పల్లెకు 30 రోజుల ప్లాన్‌ !  | CM KCR Has Decided To Implement 30 Day Special Action Plan In All Villages From September 6th | Sakshi
Sakshi News home page

పల్లెకు 30 రోజుల ప్లాన్‌ ! 

Published Sat, Aug 31 2019 2:00 AM | Last Updated on Sat, Aug 31 2019 8:26 AM

CM KCR Has Decided To Implement 30 Day Special Action Plan In All Villages From September 6th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సెప్టెంబర్‌ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యాచరణపై మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 3న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ఊరి సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై సీఎం వరుసగా రెండో రోజూ (శుక్రవారం) ప్రగతిభవన్‌లో 7గంటల పాటు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో విస్తృతం గా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8, 500కు పెంచాలని కూడా సీఎం నిర్ణయించారు. ఇకపై సఫాయి కర్మచారులు పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుందన్నారు. ‘స్వాతంత్య్రమొచ్చి 72ఏళ్లయినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంది. మన ఊరును మనమే బాగు చేసుకోవాలనే స్పృహ రావాలి. చేయగలిగే సత్తా ఉన్నా చేయకపోతే అది నేరమే అవుతుంది. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులు కావాలి. ఊరి పరిస్థితిని మార్చుకోవాలి’అని సీఎం అన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికో మండలస్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని కూడా సీఎం సూచించారు.

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మొదట 60రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30రోజుల కార్యాచరణ.. ఆ తర్వాత మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అధికారులకు కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు.

పల్లె కార్యాచరణ ప్రణాళిక ఇదే ! 

  • మొదటి రోజు గ్రామసభ నిర్వహణ. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడం. 
  • రెండోరోజు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్‌ కమిటీల ఎంపిక. సర్పంచ్‌ కుటుంబ సభ్యులు ఈ కమిటీల సభ్యులుగా ఉండకూడదు. 
  • గ్రామానికున్న అవసరాలు, వనరులను బేరీజు వేసుకుని ప్రణాళికల రూపకల్పన. 
  • ఆ తర్వాత వార్షిక ప్రణాళికను, అలాగే పంచవర్ష ప్రణాళిక రూపకల్పన. దానికి గ్రామసభ ఆమోదం. ఆ మేరకే నిధుల ఖర్చు. 

పారిశుద్ధ్య నిర్వహణ 

  • కూలిపోయిన ఇళ్ళు మరియు భవనాల శిథిలాల తొలగింపు. పనికిరాని, ఉపయోగించని బావులు మరియు లోతట్టు ప్రాంతాలను పూడ్చడం. 
  • పాఠశాలలు, అంగన్‌వాడీలవంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి. సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తొలగింపు. 
  • అన్ని రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మోరీల రిపేరు. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగింపు. 
  • గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించడం. సంతలు, మార్కెట్‌ ప్రదేశాలను శుభ్రపరచాలి.  
  • గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి. మొక్కలకు నీరు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్‌ తప్పనిసరి. 
  • గ్రామాల్లో డంప్‌యార్డ్‌ ఏర్పాటుకు భూమి గుర్తింపు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు. 
  • స్మశాన వాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలం గుర్తింపు. 100% మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి.

 ​​హరిత హారం

  • గ్రామంలో నర్సరీల ఏర్పాటు బాధ్యత పంచాయతీలదే. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపిక. 
  • నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. 
  • అటవీశాఖ 12,751 గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు.. కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు. 
  • గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పళ్లు, పూల మొక్కల ఇండెంట్‌ను సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసి గ్రామసభ ఆమోదించాలి. 
  • గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి. 

పవర్‌ వీక్‌

  • వారం రోజుల పాటు పవర్‌ వీక్‌ నిర్వహించాలి. వేలాడుతున్న, వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్‌ స్తంభాలను సరిచేయాలి. 
  • వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్‌ వైర్, సెపరేట్‌ మీటర్, స్విచ్‌లు బిగించాలి. 
  • పగలు వీధి లైట్లు వెలగకుండా చూడడం. 


నిధుల వినియోగం 

  • కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడ జమచేసి, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల. ప్రతీ నెల రూ.339 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు నిధులు. 
  • వీటితోపాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, ఉపాధి హామీ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. 
  • గ్రామపంచాయతీ బడ్జెట్‌లో 10% నిధులను పచ్చదనం కార్యక్రమాలకు కేటాయింపు. 
  • అప్పులు, జీతాలు చెల్లించడంతోపాటు విద్యుత్‌ బిల్లులు చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో చేర్చడం. 
  • వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement