పథకాలను సద్వినియోగం చేసుకోండి
Published Wed, Jan 22 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
సవేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పాఠశాల శాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో తాళికి బంగారం పథకం కింద లబ్ధిదారులకు నాలుగు గ్రాముల బంగారం, నగదు చెక్కులను మంత్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత అన్నాడీఎంకే పార్టీకి మాత్రమే చెల్లిందన్నారు. మహిళల కష్టాలు సాటి మహిళకే తెలుసుననే అనే విధంగా రాష్ట్రంలోని మహిళల కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు.
వేలూరు జిల్లాలోని ఎనిమిది తాలుకాల్లో 1874 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల 51లక్షల 21వేల విలువ చేసే బంగారం, నగదును అందజేస్తున్నామన్నారు. డిగ్రీ చదివిన పేద వారికి వివాహం కోసం రూ.50 వేలతో పాటు నాలుగు గ్రాముల బంగారం అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శులు ఏయుమలై, ఎస్‌ఆర్‌కే అప్పు, తిరుపత్తూరు సబ్ కలెక్టర్ శిల్పా ప్రభాకరన్, సాంఘిక సంక్షేమ అధికారి గోమది, అధికారులు, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు.
Advertisement