![KCR Ordered Finance Department To Reduce Funding In All Branches Due To Economic Downturn - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/8/KCR.jpg.webp?itok=pSqt8FSr)
సాక్షి, హైదరాబాద్ : దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం లేఖ రాశారు.
కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పన్నుల వాటాలో రూ. 924 కోట్ల మేర కోత..
‘2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ. 19,719 కోట్లు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 18,560 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ. 10,304 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ. 10,528 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికరంగా ఇప్పటివరకు రూ. 224 కోట్ల మేర రాబడి తగ్గింది.
కేంద్ర బడ్జెట్‌లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం పక్కనపెడితే ఈ ఏడాది 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 700 కోట్లు అధికంగా రావాల్సి ఉండగా రూ. 224 కోట్ల మేర కోత పడటంతో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా మొత్తంగా రూ. 924 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పన్నుల వాటా 8.3 శాతం తగ్గిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాటాలో రాబడి 15 శాతం మేర తగ్గితే రూ. 2,957 కోట్ల మేర కోత పడుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో అనేక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సీఎం వ్యాఖ్యానించారు.
అన్ని శాఖలకు నిధులు తగ్గించండి...
‘అన్న వస్త్రం కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. కేంద్ర పన్నుల వాటా రాబడి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలి’అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుల తగ్గింపును ఏదో ఒక శాఖకు వర్తింపజేయకుండా అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడిందని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని, అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఖర్చుల్లో కోత, ఆర్థిక నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్ర నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకుంటే ఎదురయ్యే ఇబ్బందులను ఐదారు రోజుల్లో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలోఉన్నట్లు సీఎం వెల్లడించారు.
కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయండి...
కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనిపక్షంలో వాస్తవాలను విడుదల వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ శనివారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం ఎగ్గొంటిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
జీఎస్టీ ద్వారా 14 శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టాన్ని పూడుస్తామని జీఎస్టీ చట్టం అమలు సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,719 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment