M. Raghunandanaravu
-
వార్షిక రుణ ప్రణాళిక రూ. 10,107.08 కోట్లు
సకాలంలో రుణాలివ్వండి రుణాల రీషెడ్యూల్కు పూర్తి సమాచారమిస్తాం ప్రతీ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ తెరవాలి బ్యాంకర్లకు కలెక్టర్ సూచన 40వేల మందికి రుణ అర్హత కార్డులు విజయవాడ : ప్రభుత్వ పథకాలకు సకాలంలో రుణాలు అందించటంలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. రఘునందనరావు బ్యాంకర్లను కోరారు. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో నిర్వహించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఆర్థికంగా అభివృద్ధిపరచడానికి ప్రారంభించే యూనిట్ల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ రంగంలో రుణాలను రీషెడ్యూలు చేయడానికి బ్యాంకర్లకు పూర్తి డేటాను అందిస్తామని, జిల్లాలో నూతనంగా 40 వేల మందికి రుణ అర్హత కార్డులను జారీచేశామన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికీ ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. 10,107.08 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం 2014-15 సంవత్సరానికి గాను 10,17,986 మందికి వివిధ పథకాల కింద వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా 10 వేల 107 కోట్ల మేరకు రుణాలను అందించాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించి ఆమోదించారు. క్రాప్‌లోన్ నిమిత్తం 6,18,018 మంది రైతులకు 3659.27 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించ గా.. ఇప్పటివరకూ 90,688 మందికి రూ.604.63 కోట్లను రుణాలుగా అందించినట్లు బ్యాంకర్లకు లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్వి నరసింహారావు వివరించారు. వ్యవసాయ రుణాల రద్దు ప్రకటనవల్ల రికవరీ శాతం తగ్గిందని, ప్రభుత్వం ఈ విషయంలో నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచే యటంతో త్వరలోనే వసూళ్లు పెరిగే అవకాశం వుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 28,783 మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో రూ.1036.67 కోట్లకుగాను ఇప్పటివర కు 95.16 కోట్ల రూపాయలను అందించామన్నారు. పట్టణ ప్రాంతంలో 92 కోట్లకుగాను 19.30 కోట్లను.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 140 కోట్లకు గాను 12కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు. రిజర్వు బ్యాంకు ప్రతినిధి ఏఎన్‌వి కామేశ్వరరావు, ఆంధ్రా బ్యాంకు డీజీఎం జీఎన్వీ కృష్ణారావు, సప్తగిరి బ్యాంకు ఆర్యం సత్యనారాయణ, నాబార్డు ఏజీయం మధుమూర్తితోపాటు వివిధ బ్యాంకర్లు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
విమానాశ్రయం (గన్నవరం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుతో కలిసి చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎస్పీ ప్రభాకరరావు, ఉడా వైస్ చైర్మన్ ఉషాకుమారి, జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ జి.వి.రమణరావు, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, డీసీపీ రవిప్రకాష్, టీడీపీ నాయకులు పలువురు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ద్వారకాతిరుమలకు బయలుదేరి వెళ్లారు. రుణాలు మాఫీ చేసితీరుతాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు అన్నిం టిని మాఫీచేసి తీరుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంత్రి ఉమా విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా, వారు గతంలో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు కొత్త రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వం నియమిం చిన కోటయ్య కమిటీ తన నివేదిక అందజేయగానే స్పష్టమైన విధివిధానాలను ప్రకటిస్తామని ప్రకటిం చారు. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా తమ ప్రభుత్వం సంప్రదిం పులు జరుపుతోం దని, మరో రెండు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాల కోసం రైతులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలో తాగునీటి అవసరాలు నిమిత్తం సాగర్ నుంచి విడుదల కావాల్సిన పది టీఎంసీలకు ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. మిగిలిన నీటిని కూడా విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర జలబోర్డులతో సంప్రదింపులు జరిపి నీటి విడుదలకు ముఖ్యమంత్రిస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
జెడ్పీ పీఠంపై గద్దె, శాయన !
