సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ యజమానిని బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి సిద్దాంతం మదన్‌రాజుతో పాటు పత్రికా విలేకరులు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్‌గౌడ్‌లను ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ ఎస్. అచ్చేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రో స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా షెడ్డు నిర్మిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్ ఆయన వద్దకు వెళ్ళి ఇది అక్రమ నిర్మాణమంటూ బెదిరించారు. ‘5 లక్షలు ఇవ్వకపోతే జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి మదన్‌రాజుకు చెప్పి కూల్చివేయిస్తామంటూ బెదిరించారు. మదన్‌రాజును కూడా వెంటబెట్టుకొని నిర్మాణ స్థలానికి వెళ్ళి కేశవరెడ్డితో మాట్లాడి అయిదు లక్షలు ఇవ్వాలంటూ ముగ్గురూ కలిసి డిమాండ్ చేశారు.
అయితే తాను కేవలం రెండు లక్షలు ఇస్తానని కేశవరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. అప్పటికే కేశవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పగా పక్కా ప్రణాళికతో బాధితుడు సెక్షన్ అధికారితో పాటు ఇద్దరు విలేకరులను ఇంటికి పిలిపించాడు. అక్కడ 2లక్షలు ఈ ముగ్గురికీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సెక్షన్ అధికారి మదన్‌రాజు, ఈ ఇద్దరు విలేకరులను కొంత కాలంగా తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడని వారితోనే డబ్బులు వసూలు చేయిస్తున్నాడని అధికారులు తెలిపారు. అక్రమంగా ఇల్లు కట్టావంటూ కేశవరెడ్డిని బెదిరించారని 5 లక్షలు ఒప్పందం కుదుర్చుకోగా 2 లక్షలు ఇస్తుంటే పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు విలేకరులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment