సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం సుమారు మూడున్నర గంటలపాటు అర్థవంతమైన చర్చలతో సాగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణీ, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, గ్రామ వలంటీర్లు, సచివాలయాలు, వైద్య ఆరోగ్యం, కొత్త ఇసుక పాలసీ వంటి కీలక అంశాలపై సభ్యులు తమ గళం వినిపించారు.
విప్లవాత్మక మార్పులు..
ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే కొత్తగా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని చెప్పారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను ఒకేసారి భర్తీ చేశామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే 19 కొత్త చట్టాలను తీసుకొచ్చామని.. నవరత్నాలతో పాటు తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.
మీలా అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయడం లేదు: పేర్ని నాని
సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇసుక సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరాహార దీక్ష తలపెడితే హౌస్ అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పేర్ని నాని బదులిస్తూ తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి హౌస్ అరెస్ట్‌లు చేసి ఉంటారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా అరెస్టులు చేíసి జైల్లో పెట్టడం లేదని వివరించారు. పోర్టు కోసం 33వేల ఎకరాలు సేకరించి 28 గ్రామాలను ఖాళీ చేయిస్తే.. తాను వారికి అండగా పోరాటం చేసినప్పుడు అర్ధరాత్రి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇసుక కొరత టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే వచ్చిందన్నారు. ఇసుక పేరిట ఐదేళ్లు దోపిడీ చేసి ఇప్పుడు రాజకీయం చేయడం సరికాదని మరో మంత్రి వెలంపల్లి హితవు పలికారు.
రైతు రుణమాఫీ జీవో పేరిట టీడీపీ రగడ
రైతు రుణమాఫీ జీవో రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కొద్దిసేపు రగడ చేశారు. ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులతో కలిసి జీవో 30ను చించి నిరసన తెలిపి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుతవం రూ. 84వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరకు రూ. 24 వేల కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి, రూ. 15వేల కోట్లతో సరిపెట్టారన్నారు. కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిలదీశారు.
ఓసీ రైతులకు రైతు భరోసాకై తీర్మానం
వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో రైతు భరోసాపై అర్ధవంతమైన చర్చ జరిగింది. ఓసీల్లోని పేద రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు. ఈ మేరకు డీఆర్సీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఇదే అంశంపై ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీలు కృష్ణారావు, అర్జునుడు కూడా మాట్లాడారు. జిల్లాలో అర్హులైన 3.01లక్షల కుటుంబాలుండగా, ఇప్పటి వరకు 2.26లక్షల కుటుంబాల ఖాతాల పరిశీలన పూర్తయిందని మంత్రి కన్నబాబు వివరించారు. కౌలురైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నారని పలువురు సభ్యులు ఆరోపించగా, వచ్చే సమావేశం కల్లా రుణాల మంజూరును మెరుగుపడాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.
ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం..
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరగా, సభ్యులందరూ హర్షధ్వానాలతో ఆమోదించారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు..
కృష్ణా జిల్లాలో 1.81లక్షల మంది అర్హులను గుర్తించామని, వారికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసామని జేసీ మాదవీలత వివరించగా, తమ ప్రాంతాల్లో అర్హులు ఇంకా ఉన్నారని ఎమ్మెల్యేలు కైలా అనీల్‌కుమార్, రక్షణ నిధి, జగన్మోహన్‌రావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి కురసాల స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని అర్హులైన వారందరికి రానున్న ఐదేళ్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామని బదులిచ్చారు.
సచివాలయ వ్యవస్థతో సమూల మార్పులు
- జిల్లాలో 980 పంచాయతీలకు 845 గ్రామ సచివాలయలు ఏర్పాటయ్యాయని, 11,025 పోస్టులకు గానూ ఇప్పటివరకు 5,153 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చామని జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్ వివరించారు.
- వరద ఉధృతి తగ్గగానే ఇసుక కొరతను అధిగమించవచ్చునని మంత్రులు కురసాల, పేర్ని పేర్కొన్నారు. ఇసుక పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని జేసీని ఇన్‌చార్జి మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.
- పాముకాటు మరణాలు లేకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికతో మూడు వారాల్లో ముందుకు రావాలని మంత్రి కురసాల డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు.
- డెంగీ నిర్థారణ పరీక్షా కేంద్రాలను విజయవాడతో పాటు మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు.
- గడిచిన ఐదేళ్లలో జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని, రిపోర్టు రాగానే పెండింగ్ బిల్లులన్నింటిని దశల వారీగా విడుదల చేస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు.
- బందరుకు మెడికల్ కాలేజీ, జిల్లాకు వాటర్ గ్రిడ్ మంజూరుకు కృషి చేసిన మంత్రి పేర్ని నానికి సభ్యులు అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఆర్‌ఓ ఎ.ప్రసాద్, సీపీఓ సీహెచ్ భాస్కరశర్మ, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, డీఎంఅండ్‌హెచ్‌ఒ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివా సరావు, డీఈఓ రాజ్యలక్ష్మి, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, బందరు ఆర్డీఓ ఖాజావలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment