జెడ్పీ పీఠంపై గద్దె, శాయన !
- నేడు పాలకవర్గం ఏర్పాటు
- ఎన్నిక లాంఛనప్రాయమే
మచిలీపట్నం : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుంది. ఎన్నికల ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా గద్దె అనూరాధను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛన ప్రాయం కానుంది. 1961వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఏర్పడింది. చైర్మన్ పదవిని అధిష్టించిన మహిళల్లో నల్లగట్ల సుధారాణి ఒకరు కాగా రెండో మహిళ అనూరాధ. జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జిల్లా పరిషత్‌కు రానున్నారు. ఈ ఎన్నిక కోసం కలెక్టర్ ఎం. రఘునందనరావు ఆధ్వర్యంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 34 టీడీపీ, 15 స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకున్నాయి.
వైస్‌చైర్మన్‌గా పుష్పావతి ఖరారు
జెడ్పీ వైస్‌చైర్మన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును టీడీపీ నాయకులు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పుష్పావతిని జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేయటం గమనార్హం.
జెడ్పీ పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ఇలా ..
ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. 10 నుంచి నామినేషన్లు పరిశీ లించి 12 గంటలకు సక్రమంగా ఉన్నా జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు, 12గంటలకు ఆయా పార్టీలు జారీ చేసే విప్ (ఎనగ్జర్-3)ను స్వీకరిస్తారు. 1.00 గంటకు జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కో- ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో సభ్యుల పేర్లు పిలిచి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు, ఎన్నికైన కో-ఆప్టెడ్ సభ్యులకు ప్రత్యేక సమావేశంలో నోటీసు జారీ చేస్తారు. అనంతరం మద్దతు తెలిపేందుకు సభ్యులు చేతులు ఎత్తటం ద్వారా ఎన్నిక జరుగుతుంది.