Collective
-
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమష్టి కృషితో వర్సిటీ ప్రగతి
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతికి ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమేనని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వీసీ సత్కరించారు. ఫార్మశీ విభాగం నిర్వహించిన పదవీవిరమణ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు తమ అనుభవాన్ని వర్సిటీ అభివృద్ధి్దకి వినియోగించాలని సూచించారు. దశాబ్ధాలుగా వర్సిటీకి విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించడం మంచి పరిణామమన్నారు. వీరి సేవలను వర్సిటీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఈఏ నారాయణ మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ జీవనాన్ని సాగించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను వర్సిటీ గుర్తిస్తుందన్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, కార్యదర్శి పి.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
కలెక్టరేట్ (మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఎం. రఘునందనరావుకు మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, జెడ్పీ సీఈవో సుదర్శనం తదితర అధికారులు ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. తమ గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వుతున్నారని కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారానికి చెందిన చింతపాటి పద్మావతి ఫిర్యాదు చేశారు. ఈ చెరువులను పూడ్పిం చాలని విజ్ఞప్తిచేశారు. తమ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మానం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన దాసు శరబంది ఫిర్యాదుచేశారు. తమ ప్రాంతంలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని గుడివాడకు చెందిన కడియం నాగరాజు అర్జీ దాఖలు చేశారు. ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి గుర్తింపుకార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని ఐకేపీ యానిమేటర్స్ (వీవోఏ) సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సౌజన్య, గౌరవాధ్యక్షురాలు ఎ.కమల అర్జీ ఇచ్చారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణాల కోసం ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న తమకు తెలియకుండా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బందరు మండలం ఎస్.ఎన్.గొల్లపాలెం శ్మశానభూమికి రహదారి రహదారి సౌకర్యంలేదని గ్రామానికిచెందిన బి.రాజేష్, లక్ష్మణ్ తదితరులు అధికారులకు వివరిం చారు. గ్రామస్తులు చనిపోయినప్పుడు సరి హద్దు పొలాల యజమానులను బతిమలాడి మృతదేహాలను తీసుకువెళ్లాల్సి వస్తోం దని ఆందోళన వ్యక్తంచేశారు. శ్మశానానికి రహదారి వసతి కల్పించాలని అర్జీలో వేడుకున్నారు. మండల కేంద్రమైన గూడూరులో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి రెండు వైపులా ఆర్ఎస్ నంబరు 393/1లో ఉన్న సుమారు 250 ఎకరాల గ్రామకంఠం భూమిలో పలువురు నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేసేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ శివారు నాగవరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఐఏవై కింద పక్కాఇళ్లు మంజూరు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో మచిలీపట్నంలోని రాజుపేట, దళితవాడ, మగ్గాలకాలనీ, యానాదుల కాలనీలో డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడ్తారని గతంలో అధికారులు ప్రకటించినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని కేవీపీఎస్ నాయకుడు సీహచ్ రాజేష్ తదితరులు అర్జీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెడన మండలం చోడవరం గ్రామంలో కేసుగుంట చెరువు పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన పి.లక్ష్మీనారాయణ తదితరులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ‘విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సాయిశ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ 53వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నాయకులు కరీమున్నీసా తదితరులు అర్జీ ఇచ్చారు. -
కలెక్టరేట్లో దొంగలు పడ్డారు
కలెక్టరేట్ : జిల్లా పరిపాలనకు గుండె కాయలాంటి కలెక్టరేట్లోనే దొంగలు పడిన సంఘటన సంచలనం సృష్టిస్తుంది. నిత్యం వందలాది మంది ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలతో కిటకిటలాడే కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) ఛాంబర్లో ఇటీవల కంప్యూటర్ మాయమైంది. చాంబర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత అధికారితో పాటు అక్కడ ఒక అటెండర్ కూడా ఉంటాడు. చాంబర్ పక్కనే రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ ఎప్పుడూ వివిధ పనులు కోసం ఉద్యోగులు కిందకు...పైకి తిరుగుతుంటారు. మరి ఇలాంటి చోట కంప్యూటర్ ఏ విధంగా మాయమైందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎప్పుడు అత్యంత రద్దీగా కలెక్టరేట్లో కంప్యూటర్ దొంగిలించారంటేనే విస్మయం కలుగుతుంది. అసలు కంప్యూటర్ ఎప్పుడు పోయింది.. ఏ సమయంలో పోయింది అనే విషయంపై సంబంధిత అధికారుల్లోనే స్పష్టతలేదని తెలుస్తుంది. ఏఓ చాంబర్లో జిల్లాకు సంబంధించిన అనేక కీలకమైన ఫైళ్లు ఉంటాయి. వాటికి సంబంధించిన సమాచారం కంప్యూటర్లో నిక్షిప్తమై ఉండడం వల్లనే దానిని దొంగిలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా మండలాల నుంచి సమాచారం ఏఓకు చేరుతుంది. ఇంతటి ప్రాముఖ్యత గల చాంబ ర్లో కంప్యూటర్ దొంగతనానికి గురైనా దానిపై విచారణ కూడా చేయించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా అసలు ఈ కంప్యూటర్ను దొంగిలించింది ఇంటి దొంగలా లేక బయటి వాళ్ల అనే విషయాలపై కూడా ఇక్కడి వారు దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధం గా ఏఓ చాంబర్లో మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లు కూడా పోయాయనే ప్రచారం జరుగుతుంది. జిల్లాకు ప్రధాన కార్యాలయం అయిన కలెక్టరేట్లోనే భద్రత కరువయితే ఇక మిగతా కార్యాలయాల్లో అన్ని సక్రమమేనా అనే సందేహాలు తెలెత్తకమానవు. కంప్యూటర్ దొంగతనంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే దొంగలు రెండు రోజుల్లోనే దొరికే అవకాశముందనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుంది. కంప్యూటర్ పోయింది వాస్తవమే : సత్తయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారికలెక్టరేట్ పరిపాలనాధికారి చాంబర్లో కంప్యూటర్ పోయిన విషయం వాస్తవమే. అది పోయిన సమయంలో నేను పరిపాలనాధికారిగా లేను. కంప్యూటర్ పోయిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహా గుబులు !
చెత్త డంపింగ్‌కు ససేమిరా అన్న మండూరు వాసులు డంప్ చేస్తే విషం తాగుతాం ! తీవ్ర నిరసనల మధ్య డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి రామలింగారెడ్డి ముందుచూపులేని పాలికె బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరు మహానగర పాలికెకు చెత్త గుబులు పట్టుకుంది. ఇన్నాళ్లు నగరంలోని చెత్తను మండూరు యార్డుకు తరలిస్తున్న విషయం తెల్సిందే. జూన్ ఒకటి తరువాత చెత్తను మండూరుకు తరలించేది లేదని అప్పటి వరకు గడువు కోరిన బీబీఎంపీ ఇప్పుడు చెత్తను ఎక్కడికి తరలించాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బెంగళూరుకు 18 కి.మీ దూరం ఉన్న మండూరులో చెత్తను డంపింగ్ ఆపివేయాలని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వ స్తున్నారు. జనవరి ఒకటి నుంచి చెత్త డంపింగ్ ఆపివేస్తామని మొదటిసారిగా పాలికె మాట ఇచ్చింది. అటు తరువాత జూన్ ఒకటి వరకు గడువు కోరింది. ఆ గడువు కూడా పూర్తి కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవ డంలో పాలికె పూర్తిగా విఫలమైంది. ఇదిలా ఉంటే ఆదివారం మండూరుతో పాటు బయ్యప్పనహళ్లి, గుండూరు, బొమ్మసంద్ర, మల్లసంద్ర, బీదరహళ్లి, భీమసంద్ర తదితర గ్రామాలకు చెందిన ప్రతి ఇంటికొక మహిళ స్వచ్ఛంద ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పాలికె అధికారుల దిమ్మతిరిగింది. మరొసారి డంపింగ్ చేస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని పలువురు విషం బాటిళ్లు చేతపట్టుకుని బైఠాయించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణతో సహ అధికారులు మండూరు చేరుకుని స్థానికులకు న చ్చచెప్పడానికి ప్రయత్నించారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రితో సహ మేయర్, కమిషనర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు వీరు డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. మండూరులో డంపింగ్ యార్డ్ వద్దని, తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఉన్న చుట్టు పక్కల 10 కిలోమీటర్లు పొడవునా దుర్వాసన భరించలేకున్నామని, రోగాలతో ఎప్పుడో పోతామోనని ఆందోళన పడుతున్నామని కొందరు మహిళలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులకు మాజీ మంత్రి, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావలి, మండూరు గ్రామ పంచాయతీ సభ్యుడు రాకేష్‌గౌడ తదితరులు మద్దతుగా నిలిచారు. -
యువతే కీలకం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు నమోదుపై ఈసారి యువత అమితాసక్తిని ప్రదర్శించింది. అది భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. జిల్లాలో ఐదేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే యువత ఓట్లు గణనీయంగా పెరిగాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న కృత నిశ్చయంతో యువత ఓటు హక్కుతో ముందుకు దూసుకెళ్తోంది. గతానికి భిన్నంగా ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు నూరు శాతం ఫలించాయి. విశ్వ విద్యాలయాలు, కళాశాలలలో ప్రత్యేకంగా ఓటరు నమోదుకు భారీ స్పందన లభించింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది జనవరినాటికి 29,530 ఓట్లు పెరిగాయి. ఓటర్ల జాబితాలో 30 శాతం యువకులే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారి అనుగ్రహానికి పావులు కదుపుతున్నాయి. ఇదీ పరిస్థితి యువ ఓటర్లు గత ఎన్నికల నుంచి ఇప్పటికీ, అనూహ్యంగా నాలుగు రెట్లు అధికంగా పెరిగా యి. 2009లో 18-19 ఏళ్ల వయసు కలిగిన నూతన ఓటర్లు 13,878 మాత్రమే నమోదు కాగా, ఈ సారి ఇప్పటికే 19,530 మంది ఓట ర్లుగా చేరారు. జిల్లా జనాభాకు అనుగుణంగా ఓటర్లు పెరిగినా, మొత్తం ఓటర్లలో యువకులు 30 శాతం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 18,04,765 ఓట్లలో యువకులు సుమారుగా 5,41,218 వరకు ఉంటారని అధికారుల నివేదికలు చెప్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బోధన్, బాన్సువాడలలో కొత్త ఓటర్ల లో అధిక శాతం యువ ఓటర్లు నమోదయ్యా రు. జిల్లా మొత్తంగా ఐదు నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారనుం డగా, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెం బ్లీ ఎన్నికల్లో వారి అనుగ్రహం పొందేందుకు రాజకీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభిం చా యి. ఏదేమైనా ఇక భవిష్యత్ యువతదేన్న సం కేతాలు రాజకీయ పార్టీల్లో కదలిక తెస్తున్నాయి. ఏమంటున్నారు చాలా మంది యువతీయువకులు ఈసారి ఓటు హక్కును వజ్రాయుధంగా మార్చుకుం టామని చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరుణంలో తెలంగాణ వికాసంలో పాలు పంచుకుంటామన్నారు. ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక పాత తరం రాజకీయానికి చెల్లుచీటీ ఇచ్చి కొత్త బంగారులోకంలోకి దారులు తీస్తామని చెబుతున్నారు. యువతను ఆదరించే, వారికి చక్కని భవితను కల్పించే నాయకత్వాన్ని తాము కోరుకుంటామని అంటున్నారు. జిల్లా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటు పడే యువ నాయకత్వానికి స్వాగతం పలుకు దామం టున్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోండి
సవేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పాఠశాల శాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలెక్టరేట్లో తాళికి బంగారం పథకం కింద లబ్ధిదారులకు నాలుగు గ్రాముల బంగారం, నగదు చెక్కులను మంత్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత అన్నాడీఎంకే పార్టీకి మాత్రమే చెల్లిందన్నారు. మహిళల కష్టాలు సాటి మహిళకే తెలుసుననే అనే విధంగా రాష్ట్రంలోని మహిళల కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. వేలూరు జిల్లాలోని ఎనిమిది తాలుకాల్లో 1874 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల 51లక్షల 21వేల విలువ చేసే బంగారం, నగదును అందజేస్తున్నామన్నారు. డిగ్రీ చదివిన పేద వారికి వివాహం కోసం రూ.50 వేలతో పాటు నాలుగు గ్రాముల బంగారం అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శులు ఏయుమలై, ఎస్ఆర్కే అప్పు, తిరుపత్తూరు సబ్ కలెక్టర్ శిల్పా ప్రభాకరన్, సాంఘిక సంక్షేమ అధికారి గోమది, అధికారులు, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు.