నిధుల కేటాయింపులో వివక్ష
నిధుల కేటాయింపులో వివక్ష
Published Mon, Sep 26 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
నూనెపల్లె: ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. సాయిబాబానగర్ భగత్‌సింగ్ గ్రంథాలయంలో సోమవారం నంద్యాల డివిజన్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్‌లకు కేటాయిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను విస్మరిస్తున్నారన్నారు. ఈ కారణంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామన్న పేరు తప్ప ఏ పనీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్థికం సంఘం నుంచి తమకు కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 2ను సంఘటిత దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశానికి సర్పంచ్‌ల సంఘం డివిజన్ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి మద్దతు ఇచ్చారు. ఎంపీటీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల హుసేని, అధ్యక్షుడు ధర్మవరం వాసు, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రావు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement