panchayatraj
-
సర్పంచ్‌లకు ధన్యవాదాలు:మోదీ
-
కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : స్వీయ నిర్భందంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాలని ప్రధాని సూచించారు.ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇతరులపై మనం ఆధారపడకూడదని, స్వయం సంవృద్థి సాధించాలని అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ గ్రామాల్లో సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరోనా కట్టడికి తమవంతు కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. (లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి కరోనా సినిమా) పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని, అలాగే కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో అలాగే పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు. మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. (కరోనా : 24 గంటల్లో 1,684 కేసులు) -
అధికారులే గుత్తేదార్లు!
ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన పనులలో 80 శాతానికి పైగా పనులను ఇంజినీరింగ్ అధికారులే గుత్తేదార్ల అవతారమెత్తి చేయిస్తున్నారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేనందున అధికారులే చేయాల్సి వస్తోందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, నిజామాబాద్ : ఇంజినీరింగ్ అధికారులే గుత్తేదార్లుగా మారారు. టెండరు ప్రక్రియలు లేకుండా రూ.లక్షల అంచనా వ్యయం కలిగిన పనులను నామినేషన్‌పై చేపడుతున్నారు. ఈ విభిన్న పరిస్థితి ఇప్పుడు విద్యుత్ శాఖలో నెలకొంది. పవర్ వీక్ (విద్యుత్ వారం) పేరుతో సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ప నుల్లో సుమారు 80 శాతానికి పైగా అధికారుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. వారే పనులు చే యడం.. వారే ఎంబీ రికార్డులు చేపట్టడం.. బిల్లులు డ్రా చేయడం వంటి పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 588 గ్రామాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన పనులను విద్యుత్‌శాఖ గుర్తించింది. పవర్‌వీక్‌లో భాగంగా ఈనెల 9 నుంచి 20 వరకు ఈ పనులను గుర్తించారు. లూజ్లైన్లను సరిచేయడం, వంగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, విద్యుత్ లైన్ మధ్యలో కొత్త స్తంభాన్ని బిగించడం, రీ ఎర్తింగ్, స్ట్రీట్‌లైట్ మీటర్ పాయింట్లు, రెండు వైర్లు ఉన్న లైన్లకు మూడో వైరు ఏర్పాటు చేయడం.. నాలుగు వైర్లున్న లైన్లకు ఐదోది గుంజడం ఇలా జిల్లావ్యాప్తంగా వందలాదిగా చిన్న చిన్న మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఈ పనులను గుర్తించారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేరు. ఇలాంటి పనులు చేసే గుత్తేదార్లు సుమారు 30 మంది లోపే ఉంటారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే విద్యుత్‌శాఖ అధికారులే ఇప్పుడు కాంట్రాక్టర్లుగా మారాల్సి వచ్చిందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 50 గ్రామాల్లో పనులు.. ఈ పనులన్నింటినీ అక్టోబర్ 5లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 588 గ్రామాలకు గాను ఇప్పటివరకు కేవలం 60 గ్రామాల్లో మాత్రమే విద్యుత్ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇంకా అనేక గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. ఒక్కో సెక్షన్‌కు సంబంధించి ఏఈలు అంచనాలు తయారు చేసి.. ప్రతిపాదనలు పంపారు. డీఈలు అగ్రిమెంట్ చేసి పనులు చేయిస్తున్నారు. ప్రైవేట్‌లో మెటీరియల్.. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర పరికరాలకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడటంతో ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా విద్యుత్‌శాఖ డిపోలో నుంచే మెటీరియల్ తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మరమ్మతు పనులు జరుగుతుండటంతో ప్రైవేటులో కొనుగోలు చేసి.. బిల్లులు డ్రా చేయాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం టెండరు ప్రక్రియ నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో అధికారులే నామినేషన్లపై చేయాల్సి వస్తోందని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
గ్రామాల్లో పచ్చదనం,సమగ్రాభివృద్ధే లక్ష్యం
-
పల్లెకు 30 రోజుల ప్లాన్ !
సాక్షి, హైదరాబాద్ : సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యాచరణపై మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 3న మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ఊరి సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై సీఎం వరుసగా రెండో రోజూ (శుక్రవారం) ప్రగతిభవన్‌లో 7గంటల పాటు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో విస్తృతం గా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8, 500కు పెంచాలని కూడా సీఎం నిర్ణయించారు. ఇకపై సఫాయి కర్మచారులు పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుందన్నారు. ‘స్వాతంత్య్రమొచ్చి 72ఏళ్లయినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంది. మన ఊరును మనమే బాగు చేసుకోవాలనే స్పృహ రావాలి. చేయగలిగే సత్తా ఉన్నా చేయకపోతే అది నేరమే అవుతుంది. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులు కావాలి. ఊరి పరిస్థితిని మార్చుకోవాలి’అని సీఎం అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికో మండలస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని కూడా సీఎం సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మొదట 60రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30రోజుల కార్యాచరణ.. ఆ తర్వాత మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అధికారులకు కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు. పల్లె కార్యాచరణ ప్రణాళిక ఇదే ! మొదటి రోజు గ్రామసభ నిర్వహణ. 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడం. రెండోరోజు కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక. సర్పంచ్ కుటుంబ సభ్యులు ఈ కమిటీల సభ్యులుగా ఉండకూడదు. గ్రామానికున్న అవసరాలు, వనరులను బేరీజు వేసుకుని ప్రణాళికల రూపకల్పన. ఆ తర్వాత వార్షిక ప్రణాళికను, అలాగే పంచవర్ష ప్రణాళిక రూపకల్పన. దానికి గ్రామసభ ఆమోదం. ఆ మేరకే నిధుల ఖర్చు. పారిశుద్ధ్య నిర్వహణ కూలిపోయిన ఇళ్ళు మరియు భవనాల శిథిలాల తొలగింపు. పనికిరాని, ఉపయోగించని బావులు మరియు లోతట్టు ప్రాంతాలను పూడ్చడం. పాఠశాలలు, అంగన్వాడీలవంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి. సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తొలగింపు. అన్ని రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మోరీల రిపేరు. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగింపు. గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించడం. సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి. గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి. మొక్కలకు నీరు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్ తప్పనిసరి. గ్రామాల్లో డంప్‌యార్డ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు. స్మశాన వాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలం గుర్తింపు. 100% మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి. హరిత హారం గ్రామంలో నర్సరీల ఏర్పాటు బాధ్యత పంచాయతీలదే. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపిక. నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. అటవీశాఖ 12,751 గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు.. కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు. గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పళ్లు, పూల మొక్కల ఇండెంట్‌ను సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ ప్లాన్‌ను సిద్ధం చేసి గ్రామసభ ఆమోదించాలి. గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి. పవర్ వీక్ వారం రోజుల పాటు పవర్ వీక్ నిర్వహించాలి. వేలాడుతున్న, వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సెపరేట్ మీటర్, స్విచ్‌లు బిగించాలి. పగలు వీధి లైట్లు వెలగకుండా చూడడం. నిధుల వినియోగం కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడ జమచేసి, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల. ప్రతీ నెల రూ.339 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు నిధులు. వీటితోపాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, ఉపాధి హామీ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. గ్రామపంచాయతీ బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం కార్యక్రమాలకు కేటాయింపు. అప్పులు, జీతాలు చెల్లించడంతోపాటు విద్యుత్ బిల్లులు చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో చేర్చడం. వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాలి. -
‘టీచర్ రూల్స్’పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీస్ నిబంధనలపై దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, ఇందుకు అనుగుణంగా గతేడాది జూన్ 23న రాష్ట్రపతి ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో సర్వీస్ నిబంధనలను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే స్టేటస్కో ఎత్తేయాలని, కేసులపై విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా.. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. రాజ్యాంగ వ్యతిరేకం: పిటిషనర్లు రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెలువడిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 1975లోని పేరా 2ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి వీరాచారి ఇతరులు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371(డి) అధికరణకు రాష్ట్రపతి ఉత్తర్వులు వ్యతిరేకమని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు వాదించారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు (మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేసే వారు) స్థానిక సంస్థల పరిధిలోకి వస్తారని, వీరిని ప్రభుత్వ టీచర్లుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20 ఏళ్ల నుంచీ ఒకే తరహా ప్రకటన: ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో పని చేసే టీచర్లు కూడా సివిల్ సర్వెంట్లేనని, వారి విధులు కూడా ప్రభుత్వ టీచర్ల తరహాలోనే ఉంటాయని, రాష్ట్రపతి జారీ చేసిన ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు పూర్తి చట్టబద్ధత ఉంటుం దని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గిరి, ఇతర న్యాయవాదులు వాదించా రు. 20 ఏళ్ల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఒకే తరహా ప్రకటన జారీ చేయడమే కాకుండా ఏకీకృత విధానా న్నే అమలు చేస్తున్నామన్నారు. స్టేటస్కో ఎత్తేయడం తోపాటు ప్రభుత్వ టీచర్ల వ్యాజ్యాలు కొట్టేయాలన్నా రు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన టీచ ర్లు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
లంచావతారం
కడప అర్బన్/ఎడ్యుకేషన్ : చాపాడు మండల ఇంజినీరింగ్ అధికారి(ఏఈ) ఎస్.రహమతుల్లా రూ. 14వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చాపాడు మండలం నాగులపల్లి– ఉప్పరపల్లి, ఉప్పరపల్లి– పంప్‌హౌస్‌ల మధ్య పంచాయతీరాజ్ తరఫున రూ.10లక్షల మేరకు పనులను 2017 మేలో రామాంజనేయరెడ్డి అనే కాంట్రాక్టర్ చేయించడం ప్రారంభించారు. మొదటి, రెండవ, ఫైనల్ బిల్లులను మంజూరు చేయించాలంటే రూ.14 వేలు లంచంగా ఇవ్వాలని కాంట్రాక్టర్ రామాంజనేయరెడ్డిని, చాపాడు మండల ఇంజినీరింగ్ అధికారి (ఏఈ) రహమతుల్లా తన చుట్టూ గత ఏడు నెలలుగా తిప్పుకోసాగాడు. బిల్లు మంజూరు కావాలంటే తాను ఎం–బుక్‌పై సంతకం చేయాల్సిందేనని, లేకుంటే చెల్లదని తేల్చిచెప్పడంతో బాధితుడు కడపలోనిఅవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు స్పందించారు. బుధవారం కడపలోని జెడ్పీ కార్యాలయంలో జరిగే సమావేశానికి అధికారులతో పాటు తాను వస్తున్నానని, అక్కడ తనకు లంచంగా ఇవ్వాల్సిన రూ. 14000లను తీసుకుని రావాలని రహమతుల్లా, రామాంజనేయరెడ్డికి ఫోన్లో తెలిపారు. ఆ మేరకు రామాజంనేయరెడ్డి జెడ్పీ సమావేశమందిరం వద్దకు వెళ్లి డబ్బులను ఏఈ రహమతుల్లాకు ఇచ్చాడు. అదే సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం ఏసీబీ డీఎస్పీ నాగరాజు తమ సిబ్బందితో ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ రామాంజనేయరెడ్డి చేసిన పనులకు సంబంధించి రూ.10 లక్షల బిల్లులను మంజూరు చేసేందుకు రూ. 14వేలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారన్నారు. రామాంజనేయరెడ్డి తాను లంచం ఇచ్చేందుకు నిరాకరించి తమను ఆశ్రయించారన్నారు. తమ సూచనల ప్రకారం డబ్బును లంచంగా ఇస్తుండగా తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నామన్నారు. ఈ సంఘటనలో ఏసీబీ సీఐ రామచంద్రతో పాటు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయితీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లేదు
-
బడ్జెట్ సమావేశాల్లోనే పంచాయితీ బిల్లు
-
పర్సెంటేజీల రాజ్
- రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు – ఏడాదిన్నరకు రెండు సార్లు ప్యాచ్ వర్కులు – రూ.81 లక్షలకు మరో రూ.8 లక్షలు అదనపు ఖర్చు – పర్యావేక్షణ లోపంతో బరితెగిస్తున్న సిబ్బంది అనంతపురం సిటీ : పంచాయతీరాజ్ శాఖ... అవినీతికి కేరాఫ్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులకు చేయి తడిపితే చాలు... ఆ పనులు నాణ్యతగా ఉన్నాయా..? లేదా? అన్నది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమ వాటా తమకు అందిందా.. లేదా.. అన్నదే వారికి ముఖ్యం. ఇలాంటి అధికారుల అండ చూసుకునే కొందరు కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణ పనుల్లో వారిష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రోడ్లు వేసిన కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరుతున్నా ప్యాచ్ వర్క్‌లతో సర్దుబాటు చేసేసి మమా అనిపించేస్తున్నారు. పుట్లూరు పరిధిలోని తక్కాలపల్లి నుంచి పోతిరెడ్డిపల్లి దాకా పంచాయతీరాజ్ అధికారులు ఏడాదిన్నర క్రితం రోడ్డు. ఆర్.డీ.ఎఫ్ స్కీమ్ కింద రూ.81 లక్షల వ్యయంతో 3 కిలో మీటర్ల వేసిన రహదారి. నిర్మాణం పూర్తయిన 8 నెలలకే రోడ్డు గుంతలు పడడంతో అధికారులు ప్యాచ్ వర్కులు చేయించారు. రెండోసారి కూడా రహదారిపై గుంతలు పడటంతో గ్రామస్తులంతా అధికారుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ గుంతలను కప్పేందుకు అధికారులు మరో రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఏడాదిన్నర కాలంలో ఈ రహదారి రెండుసార్లు గుంతలు పడిందంటే క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బందికి కూడా ఒక శాతం వాటా ముట్టచెబితే రిపోర్టు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా రాసేస్తారని పలువురు చోటా కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొత్త నిర్మాణాలకు రూ.10 కోట్ల నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలు పంపాలని ప్రభుత్వ పెద్దలు అధికారులకు చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది. పర్యవేక్షణ లేకే... జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనుల్లో నిధులను అనవసరంగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో అవసరం లేక పోయినా కల్వర్టులు నిర్మించి ఈ శాఖాధికారులు విమర్శలు మూటగట్టుకున్నారు. కేవలం జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ శాఖలో ఎవరికి వారు వాటాలతో జేబులు నింపుకుంటున్నట్లు స్పష్టమౌతోంది. ఇలాగే అధికారులు వాటాల కోసం చేతులు చాస్తే పనుల్లో నాణ్యత లోపించి...ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని జిల్లా వాసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో జరుగుతున్న రోడ్డు నిర్మాణాలపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
వసూళ్ల ‘రాజ్’
- పంచాయతీరాజ్‌లో పర్సెంటేజీల పర్వం - అంగన్వాడీ భవన నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి వసూలు - లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు - పనుల నాణ్యతకు తిలోదకాలు అనంతపురం సిటీ : పంచాయతీ రాజ్ శాఖలో ‘వసూళ్ల రాజాలు’ హల్చల్ చేస్తున్నారు. ప్రతి పనికీ ‘రేటు’ కడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్ పెడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారులు మొదలుకుని అటెండర్ల వరకు ప్రతిఒక్కరికీ వారి ‘స్థాయి’ని బట్టి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. వసూళ్ల రాజాలను సంతృప్తి పరిచే క్రమంలో పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణరోడ్లు, కోల్డ్‌స్టోరేజీలు, అంగన్వాడీ, హాస్టల్ భవన నిర్మాణాలు తదితర పనులు చేపడుతున్నారు. ప్రతి పనిలోనూ అధికారులు ముక్కుపిండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 851 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని 29 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో నిర్మించాలి. ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 లక్షలు కేటాయించింది. భవనం పైకప్పు వరకు నిర్మాణానికి రూ.5 లక్షలు , పైపనులకు రూ.2 లక్షల ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఈ మొత్తంతో నిబంధనల మేరకు పనులు చేపడితే భవనాలను దృఢంగా నిర్మించవచ్చు. అయితే.. వసూళ్ల రాజాలు ఇందులోనూ కక్కుర్తి పడుతున్నారు. పనుల నాణ్యత దేవుడెరుగు..తమ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే బిల్లు చేయడం లేదు. ఒక్కో భవన నిర్మాణంపై ఏకంగా రూ.లక్ష దాకా చేతులు తడపాల్సి వస్తోందని అనంతపురం సబ్‌డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భవన నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌కు భవన నిర్మాణ అనుమతులు వచ్చి ఐదు నెలలు అవుతోంది. టాప్ లెవల్ వరకు పనులు చేశారు. ఇప్పటిదాకా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.2.50 లక్షలు అయ్యే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఐదు నెలలుగా ఈ పని కోసం తిరిగినందుకు రూ.లక్ష దాకా అయ్యిందని చెప్పారు. కేవలం ఫైలు కదిలించేందుకే రూ.78 వేలు మామూళ్లు ఇచ్చుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ‘ఎంతో కొంత మిగులుతుందనే ఆశతో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా. తీరా చూస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. బుద్ధుంటే పంచాయతీరాజ్ పనులు చేయకూడదు. ఏదో తెలీక పని తీసుకుని నష్టపోయా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టే పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్సెంటేజీల కారణంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. మరీముఖ్యంగా అంగన్వాడీ భవనాలను పలుచోట్ల నాసిరకంగా నిర్మిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ముడిపడిన ఈ భవన నిర్మాణాల నాణ్యతపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగులకు అండగా ఉంటా..
ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పదవులన్నింటినీ దక్కించుకున్న బండి శ్రీనివాసరావు ప్యానెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూచిపూడి మోహన్‌రావు గుంటూరు : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో జెడ్పీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా గెలుపొందిన బండి శ్రీనివాసరావు ’సాక్షి’కి ఫోన్ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాటుపడతానని తెలియజేశారు. తనపై నమ్మకంతో ఉద్యోగులు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రికార్డు అసిస్టెంట్ పోస్టులను అప్‌గ్రెడేషన్ కోసం పాటుపడతానని చెప్పారు. సూపరింటెండెంట్ పదోన్నతుల్లో 34 శాతం ఇయర్మార్క్ కల్పించేలా ప్రయత్నిస్తానని, సూపరింటెండెంట్ పోస్టులకు గెజిటెడ్ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు. నూతన రాజధానిలో అసోసియేషన్ కార్యాలయ భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికలు కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. జిల్లా పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్యానల్, అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న గంధమనేని శ్రీనివాస్ ప్యానెళ్లు ఎన్నికల్లో తలపడ్డాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకుగాను ఒక్కో జిల్లాకు ఆరుమంది చొప్పున 78 మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు రాజధాని ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతానికి చెందినవారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించుకునే వీలుకలుగుతుందనే ఆలోచనతో మెజార్టీ జిల్లాల నాయకులు బండి శ్రీనివాసరావుకు మద్దతుగా నిలిచి గెలిపించారు. రాష్ట్ర కమిటీ ఇదే.. మొత్తం 78 ఓట్లకుగాను బండి శ్రీనివాసరావుకు 57 ఓట్లు లభించి భారీ మెజార్టీతో గెలుపొందారు. గంధమనేని శ్రీనివాస్‌కు 21 ఓట్లు లభించాయి. బండి శ్రీనివాసరావు ప్యానెల్ నుంచి పోటీచేసిన వారంతా ఏకపక్షంగా గెలుపొందడం విశేషం. రాష్ట్ర కార్యదర్శిగా సీ.నాగిరెడ్డి(కడప), అసోసియేట్ అధ్యక్షుడుగా వి.రమేష్(తూర్పు గోదావరి), కోశాధికారిగా దస్తగిరిబాబు(కర్నూలు), జాయింట్ సెక్రటరీగా జీ.గీతారాణి (ఏకగ్రీవం, కర్నూలు జిల్లా) ఉపాధ్యక్షులుగా గోపీనా«ద్(నెల్లూరు), లాలప్పరెడ్డి(ప్రకాశం), రామ్మోహన్(శ్రీకాకుళం), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కూచిపూడి మోహన్‌రావు(గుంటూరు), చక్రపాణి(చిత్తూరు), కే.వీ.శ్రీనివాసరావు(నెల్లూరు), కే.శ్రీనివాసరావు(శ్రీకాకుళం), రవీంద్రబాబు (ఏకగ్రీవం, శ్రీకాకుళం జిల్లా), డీ.అజయ్‌కుమార్( ఏకగ్రీవం, కృష్ణాజిల్లా), జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడుగా సీహెచ్.శ్రీనివాసరావు(ప్రకాశం) గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ నియామకపు పత్రాలను అందజేశారు. ఎన్నికల అధికారిగా యెండ్లూరి బ్రహ్మయ్య, సహాయ ఎన్నికల అధికారిగా ఆంజనేయులు, ఎన్నికల పరిశీలకుడుగా రాజశేఖర్ వ్యవహరించారు. -
నిధుల కేటాయింపులో వివక్ష
నూనెపల్లె: ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. సాయిబాబానగర్ భగత్‌సింగ్ గ్రంథాలయంలో సోమవారం నంద్యాల డివిజన్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్‌లకు కేటాయిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను విస్మరిస్తున్నారన్నారు. ఈ కారణంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామన్న పేరు తప్ప ఏ పనీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్థికం సంఘం నుంచి తమకు కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 2ను సంఘటిత దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశానికి సర్పంచ్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి మద్దతు ఇచ్చారు. ఎంపీటీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల హుసేని, అధ్యక్షుడు ధర్మవరం వాసు, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రావు, నాయకులు పాల్గొన్నారు.