నేడు పాలకవర్గం ఏర్పాటు ఎన్నిక లాంఛనప్రాయమే మచిలీపట్నం : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుంది. ఎన్నికల ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా గద్దె అనూరాధను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛన ప్రాయం కానుంది. 1961వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఏర్పడింది. చైర్మన్ పదవిని అధిష్టించిన మహిళల్లో నల్లగట్ల సుధారాణి ఒకరు కాగా రెండో మహిళ అనూరాధ. జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జిల్లా పరిషత్‌కు రానున్నారు. ఈ ఎన్నిక కోసం కలెక్టర్ ఎం. రఘునందనరావు ఆధ్వర్యంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 34 టీడీపీ, 15 స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్నాయి. వైస్‌చైర్మన్‌గా పుష్పావతి ఖరారు జెడ్పీ వైస్‌చైర్మన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును టీడీపీ నాయకులు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పుష్పావతిని జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేయటం గమనార్హం. జెడ్పీ పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ఇలా .. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. 10 నుంచి నామినేషన్లు పరిశీ లించి 12 గంటలకు సక్రమంగా ఉన్నా జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు, 12గంటలకు ఆయా పార్టీలు జారీ చేసే విప్ (ఎనగ్జర్-3)ను స్వీకరిస్తారు. 1.00 గంటకు జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కో- ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో సభ్యుల పేర్లు పిలిచి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు, ఎన్నికైన కో-ఆప్టెడ్ సభ్యులకు ప్రత్యేక సమావేశంలో నోటీసు జారీ చేస్తారు. అనంతరం మద్దతు తెలిపేందుకు సభ్యులు చేతులు ఎత్తటం ద్వారా ఎన్నిక జరుగుతుంది. -
ప్రధాన సమస్యలపై దృష్టి సారించండి
సమగ్ర నివేదికలు తయారు చేయండి జిల్లా అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు కలెక్టరేట్ (మచిలీపట్నం) : జిల్లా అధికారులు తమశాఖకు సంబంధించి ఐదు ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కొద్దిసేపు అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు మూడు, నాలుగు నెలలుగా పరిష్కారమవని సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యల్లో ఐదింటిని గుర్తించి జూలై 15వ తేదీలోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఐదు ముఖ్యాంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం మచిలీపట్నంలో ఉండే జిల్లా అధికారులు తన వద్దకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఎక్కువ సమయం సమస్యల పరిష్కారానికి వెచ్చించాలన్నారు. ఈ సమస్యలను ముందుగానే నిర్ణయించిన కాలంలో పరిష్కరిస్తేనే ఆ శాఖ పనితీరు తెలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించిన వసతి గృహాల్లో విద్యార్థులు అందరికీ నూరుశాతం యూనిఫాం పంపిణీ చేశారా, లేదా అన్న విషయాన్ని డీడీ మధుసూదనరావు తెలుసుకోవాలని సూచించారు. రాబోయే 30 రోజుల్లో 70 శాతం వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నూరుశాతం పిల్లలకు గ్యాస్ ద్వారానే వంట చేసి ఆహార పదార్థాలను అందించాలన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులు, ఆయాశాఖల ఉన్నతాధికారులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధితశాఖల అధికారులు తమ శాఖకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ప్రభుత్వ స్థాయిలో ఉన్న సమస్యలు ఏవో తెలిసేలా సమగ్ర నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సమస్యలపై నివేదిక అడిగితే తరువాత కనుక్కుని చెబుతామనే సమాధానం రాకూడదని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారానికి నివేదికలు రూపొందించడమే కాకుండా వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించేలా జిల్లా అధికారులు కృషిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, డీసీవో రమేష్‌బాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, రాజీవ్ విద్యామిషన్ ఇన్చార్జ్ పీవో డి.పుష్పమణి, డీఈవో డి.దేవానందరెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
కలెక్టరేట్ (మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఎం. రఘునందనరావుకు మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, జెడ్పీ సీఈవో సుదర్శనం తదితర అధికారులు ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. తమ గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వుతున్నారని కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారానికి చెందిన చింతపాటి పద్మావతి ఫిర్యాదు చేశారు. ఈ చెరువులను పూడ్పిం చాలని విజ్ఞప్తిచేశారు. తమ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మానం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన దాసు శరబంది ఫిర్యాదుచేశారు. తమ ప్రాంతంలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని గుడివాడకు చెందిన కడియం నాగరాజు అర్జీ దాఖలు చేశారు. ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి గుర్తింపుకార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని ఐకేపీ యానిమేటర్స్ (వీవోఏ) సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సౌజన్య, గౌరవాధ్యక్షురాలు ఎ.కమల అర్జీ ఇచ్చారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణాల కోసం ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న తమకు తెలియకుండా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బందరు మండలం ఎస్.ఎన్.గొల్లపాలెం శ్మశానభూమికి రహదారి రహదారి సౌకర్యంలేదని గ్రామానికిచెందిన బి.రాజేష్, లక్ష్మణ్ తదితరులు అధికారులకు వివరిం చారు. గ్రామస్తులు చనిపోయినప్పుడు సరి హద్దు పొలాల యజమానులను బతిమలాడి మృతదేహాలను తీసుకువెళ్లాల్సి వస్తోం దని ఆందోళన వ్యక్తంచేశారు. శ్మశానానికి రహదారి వసతి కల్పించాలని అర్జీలో వేడుకున్నారు. మండల కేంద్రమైన గూడూరులో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి రెండు వైపులా ఆర్ఎస్ నంబరు 393/1లో ఉన్న సుమారు 250 ఎకరాల గ్రామకంఠం భూమిలో పలువురు నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేసేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ శివారు నాగవరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఐఏవై కింద పక్కాఇళ్లు మంజూరు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో మచిలీపట్నంలోని రాజుపేట, దళితవాడ, మగ్గాలకాలనీ, యానాదుల కాలనీలో డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడ్తారని గతంలో అధికారులు ప్రకటించినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని కేవీపీఎస్ నాయకుడు సీహచ్ రాజేష్ తదితరులు అర్జీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెడన మండలం చోడవరం గ్రామంలో కేసుగుంట చెరువు పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన పి.లక్ష్మీనారాయణ తదితరులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ‘విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సాయిశ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ 53వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నాయకులు కరీమున్నీసా తదితరులు అర్జీ ఇచ్చారు. -
పారదర్శకంగా ఎన్నికల విధులు : కలెక్టర్
రిటర్నింగ్ అధికారులతో సమావేశం ఎన్నికల కసరత్తు ప్రారంభం విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.రఘునందనరావు పేర్కొన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వుతున్న నేపథ్యంలో కలెక్టర్ కసరత్తు చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రథమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులపై ఉందన్నారు. ఖర్చుల పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్‌కు ముందు, పోలింగ్ జరిగేరోజు ఏర్పాట్లు, స్టాట్యూటరీ, లాజెస్టిక్స్కు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీచేసిన వివరాలను వెబ్సైట్ నుంచి తీసుకోవాలని సూచించారు. ఖర్చుల పర్యవేక్షణకు సంబంధించి అదనపు జాయింట్ కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా విధులను నిర్వర్తిస్తారన్నారు. రిటర్నింగ్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను పంపాలని కోరారు. పోలింగ్‌బూత్‌లలో నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ బూత్ సంఖ్య స్పష్టంగా ఉండేలా పెయింటింగ్ చేయించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల విషయమై తనిఖీ చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబి తాను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఓటర్లను చైతన్యపరచండి ఓటర్లను చైతన్యపరిచి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూడాలని కలెక్టర్ రఘునందనరావు కోరారు. పోలింగ్ బూత్‌లలో బీఎల్వోలుగా వీఆర్వో, వీఆర్ఏ, మండల స్థాయి సిబ్బందిని ముందుగా నియమించాలని, అవసరమైన సందర్భంలో ఇతర శాఖ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఎన్నికల్లో నిజమైన ఓటరే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా గ్రామస్థాయిలో తటస్థంగా ఉండే నలుగురు లేక ఐదుగురు సభ్యులతో విజి లెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ రఘునందనరావు సూచించారు. గ్రామ పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగులు, రైతులు, యువకులు, మహిళలు తదితరులు ఇందులో సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను పూర్తిగా అవగాహనచేసుకోవాలని సూచించారు. ఉడా వీసీ పి.ఉషాకుమారి, విజయవాడ మునిసిపల్ కమిషనర్ సి.హరికిరణ్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ డి.హరిచందన, నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధరరావు, డీఆర్వో విజయచందర్ పాల్గొన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కఠిన చర్యలు ఎన్నికల నిబంధనల ప్రకారం తహశీల్దార్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ రఘునందనరావు ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన విడిగా తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, తహశీల్దార్లు ప్రతి క్షణం తమ సెల్ఫోన్లు అందుబాటులో ఉండాలని ఫోన్లు స్విచాఫ్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి అతి ముఖ్యమైన ఆదేశాలను ఎస్ఎంఎస్ల రూపంలో పంపుతామన్నారు. -
అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కాని అంశాలైతే అర్జీదారులకు వెంటనే తెలపాలని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శివశంకర్, డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, రాజీవ్ విద్యామిషన్ పీవీ పి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీసీవో రమేష్‌బాబు, డీఎస్వో పి.బి.సంధ్యారాణి, మెప్మా పీడీ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవీ.. ఘంటసాల మండలం అచ్చెంపాలెంలోని ఆయకట్టుకు దాళ్వా పంట వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కె.రామచంద్రరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. 2012-13 విద్యాసంవత్సరానికి సంబంధించి తమకు వెంటనే స్కాలర్షిప్పులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల వసతి గృహంలో ఉండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. తమ గ్రామంలో పలువురు అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని కోడూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన కొల్లి వెంకటసుబ్బయ్య, అప్పారావు ఫిర్యాదుచేశారు. తమ గ్రామంలోని చౌకధరల దుకాణం డీలర్ కార్డుదారులకు సక్రమంగా సరుకులు ఇవ్వడంలేదని, చనిపోయిన వారి పేరు మీద ఉన్న కార్డుల సరుకులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు, సత్యరాజు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. డీలర్‌పై చర్యలు తీసుకుని, తమకు సక్రమంగా సరుకులు అందించేలా చూడాలని కోరారు. అంగన్వాడీ టీచర్ ఎస్సీకాలనీకి చెందిన చిన్నారులను పలకతో కొట్టి గాయపరుస్తున్నారని, అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని గూడూరు మండలం ఆకుమర్రు గ్రామానికి చెందిన కె.మురళీకృష్ణ ఫిర్యాదుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23న విడుదల చేసిన జీవో 5,235 ద్వారా పౌరసంబంధాలశాఖ డెప్యూటీ డెరైక్టర్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జం పాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం 27వ వార్డులోని ప్రజల కోసం రుద్రవరం పరిధిలో శ్మశానవాటిక ఏర్పాటుచేసినా, దారి సౌకర్యం లేదని మాజీ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ శరత్‌కుమార్ అధికారులకు వివరించారు. దారి సౌకర్యం కల్పించడంతోపాటు, శ్మశానానికి ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. అనూహ్య మృతికి రెండు నిమిషాల మౌనం సాఫ్ట్వేర్ ఇంజినీరు శింగవరపు ఎస్తేరుఅనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన సంఘటనకు సంతాపంగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రఘునందనరావుతో పాటు జిల్లా అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై గౌరవభావం పెంపొందేలా రాబోయే కాలంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
మళ్లీ ఇసుక దందాలే..
=నేడు గనిఆత్కూర్ క్వారీకి లాటరీ =733 మంది టెండర్లలో ఒకరికే అవకాశం =త్వరలో తెరుచుకోనున్న మరో 20 రీచ్‌లు =పొరుగు జిల్లాలకు వెళ్లినవారంతా తిరుగుముఖం కాసులు కురిపించే ఇసుక క్వారీలకు డిమాండ్ పెరిగింది. గత కొంతకాలంగా మూతపడిన రీచ్‌లను తెరిచేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గని ఆత్కూర్ క్వారీకి టెండరు ఖరారు చేయనుండగా, త్వరలో మరో 20 రీచ్‌లకు టెండర్లు పిలవనున్నారు. అనేక వివాదాలు, లాభాలు మిళితమైన ఇసుక క్వారీలను దక్కించుకునేందుకు మళ్లీ పోటీ పెరిగింది. దీంతో ఇసుక దందాలకు మరోమారు తెరలేచింది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఇసుక రీచ్‌లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ ఎస్ఈ ఆధ్వర్యంలో భవానీపురం, సూరాయిపాలెం, ఇబ్రహీంపట్నం ఇసుక క్వారీలు తెరుచుకోగా తాజాగా కంచికచర్ల మండలం గనిఆత్కూర్ ఇసుక క్వారీ తెరిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరో 20 ఇసుక క్వారీలు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వేలం పాటల ద్వారా ఇసుక క్వారీలు ఖరారు చేస్తే ఈసారి టెండర్లు స్వీకరించి లాటరీ పద్ధతిలో ఖరారు చేస్తున్నారు. ఒక క్వారీ.. 733 టెండర్లు... గనిఆత్కూర్ క్వారీకి టెండర్లు పిలవగా దానిని దక్కించుకునేందుకు 733 టెండర్లు దాఖలయ్యాయి. సీనరేజ్‌తో కలిపి క్యూబిక్ మీటర్‌కు రూ.450 ధరను జిల్లా కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. టెండర్లు వేసినవారిలో ఒకే ఒకరిని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. గతంలో పంచాయతీరాజ్ విభాగంలో ఉండగా బందరులో ఇసుక క్వారీలను ఖరారు చేసే ప్రక్రియ జరిగేది. మైనింగ్ శాఖకు అప్పగించిన అనంతరం ఇటీవల విజయవాడలోనే ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించే పద్ధతి జరుగుతోంది. తాజాగా లాటరీ పద్ధతిని జిల్లా అంతటా కలెక్టరేట్ వద్ద నిర్వహించేలా కలెక్టర్ ఎం.రఘునందనరావు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మరో 20 క్వారీలు తెరిచేందుకు చర్యలు... జిల్లాలో ప్రస్తుతం ఒక రీచ్‌కి లాటరీ నిర్వహిస్తున్న అధికారులు మరో 20 ఇసుక క్వారీలు తెరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కృష్ణానది పరీవాహక ప్రాంతంలోను, పశ్చిమ, తూర్పు కృష్ణా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పర్యావరణ శాఖ అనుమతి వచ్చిన వెంటనే జిల్లాలోని 20 క్వారీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని డ్వామా పీడీ కె.అనిల్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. వీటికి లాటరీ ప్రక్రియ మరో 20 రోజుల్లో పూర్తికావచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లా బాట పట్టనున్న నిర్వాహకులు... జిల్లాలో ఇసుక క్వారీలు మూతపడటం, వేలం పాటలు పలుమార్లు వివాదాస్పదం కావడం, న్యాయపరమైన సమస్యలు ఎదరుకావడంతో ఇక్కడ పరిస్థితి సానుకూలంగా లేదని భావించిన జిల్లాకు చెందిన ఇసుక క్వారీల నిర్వాహకులు పొరుగు జిల్లాలైన గుంటూరు, ఉభయగోదావరి వెళ్లారు. అక్కడ స్థానికంగా పరిస్థితులు అనుకూలించడంతో ఇసుక రీచ్‌లను అధిక ధరలకు టెండర్లు వేసి దక్కించుకున్నారు. తాజాగా జిల్లాలోనే ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తుండటంతో క్వారీల నిర్వాహకులు అంతా మళ్లీ వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.