పైసలిస్తేనే..పని | Bribery Demand In GHMC Office | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే..పని

Published Thu, Apr 19 2018 4:22 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Bribery Demand In GHMC Office - Sakshi

శేరిలింగంపల్లి సర్కిల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌రావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

శేరిలింగంపల్లి, సాక్షి సిటీబ్యూరో: శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం అవినీతి నిలయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లు ఇవ్వనిదే ఏ పని చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అదే కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు సైతం ఇందులో మినహాయింపు లేదని, ఎవరైనా ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాల్సిందే. గతంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం తనకు రావాల్సిన ప్రయోజనాలను చెల్లించాలని దరఖాస్తు చేసుకోగా ఉన్నతాధికారి ఒకరు రూ.లక్ష డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో బుధవారం సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌రావు గతంలో ఇదే కార్యాలయంలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేసిన రణవీర్‌ భూపాల్‌ అనే వ్యక్తి నుంచి రూ.20 వేటు తీసుకుంటూ పట్టుబడటం తాజా ఉదాహరణ. 

అవినీతి మరకలు...
నల్లగండ్ల హుడా కాలనీలో పార్కు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరుకు అప్పటి అర్బన్‌ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ కిషన్‌రావు 2017 మార్చి 29 లక్డీకపూల్‌లోని కామత్‌ హోటల్‌లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
2014 జూన్‌12న శేరిలింగంపల్లి సర్కిల్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నర్సింహారెడ్డి, సెక్షన్‌ ఆఫీసర్‌ కృష్ణయ్య గచ్చిబౌలిలో ఇంటి నిర్మాణ  అనుమతుల మంజూరు కోసం రూ.2లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
బతుకమ్మ, దసరా, సీఎం రాక సందర్భంగా వేసిన లైటింగ్‌ బిల్లుల మంజూరు కోసం యూపీఎస్, ప్రింటర్‌ లంచంగా తీసుకుంటున్న ఎలక్ట్రికల్‌ ఏఈ ఆర్‌.సురేష్‌కుమార్‌ను వెస్ట్‌ జోన్‌లోని ఎలక్ట్రికల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ సీనియర్‌ అసిస్టెంట్‌
శేరిలింగంపల్లి: పెండింగ్‌లో ఉన్న వేతన బిల్లులు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ సీనియర్‌ అసిస్టెంట్‌ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గతంలో అదే సర్కిల్‌లో పనిచేసి వెళ్లిన ఉద్యోగి వద్దే లంచం డిమాండ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... శేరిలింగంపల్లి సర్కిల్‌లో బిల్‌ కలెక్టర్‌గా పనిచేసిన రణవీర్‌ భూపాల్‌ 2016 ఫిబ్రవరిలో మాదాపూర్‌లో జరిగిన ముజ్రా పార్టీలో పట్టుబడి సస్పెండ్‌ అయ్యాడు. అనంతరం అతడిని తిరిగి విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం మాతృసంస్థ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పోస్టింగ్‌ ఇచ్చింది. సస్పెన్షన్‌ కాలంలో రావాల్సిన వేతనాల దరఖాస్తు చేసుకోగా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో  సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌రావు రూ.50 వేలు డిమాండ్‌ చేయగా, రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం    సర్కిల్‌ కార్యాలయంలో  లక్ష్మణ్‌రావుకు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ సిటీరేంజ్‌–1 డీఎస్పీ బీవీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. బండ్లగూడలోని అతని నివాసంలో సోదాలు నిర్వహించారు.

సమాచారం ఇస్తే వివరాలు గోప్యం
ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది లంచాలు డిమాండ్‌ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయండి. సమాచరం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతాం.  ప్రజల చైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యం. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవినీతి అధికారుల ఆటకట్టించాలి.– డీవీ సత్యనారాయణ ,సిటీ –1 డీఎస్పీ, ఎసీబీ హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement