![ACB Searches On Tahsildar Nagaraj House - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/15/ACB.jpg.webp?itok=sELm5fp9)
సాక్షి, మేడ్చల్: కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు.
తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment