కలెక్టరేట్ (మచిలీపట్నం): కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఎం. రఘునందనరావుకు మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, జెడ్పీ సీఈవో సుదర్శనం తదితర అధికారులు ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
తమ గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వుతున్నారని కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారానికి చెందిన చింతపాటి పద్మావతి ఫిర్యాదు చేశారు. ఈ చెరువులను పూడ్పిం చాలని విజ్ఞప్తిచేశారు.
తమ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మానం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన దాసు శరబంది ఫిర్యాదుచేశారు.
తమ ప్రాంతంలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని గుడివాడకు చెందిన కడియం నాగరాజు అర్జీ దాఖలు చేశారు.
ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి గుర్తింపుకార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని ఐకేపీ యానిమేటర్స్ (వీవోఏ) సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సౌజన్య, గౌరవాధ్యక్షురాలు ఎ.కమల అర్జీ ఇచ్చారు.
బందరు మండలం రుద్రవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణాల కోసం ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న తమకు తెలియకుండా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
బందరు మండలం ఎస్.ఎన్.గొల్లపాలెం శ్మశానభూమికి రహదారి రహదారి సౌకర్యంలేదని గ్రామానికిచెందిన బి.రాజేష్, లక్ష్మణ్ తదితరులు అధికారులకు వివరిం చారు. గ్రామస్తులు చనిపోయినప్పుడు సరి హద్దు పొలాల యజమానులను బతిమలాడి మృతదేహాలను తీసుకువెళ్లాల్సి వస్తోం దని ఆందోళన వ్యక్తంచేశారు. శ్మశానానికి రహదారి వసతి కల్పించాలని అర్జీలో వేడుకున్నారు.
మండల కేంద్రమైన గూడూరులో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి రెండు వైపులా ఆర్‌ఎస్ నంబరు 393/1లో ఉన్న సుమారు 250 ఎకరాల గ్రామకంఠం భూమిలో పలువురు నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేసేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు.
గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ శివారు నాగవరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఐఏవై కింద పక్కాఇళ్లు మంజూరు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో మచిలీపట్నంలోని రాజుపేట, దళితవాడ, మగ్గాలకాలనీ, యానాదుల కాలనీలో డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడ్తారని గతంలో అధికారులు ప్రకటించినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని కేవీపీఎస్ నాయకుడు సీహచ్ రాజేష్ తదితరులు అర్జీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పెడన మండలం చోడవరం గ్రామంలో కేసుగుంట చెరువు పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన పి.లక్ష్మీనారాయణ తదితరులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
‘విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సాయిశ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ 53వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నాయకులు కరీమున్నీసా తదితరులు అర్జీ ఇచ్చారు.
ప్రజావాణికి సమస్యల వెల్లువ
Published Tue, Jun 24 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM
Advertisement