conferrence
-
భారత రత్న.. కేంద్రం సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు. ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు. ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్.. స్వయంగా బిల్లు చెల్లింపు -
సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వురికి సంగీతనాటక అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ గ్రహీతలకు అవార్డు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడికి చెందిన మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి (కూచిపూడి), ముమ్మిడి వరానికి చెందిన పండితారాధ్యుల సత్యనారాయణ (హరికథ), మచిలీపట్నానికి చెందిన మహాభాష్యం చిత్తరంజన్ (సంప్రదాయ సంగీతం–సుగమ్ సంగీత్), తెలంగాణ నుంచి కోలంక లక్ష్మణరావు (కర్ణాటక సంగీతం–మృదంగం) (స్వస్థలం పిఠాపురమైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు), నల్లగొండ జిల్లా కూర్మపల్లికి చెందిన ఐలయ్య ఒగ్గరి (ఒగ్గు కథ), వరంగల్‌కు చెందిన బాసని మర్రెడ్డి (థియేటర్ డైరెక్టర్)లు అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, శాలువాతో సత్కరించారు. -
'నాడు-నేడుపై దృష్టిని కేంద్రీకరించండి'
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. పాఠశాలల్లో నాడు-నేడుపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు-నేడు తొలి విడతలో భాగంగా 15,715 స్కూళ్లలో సంబంధిత పనులు వేగంవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి ఏయే దశల్లో పనులు ఉన్నాయో వివరాలు తయారు చేయాలన్నారు. (జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరం: నత్వానీ) జూన్ నాటికి పాఠశాలలు ప్రారంభం అవుతాయి కాబట్టి పనులు పెండింగ్‌లో ఉండకూడదన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గకూడదని, స్కూళ్లలో టాయిలెట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకూ స్మార్ట్ టీవీ అందజేయాలన్నారు. గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై రూపొందించిన యాప్ సక్రమంగా పని చేస్తుందా లేదా అన్న విషయంపై అధికారులను ఆరా తీశారు. గోరుముద్దకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉండకూడదని తెలిపారు. జగనన్న విద్యా కానుక స్కూళ్లు తెరిచేటప్పటికి పిల్లలకు అందించాలన్నారు. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు .. మూడు జతల యునిఫామ్స్, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్.. ఈ కిట్‌లో ఉంటాయి. ఈ సందర్భంగా యునిఫామ్స్, బెల్టు, బ్యాగుల నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే పనులు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.వచ్చే సమీక్షా సమావేశం నాటికి ఈ పనుల్లో ప్రగతి కనిపించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. (‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష) -
'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే సహించం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఈసీ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయే వాటి వివరాలు తెలియజేయాలన్నారు. అనుమతి లేని ర్యాలీలు, బైక్ ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.వెంటనే జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాలని వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బును అరికట్టడానికి ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50వేల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు.ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని అధికారులకు వెల్లడించారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరనే నమ్మకం క్షేత్రస్థాయిలో తీసుకురావాలని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. -
అన్ని శాఖలకు నిధులు తగ్గించాలి..
సాక్షి, హైదరాబాద్ : దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటాలో రూ. 924 కోట్ల మేర కోత.. ‘2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ. 19,719 కోట్లు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 18,560 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ. 10,304 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ. 10,528 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికరంగా ఇప్పటివరకు రూ. 224 కోట్ల మేర రాబడి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం పక్కనపెడితే ఈ ఏడాది 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 700 కోట్లు అధికంగా రావాల్సి ఉండగా రూ. 224 కోట్ల మేర కోత పడటంతో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా మొత్తంగా రూ. 924 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పన్నుల వాటా 8.3 శాతం తగ్గిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాటాలో రాబడి 15 శాతం మేర తగ్గితే రూ. 2,957 కోట్ల మేర కోత పడుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో అనేక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్ని శాఖలకు నిధులు తగ్గించండి... ‘అన్న వస్త్రం కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. కేంద్ర పన్నుల వాటా రాబడి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలి’అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుల తగ్గింపును ఏదో ఒక శాఖకు వర్తింపజేయకుండా అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడిందని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని, అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఖర్చుల్లో కోత, ఆర్థిక నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్ర నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకుంటే ఎదురయ్యే ఇబ్బందులను ఐదారు రోజుల్లో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలోఉన్నట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయండి... కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనిపక్షంలో వాస్తవాలను విడుదల వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ శనివారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం ఎగ్గొంటిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీ ద్వారా 14 శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టాన్ని పూడుస్తామని జీఎస్టీ చట్టం అమలు సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,719 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు. -
జనహితం.. అభిమతం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం సుమారు మూడున్నర గంటలపాటు అర్థవంతమైన చర్చలతో సాగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణీ, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, గ్రామ వలంటీర్లు, సచివాలయాలు, వైద్య ఆరోగ్యం, కొత్త ఇసుక పాలసీ వంటి కీలక అంశాలపై సభ్యులు తమ గళం వినిపించారు. విప్లవాత్మక మార్పులు.. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే కొత్తగా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని చెప్పారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను ఒకేసారి భర్తీ చేశామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే 19 కొత్త చట్టాలను తీసుకొచ్చామని.. నవరత్నాలతో పాటు తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. మీలా అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయడం లేదు: పేర్ని నాని సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇసుక సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరాహార దీక్ష తలపెడితే హౌస్ అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పేర్ని నాని బదులిస్తూ తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి హౌస్ అరెస్ట్‌లు చేసి ఉంటారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా అరెస్టులు చేíసి జైల్లో పెట్టడం లేదని వివరించారు. పోర్టు కోసం 33వేల ఎకరాలు సేకరించి 28 గ్రామాలను ఖాళీ చేయిస్తే.. తాను వారికి అండగా పోరాటం చేసినప్పుడు అర్ధరాత్రి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇసుక కొరత టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే వచ్చిందన్నారు. ఇసుక పేరిట ఐదేళ్లు దోపిడీ చేసి ఇప్పుడు రాజకీయం చేయడం సరికాదని మరో మంత్రి వెలంపల్లి హితవు పలికారు. రైతు రుణమాఫీ జీవో పేరిట టీడీపీ రగడ రైతు రుణమాఫీ జీవో రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కొద్దిసేపు రగడ చేశారు. ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులతో కలిసి జీవో 30ను చించి నిరసన తెలిపి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుతవం రూ. 84వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరకు రూ. 24 వేల కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి, రూ. 15వేల కోట్లతో సరిపెట్టారన్నారు. కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిలదీశారు. ఓసీ రైతులకు రైతు భరోసాకై తీర్మానం వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో రైతు భరోసాపై అర్ధవంతమైన చర్చ జరిగింది. ఓసీల్లోని పేద రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు. ఈ మేరకు డీఆర్సీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఇదే అంశంపై ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీలు కృష్ణారావు, అర్జునుడు కూడా మాట్లాడారు. జిల్లాలో అర్హులైన 3.01లక్షల కుటుంబాలుండగా, ఇప్పటి వరకు 2.26లక్షల కుటుంబాల ఖాతాల పరిశీలన పూర్తయిందని మంత్రి కన్నబాబు వివరించారు. కౌలురైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నారని పలువురు సభ్యులు ఆరోపించగా, వచ్చే సమావేశం కల్లా రుణాల మంజూరును మెరుగుపడాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరగా, సభ్యులందరూ హర్షధ్వానాలతో ఆమోదించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు.. కృష్ణా జిల్లాలో 1.81లక్షల మంది అర్హులను గుర్తించామని, వారికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసామని జేసీ మాదవీలత వివరించగా, తమ ప్రాంతాల్లో అర్హులు ఇంకా ఉన్నారని ఎమ్మెల్యేలు కైలా అనీల్‌కుమార్, రక్షణ నిధి, జగన్మోహన్రావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి కురసాల స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని అర్హులైన వారందరికి రానున్న ఐదేళ్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామని బదులిచ్చారు. సచివాలయ వ్యవస్థతో సమూల మార్పులు జిల్లాలో 980 పంచాయతీలకు 845 గ్రామ సచివాలయలు ఏర్పాటయ్యాయని, 11,025 పోస్టులకు గానూ ఇప్పటివరకు 5,153 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చామని జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్ వివరించారు. వరద ఉధృతి తగ్గగానే ఇసుక కొరతను అధిగమించవచ్చునని మంత్రులు కురసాల, పేర్ని పేర్కొన్నారు. ఇసుక పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని జేసీని ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పాముకాటు మరణాలు లేకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికతో మూడు వారాల్లో ముందుకు రావాలని మంత్రి కురసాల డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. డెంగీ నిర్థారణ పరీక్షా కేంద్రాలను విజయవాడతో పాటు మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని, రిపోర్టు రాగానే పెండింగ్ బిల్లులన్నింటిని దశల వారీగా విడుదల చేస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. బందరుకు మెడికల్ కాలేజీ, జిల్లాకు వాటర్ గ్రిడ్ మంజూరుకు కృషి చేసిన మంత్రి పేర్ని నానికి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఆర్ఓ ఎ.ప్రసాద్, సీపీఓ సీహెచ్ భాస్కరశర్మ, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, డీఎంఅండ్హెచ్ఒ మూర్తి, డీఆర్డీఏ పీడీ శ్రీనివా సరావు, డీఈఓ రాజ్యలక్ష్మి, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, బందరు ఆర్డీఓ ఖాజావలి పాల్గొన్నారు. -
జీవీఎంసీ అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం
సాక్షి, విశాఖపట్నం : ఇసుక కొరతకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతీ శ్రీనివాస్, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యే గుడివా అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు యుద్ద ప్రాదిపదికన జీవీఎంసీలోని రోడ్లు, కాల్వలు, శ్మశాన వాటికల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో మూడు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలకు సిద్దం చేయనున్నట్లు మరో మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి నాటికి విశాఖలో ఇసుకకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, అందుకోసం డెంకాడలో ఇసుక రీచ్ కేటాయింపులు జరపాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బూసర్ల లక్ష్మి కుటుంబానికి మంత్రులు బొత్స, అవంతీలు పది లక్షల నష్ట పరిహారం అందించారు. బోటు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం బోటు ప్రమాదంలో మృతి చెందిన తిరుపతి వాసుల కుటుంబీకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కుమార్తె, కుమారుడు చనిపోయారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సుబ్రమణ్యం భార్య మాధవి లతకు 15 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. బోటు ప్రమాదం లో సుబ్రమణ్యం తో పాటు ఆయన ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరమని కరుణాకర్ రెడ్డి అన్నారు. సుబ్రమణ్యం కుటుంబీకులకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. -
పురపాలనలో పౌరుడే పాలకుడు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : పురపాలనలో పౌరుడే పాలకుడని, ఇదే నూతన పురపాలక చట్ట స్పూర్తి అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ రెండు రోజుల పాటు మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన నూతన పురపాలక చట్టం సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాత చట్టంతో పొల్చితే నూతన చట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, టౌన్ ప్లానింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించిందని కేటీఆర్ తెలిపారు. ప్రజలకోసం, పౌర సేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమయిన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకువచ్చారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ప్ సర్టిఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఇలాంటి స్పూర్తిలోంచి వచ్చినవేనని తెలిపారు. అందరం కలిసి నూతన పురపాలక చట్టం స్పూర్తిని కొనసాగిస్తూ దాన్ని అమలు చేద్దాం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్యం, గుడ్ గవర్నెన్స్, పారదర్శకమైన పాలనను అందించేందుకు కలిసి ముందుకు సాగుదామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మున్సిపల్ కమీషనర్లు తమ సిబ్బందితోనూ నూతన మున్సిపల్ చట్టంపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమీషనర్లు చట్టంలో లేని వినూత్నమైన పద్దతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాము మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యాపేట, పీర్జాదీగూడ మున్సిపాలీటీలు వివిధ అంశాల్లో జాతీయస్ధాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమీషనర్లను కోరారు. దీంతోపాటు జాతీయస్ధాయిలో పురపాలనలో విన్నూతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు మావంతు సహకారం అందజేస్తామన్నారు. పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పాదర్శకత మరింత పెరుగుతుందన్న మంత్రి, సామాజిక మాద్యమాలను సైతం వినియోగించుకుంటూ ప్రజల భాగసామ్యాన్ని పెంచాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ర్టస్థాయిలో మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన పురపాలక సంఘాల కమీషనర్లకు మంత్రి పురస్కారాలను అందించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కూమార్, తదితరులు పాల్గొన్నారు. -
పల్లెకు 30 రోజుల ప్లాన్ !
సాక్షి, హైదరాబాద్ : సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యాచరణపై మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 3న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ఊరి సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై సీఎం వరుసగా రెండో రోజూ (శుక్రవారం) ప్రగతిభవన్‌లో 7గంటల పాటు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో విస్తృతం గా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8, 500కు పెంచాలని కూడా సీఎం నిర్ణయించారు. ఇకపై సఫాయి కర్మచారులు పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుందన్నారు. ‘స్వాతంత్య్రమొచ్చి 72ఏళ్లయినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంది. మన ఊరును మనమే బాగు చేసుకోవాలనే స్పృహ రావాలి. చేయగలిగే సత్తా ఉన్నా చేయకపోతే అది నేరమే అవుతుంది. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులు కావాలి. ఊరి పరిస్థితిని మార్చుకోవాలి’అని సీఎం అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికో మండలస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని కూడా సీఎం సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మొదట 60రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30రోజుల కార్యాచరణ.. ఆ తర్వాత మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అధికారులకు కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు. పల్లె కార్యాచరణ ప్రణాళిక ఇదే ! మొదటి రోజు గ్రామసభ నిర్వహణ. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడం. రెండోరోజు కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక. సర్పంచ్ కుటుంబ సభ్యులు ఈ కమిటీల సభ్యులుగా ఉండకూడదు. గ్రామానికున్న అవసరాలు, వనరులను బేరీజు వేసుకుని ప్రణాళికల రూపకల్పన. ఆ తర్వాత వార్షిక ప్రణాళికను, అలాగే పంచవర్ష ప్రణాళిక రూపకల్పన. దానికి గ్రామసభ ఆమోదం. ఆ మేరకే నిధుల ఖర్చు. పారిశుద్ధ్య నిర్వహణ కూలిపోయిన ఇళ్ళు మరియు భవనాల శిథిలాల తొలగింపు. పనికిరాని, ఉపయోగించని బావులు మరియు లోతట్టు ప్రాంతాలను పూడ్చడం. పాఠశాలలు, అంగన్వాడీలవంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి. సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తొలగింపు. అన్ని రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మోరీల రిపేరు. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగింపు. గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించడం. సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి. గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి. మొక్కలకు నీరు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్ తప్పనిసరి. గ్రామాల్లో డంప్‌యార్డ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు. స్మశాన వాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలం గుర్తింపు. 100% మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి. హరిత హారం గ్రామంలో నర్సరీల ఏర్పాటు బాధ్యత పంచాయతీలదే. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపిక. నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. అటవీశాఖ 12,751 గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు.. కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు. గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పళ్లు, పూల మొక్కల ఇండెంట్‌ను సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ ప్లాన్‌ను సిద్ధం చేసి గ్రామసభ ఆమోదించాలి. గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి. పవర్ వీక్ వారం రోజుల పాటు పవర్ వీక్ నిర్వహించాలి. వేలాడుతున్న, వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సెపరేట్ మీటర్, స్విచ్‌లు బిగించాలి. పగలు వీధి లైట్లు వెలగకుండా చూడడం. నిధుల వినియోగం కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడ జమచేసి, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల. ప్రతీ నెల రూ.339 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు నిధులు. వీటితోపాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, ఉపాధి హామీ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. గ్రామపంచాయతీ బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం కార్యక్రమాలకు కేటాయింపు. అప్పులు, జీతాలు చెల్లించడంతోపాటు విద్యుత్ బిల్లులు చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో చేర్చడం. వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాలి. -
పని చేయని వారిని పంపించేస్తా
సాక్షి, విజయనగరం : జిల్లా కేంద్రమైన విజయనగరం నగర పాలక సంస్థ ప్రక్షాళనకు కలెక్టర్, ప్రత్యేకాధికారి డా.ఎం.హరిజవహర్‌లాల్ శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల కిందట ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సోమవారం సంస్థ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. విభాగాల వారీగా వారు నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని రానున్న ఆరునెలల కాలానికి వారు చేయాల్సిన పనులపై స్పల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. పనిచేయని వారిని పంపించేస్తానని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం, రెవిన్యూ వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు. పట్టణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. వీధులు, రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. పట్టణంలోని పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారి గాంధీకి సూచించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలపై దష్టి సారించాలన్నారు. జలసంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నమోదుకు ఒక రిజిష్టర్ నిర్వహించాలని ఆదేశించారు.పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆక్రమణలు తొలగించాలని సూచించారు. బుచ్చెన్న కోనేరుతోపాటు ఎన్సీఎస్ థియేటర్ వెనుక భాగంలోని చెరువు, ప్రేమసమాజం ఎదురుగా ఉన్న చెరువులను పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. నగరంలోని పలు కూడళ్లను ట్రాఫిక్ పరంగా అభివృద్ధిచేసి వాటిని సుందరీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వర్మ, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి, వైద్యాధికారి డా.ప్రణీత తదితరులు పాల్గొన్నారు. -
'ఆగస్టులోగా ఎన్నికలను పూర్తి చేయాలి'
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరక్టర్ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, మున్సిపాలిటీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, శాంతి భద్రత తదితర అంశాలపై చర్చ నిర్వహించారు. జూలై 12న మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఆగస్టులోగా పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తున్న కారణంగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని నాగిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
ఆదాయ వివరాలు వెల్లడించండి
కొవ్వూరు : ఆదాయ వెల్లడి పథకం–2016 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని, ఈలోగా వ్యాపార, వాణిజ్య రంగాల్లోని వారు తమ ఆదాయ వివరాలను వెల్లడించాలని సూచించారు. బుధవారం స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాలులో ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు, వివిధ ఉన్నత వర్గాల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను ఆయన నివత్తి చేశారు. ఆదాయ వెల్లడి ప«థకం విధి విధానాలను వివరించారు. ఆదాయ వివరాలను వెల్లడించి నలభై ఐదుశాతం పన్ను చెల్లిస్తే క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తామని, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు తప్ప ప్రతిఒక్కరూ ఆదాయ వివరాలు వెల్లడించవచ్చని సూచిచారు. జిల్లాలో ఇప్పటికి వరకు ఎనిమిది సమావేశాలు నిర్వహించామన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్లలో సుమారు 40వేల మంది ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. గత ఏడాదిగా జిల్లాలోని ఎనిమిది వ్యాపార సంస్థలపై దాడులు చేసి రూ.15కోట్లు లెక్కల్లో లేని ఆదాయం గుర్తించి రూ.4కోట్లు మేర పన్ను వసూలు చేసినట్లు వివరించారు. తణుకు ఆదాయపన్ను అధికారి బి.ఎ.ప్రసాద్ మాట్లాడుతూ నల్లధనం కలిగి ఉండడం మంచిది కాదన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకష్ణ, ఆడిటర్ డి.ఆర్.ఎన్.శాస్త్రి, రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మట్టే ప్రసాద్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, యువరాజ్ కేబుల్ అధినేత దుద్దుపూడి రామచంద్రరావు(రాము), మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులతోపాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.