స్వాధీనం చేసుకున్న రూ.15లు నగదు. ,డిప్యూటీ తహసీల్దార్
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ పఠాన్ అలీఖాన్, వీఆర్‌ఓ ఎస్.బాషావలి ఈ–పాస్‌బుక్ మంజూరు విషయంలో రైతు గొల్ల ఓబులేసు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కలమల్ల గ్రామానికి చెందిన గొల్ల ఓబులేసుకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఈ–పాస్‌బుక్ కోసం మీ– సేవా కేంద్రంలో ఓబులేసు దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ చేసి ఈ–పాస్‌బుక్ ఇవ్వాల్సి ఉంది. అయితే రూ.15వేలు లంచం ఇస్తేనే పాస్‌బుక్ ఇస్తామని డీటీ అలీఖాన్, వీఆర్‌ఓ బాషావలీ చెప్పడంతో రైతు ఓబులేసు గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు.
సోమవారం తహసీల్దార్‌కార్యాలయంలో రైతు గొల్ల ఓబులేసు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇందులో రూ.10 వేలు డిప్యూటీ తహశీల్దార్ పఠాన్ అలీఖాన్ నుంచి, రూ. 5వేలు వీఆర్‌ఓ బాషావలి నుంచి స్వాధీనం చేసుకుని వారిద్దరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తహసీల్దార్ రేణుక పాత్ర ఉందా లేదా అనే దానిపై కూడా విచారణ జరుగుతుందన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రలతో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
పాస్‌బుక్ కోసం 2014 నుంచి తిరుగుతున్నా ఇవ్వలేదు– ఓబులేసు
కలమల్లలోని సర్వే నంబరు 302/1లో తనకు సుమారు 6.50 ఎకరాలు పొలం ఉందని రైతు గొల్ల ఓబులేసు తెలిపాడు. ఈ భూమికి పాసుబుక్ ఇవ్వాలని 2014 నుంచి కార్యాలయం చుట్టు తిరుగుతున్నాని చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు కూడా రిజిస్ట్రేషన్ చేయించిందన్నారు. దీనిపై పాసుబుక్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పాసుబుక్ ఇవ్వాలంటే రూ.15వేలు లంచం ఇవ్వాలని వీఆర్‌ఓ బాషావలి అడిగారని చెప్పారు. ఇందులో రూ.10 వేలు డీటీ అలీఖాన్‌కు, రూ.5 వేలు తనకు ఇవ్వాలని చెప్పాడని తెలిపారు. చివరకు గత్యంతరం లేక ఏసీబీను ఆశ్రయించినట్లు రైతు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment