులు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం.
డిజిటల్ ఎలక్ట్రానిక్ విప్లవం వచ్చిన తర్వాత, నయా ఫాసిజం కోరలు చాస్తున్నది. అన్ని మానవ రంగాలపై నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నది. దళారీ పెట్టుబడిదారీ వర్గం సంపన్నుల సౌలభ్యం కోసం ఉన్నత మధ్యతరగతిని పెంచి పోషిస్తున్నది. క్యాపిటలైజేషన్‌లోని న్యాయమైన పోటీని కూడా అమలు చేయకుండా, మన రాజకీయ నాయకులు, పాలకులు భూస్వామ్య, ఫ్యూడల్ మానసికతతో పాలిస్తున్నారు. ఇక ఇంతవరకు అణగారిన కులాలు, తమ అస్తిత్వ పోరాటాల ద్వారా ఉనికిని చాటుకోవడం న్యాయమే. అయితే తాత్కాలికంగానైనా రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్‌కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి.
ఇదే సందర్భాలలో వామపక్ష ఉద్యమాల వర్గపోరాటాల స్ఫూర్తిని తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామంవల్ల దళిత, వెనుకబడిన కులాల నుంచి వచ్చే ప్రజలు కేవలం కుల పోరాటాలకే పరిమితం కాగా వామపక్ష పోరాటాలు బలహీనపడిపోయిన వాస్తవాన్ని గుర్తించక తప్పదు. సమాంతరంగా విప్లవ రాజకీయ పక్షాల ప్రజా పోరాట చరిత్ర ఉంది. ప్రజానుకూల పంథాలో అతి, మితవాదాలను ఎదిరిస్తూ విప్లవకారులు ఏకం కావలసి ఉంది. ప్రస్తుతం మనకు రాజ్యాంగపరమైన హక్కులున్నా, వాటిని కాపాడవలసిన న్యాయ వ్యవస్థ బలహీన పడుతున్నది. ప్రజల మాన, ప్రాణాలను రక్షించవలసిన చట్టాలన్నీ అవినీతి పాలకుల కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి. పవిత్రమైన గ్రంథమనుకొనే మన రాజ్యాంగాన్ని వందసార్లు సవరించుకొన్నాం.
సోషలిజం, సెక్యులరిజం నామమాత్రంగా అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. మరోవైపు గ్రామీణ ప్రజల కులవృత్తులు ధ్వంసమైన తర్వాత, ఉపాధి కోల్పోయి, పేదల సంఖ్య పెరిగి నగరాలకు వలసబాట పడుతున్నారు. ఇక సహజ వనరుల విధ్వంసం జరిగి పర్యావరణ సమతౌల్యం పెద్ద సవాలుగా మనముందున్నది. విద్య, వైద్యం సామాన్యుడికి అతి ఖరీదైపోగా, ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమైనాయి. విగ్రహాలు, మందిరాల నిర్మాణమే ప్రాధాన్యతను సంతరించుకోగా, ఆయా మతాచార్యులు, కాలం చెల్లిన సంప్రదాయాలతో సామాజిక జీవితాల్ని నిర్దేశిస్తున్నారు. పాలకులు తమ పదవుల భద్రత కోసం స్వాములవార్లకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎన్నికలు జూదంగా పరిణమించి, ఓటర్లను కొనివేయగలమనే ధీమా ఏర్పడింది.
ఇలాంటి స్థితిలో ఈ రాజకీయ, సామాజికమైన సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ప్రజా పోరాటాల ద్వారానే సాధించుకోగలమనే నమ్మకం మిగిలి ఉంది. కార్మిక, రైతాంగ విప్లవపోరాటాల మార్గాన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస సామ్రాజ్యవాద శక్తులను ఓడించగలం. కీలకమైన వ్యవసాయిక విప్లవంతో భూమి సమస్య పరిష్కారం కాగలదని చరిత్ర చెబుతున్నది. మరో ముఖ్యమైన సవాలు–వర్తమాన సాంఘిక వ్యవస్థలోకి మార్కెట్ ఆర్థిక విధానాలవల్ల వాడకం దినుసుల వ్యామోహంతో విలాసాలకు ఎగబడే మన స్తత్వం వ్యాపించింది. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వికృతమైన వినోదం, లైంగిక విశృంఖలత మూలంగా స్త్రీ పురుష సంబంధాలలో, సహజమైన ప్రేమానుబంధాలు నశించిపోతున్నాయి.
వ్యక్తి తోపాటు, కుటుంబాలు మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఇది. ఈ సంక్షోభాన్ని, మానవ సంబంధాలలో వచ్చిన మార్పును మన సమకాలీన సాహిత్యం చిత్రించడం లేదు. ఇప్పటికీ మధ్యతరగతి మనస్తత్వంతో, సంకుచిత వ్యక్తి స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్నది. పాలకుల ఫాసిస్టు చర్యలను ఎండగట్టే ప్రజలకు మనో ధైర్యాన్ని, ప్రతిఘటనా శక్తిని ఇవ్వవలసిన రచయితలు మౌనం వహిస్తున్నారు. పాలకులు భజనపరులైన కవులు, కళాకారుల అవకాశవాదాన్ని సహిస్తున్నారు. మెజారిటీ ప్రజాస్వామ్యం పేరిట, హిందుత్వ భావజాలంతో గోవుల రక్షణ, ఆహార వ్యవహారాలపై ఆంక్షలతో హత్యలను ప్రోత్సహిస్తున్న సంస్కృతిని సామూహిక స్వరం ద్వారా, సామూహిక ప్రజాతంత్ర సంస్కృతి ద్వారా ప్రతిఘటించక తప్పదు.
ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవో ద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. అంతిమంగా మానవీయ విలువల కోసం, సామ్యవాద స్వప్నాన్ని నిజం చేయగల శక్తి ఈ దేశ ప్రజలకే ఉన్నదని నమ్ముతున్నాం. శ్రామికశక్తితో, మన ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో, రచయితలు తమ సృజనాత్మక శక్తితో వివిధ ప్రక్రియలలో పాపులిస్టు, కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయ మార్గం.
(23.12–2018 జ్వాలాముఖి 10వ వర్ధంతి సదస్సులో చదివిన పత్రం)
నిఖిలేశ్వర్
వ్యాసకర్త ప్రముఖ కవి ‘ 91778 81201
Comments
Please login to add a commentAdd a comment