ఏసీబీకి చిక్కిన చాపాడు పంచాయతీరాజ్ ఏఈ రహమతుల్లా
కడప అర్బన్/ఎడ్యుకేషన్ : చాపాడు మండల ఇంజినీరింగ్ అధికారి(ఏఈ) ఎస్.రహమతుల్లా రూ. 14వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చాపాడు మండలం నాగులపల్లి– ఉప్పరపల్లి, ఉప్పరపల్లి– పంప్‌హౌస్‌ల మధ్య పంచాయతీరాజ్ తరఫున రూ.10లక్షల మేరకు పనులను 2017 మేలో రామాంజనేయరెడ్డి అనే కాంట్రాక్టర్ చేయించడం ప్రారంభించారు. మొదటి, రెండవ, ఫైనల్ బిల్లులను మంజూరు చేయించాలంటే రూ.14 వేలు లంచంగా ఇవ్వాలని కాంట్రాక్టర్ రామాంజనేయరెడ్డిని, చాపాడు మండల ఇంజినీరింగ్ అధికారి (ఏఈ) రహమతుల్లా తన చుట్టూ గత ఏడు నెలలుగా తిప్పుకోసాగాడు. బిల్లు మంజూరు కావాలంటే తాను ఎం–బుక్‌పై సంతకం చేయాల్సిందేనని, లేకుంటే చెల్లదని తేల్చిచెప్పడంతో బాధితుడు కడపలోనిఅవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు స్పందించారు.
బుధవారం కడపలోని జెడ్పీ కార్యాలయంలో జరిగే సమావేశానికి అధికారులతో పాటు తాను వస్తున్నానని, అక్కడ తనకు లంచంగా ఇవ్వాల్సిన రూ. 14000లను తీసుకుని రావాలని రహమతుల్లా, రామాంజనేయరెడ్డికి ఫోన్‌లో తెలిపారు. ఆ మేరకు రామాజంనేయరెడ్డి జెడ్పీ సమావేశమందిరం వద్దకు వెళ్లి డబ్బులను ఏఈ రహమతుల్లాకు ఇచ్చాడు. అదే సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం ఏసీబీ డీఎస్పీ నాగరాజు తమ సిబ్బందితో ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ రామాంజనేయరెడ్డి చేసిన పనులకు సంబంధించి రూ.10 లక్షల బిల్లులను మంజూరు చేసేందుకు రూ. 14వేలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారన్నారు. రామాంజనేయరెడ్డి తాను లంచం ఇచ్చేందుకు నిరాకరించి తమను ఆశ్రయించారన్నారు. తమ సూచనల ప్రకారం డబ్బును లంచంగా ఇస్తుండగా తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నామన్నారు. ఈ సంఘటనలో ఏసీబీ సీఐ రామచంద్రతో పాటు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment