కలెక్టరేట్‌లో దొంగలు పడ్డారు
కలెక్టరేట్ : జిల్లా పరిపాలనకు గుండె కాయలాంటి కలెక్టరేట్‌లోనే దొంగలు పడిన సంఘటన సంచలనం సృష్టిస్తుంది. నిత్యం వందలాది మంది ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలతో కిటకిటలాడే కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) ఛాంబర్‌లో ఇటీవల కంప్యూటర్ మాయమైంది. చాంబర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత అధికారితో పాటు అక్కడ ఒక అటెండర్ కూడా ఉంటాడు. చాంబర్ పక్కనే రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ ఎప్పుడూ వివిధ పనులు కోసం ఉద్యోగులు కిందకు...పైకి తిరుగుతుంటారు. మరి ఇలాంటి చోట కంప్యూటర్ ఏ విధంగా మాయమైందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎప్పుడు అత్యంత రద్దీగా కలెక్టరేట్‌లో కంప్యూటర్ దొంగిలించారంటేనే విస్మయం కలుగుతుంది. అసలు కంప్యూటర్ ఎప్పుడు పోయింది.. ఏ సమయంలో పోయింది అనే విషయంపై సంబంధిత అధికారుల్లోనే స్పష్టతలేదని తెలుస్తుంది.
ఏఓ చాంబర్‌లో జిల్లాకు సంబంధించిన అనేక కీలకమైన ఫైళ్లు ఉంటాయి. వాటికి సంబంధించిన సమాచారం కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉండడం వల్లనే దానిని దొంగిలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా మండలాల నుంచి సమాచారం ఏఓకు చేరుతుంది. ఇంతటి ప్రాముఖ్యత గల చాంబ ర్‌లో కంప్యూటర్ దొంగతనానికి గురైనా దానిపై విచారణ కూడా చేయించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా అసలు ఈ కంప్యూటర్‌ను దొంగిలించింది ఇంటి దొంగలా లేక బయటి వాళ్ల అనే విషయాలపై కూడా ఇక్కడి వారు దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదేవిధం గా ఏఓ చాంబర్‌లో మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లు కూడా పోయాయనే ప్రచారం జరుగుతుంది. జిల్లాకు ప్రధాన కార్యాలయం అయిన కలెక్టరేట్‌లోనే భద్రత కరువయితే ఇక మిగతా కార్యాలయాల్లో అన్ని సక్రమమేనా అనే సందేహాలు తెలెత్తకమానవు. కంప్యూటర్ దొంగతనంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే దొంగలు రెండు రోజుల్లోనే దొరికే అవకాశముందనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుంది. కంప్యూటర్ పోయింది వాస్తవమే : సత్తయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారికలెక్టరేట్ పరిపాలనాధికారి చాంబర్‌లో కంప్యూటర్ పోయిన విషయం వాస్తవమే. అది పోయిన సమయంలో నేను పరిపాలనాధికారిగా లేను. కంప్యూటర్ పోయిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు.