financial commission
-
కరోనా పనులకు 14వ ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలకు 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలు వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటివరకు పారిశుద్ధ్యం, తాగునీరు, మూలపనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించే అవకాశముండేది. తాజాగా కరోనా నియంత్రణ పనులకు కూడా ఈ నిధులను వాడుకునే వెసులుబాటును కేంద్ర çపంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున.. పంచాయతీలకు నిధుల కటకట ఏర్పడింది. తాజాగా గ్రామాల్లోని స్కూళ్లు, రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, పశుసంవర్థక శాఖ కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని సూచించింది. అలాగే శానిటేషన్ పనులు నిర్వహించే సిబ్బందికి హ్యాండ్‌వాష్, మాస్క్‌లను కూడా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలావుండగా, 2019–20 వార్షిక సంవత్సరంతో 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే, దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పద్దుకింద మిగిలిపోయిన నిధులను వాడుకునేందుకు ఏడాదికాలం కలిసిరానుంది. -
పంచాయతీలకు ఊరట
సాక్షి, అనంతపురం: నిధుల్లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2018 నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2019–20 సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు కలిపి మొత్తం మూడు విడతలుగా రావాల్సి ఉండగా 2018–19 సంవత్సరానికి సంబంధించిన ఒక విడత నిధులు రూ.72,25,71,000 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గత టీడీపీ సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిరీ్వర్యం చేసింది. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లించగా.. గ్రామాల్లో రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులే రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు కావడంతో పంచాయతీలకు ఊరట వచ్చింది. నిధుల వ్యయం ఇలా.. జిల్లాలో మొత్తం 1,003 (ప్రస్తుతం 1,044) పంచాయతీలకు గాను జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. కాగా ఈ మొత్తం నిధులన్నీ తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 13,386 చేతిపంపులుండగా..చేతిపంపుల నిర్వహణకు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో చేతిపంపు నిర్వహణకు రూ.వెయ్యి కేటాయించారు. ఇక రక్షిత తాగునీటి అవసరాలకు రూ.42.27 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జిల్లా పరిషత్ ద్వారా ఖర్చు చేయనున్నారు. అంటే ఈ నిధులను పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. తక్కిన నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు. -
కేంద్ర పథకాల అమలుపై సమీక్ష జరగాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎంతకాలం అమలు చేయాలి? వాటి అమలు తీరు వంటి అంశాలపై సమీక్ష జరగా లని 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్కే సింగ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధాన్‌మంత్రి సమ్మాన్ యోజన వంటి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు భారీగా పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. కేంద్ర పథకాలు కిందిస్థాయికి వెళ్లేసరి కి నిధులు ఎంతమేర తరుగుదలకు గురవుతున్నాయో పరిశీలించాలని సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో బుధవారం ‘బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమాఖ్యవాదం; స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు’అంశంపై పలువురు ఆర్థికవేత్తలు 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్కే సింగ్ మాట్లాడుతూ..15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 నుంచి అమ ల్లోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రాలు కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వా రా మెరుగైన వాటాను కోరుకుంటున్నాయని, అందుకుతగ్గట్టుగా ప్రాధామ్యాలను గుర్తించి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలు చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీ పన్నువిధానంలో పలుమార్పులు చోటుచేసుకోవడం, స్లాబులు మారడం వంటివి జరగడంతో రాబడి, తదితర అంశాలపై స్పష్టత సాధించా ల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త వై.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చైనాలో స్థానిక ప్రభుత్వాలకు వనరుల నిర్వహణ, కేటాయిం పులు, ఖర్చులకు సంబంధించి స్వేచ్ఛను ఇచ్చారని, అందుకు భిన్నంగా భారత్‌లో పరిస్థితులున్నాయని చెప్పారు. మార్కెట్లు గతంలో మాదిరి గా భూమి, ఇతరత్రా కేటాయింపులు కోరుకోవడం లేదని, వాటికి అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికసంఘం నిర్వహించాల్సిన పాత్రను పునర్నిర్వచిం చుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బహుళపార్టీ వ్యవస్థకే ఆదరణ ఉందని చెప్పారు. జీఎస్టీతో నష్టపోతున్నాయి జీఎస్టీ అమలుతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, రాబడి రాక అవి తీవ్రంగా నష్టపోతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మహంతి అన్నారు. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీచేసే చర్యలు ఆర్థిక సంఘం తీసుకోవాలన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. జీఎస్టీ, విపత్తుల నిర్వహ ణ వంటి అంశాలపై ఆర్థిక సంఘం దృష్టి పెట్టాలని విశ్రాంత ఐఏ ఎస్ అధికారి వి.భాస్కర్ సూచించారు. జీఎస్టీ అమలు ద్వారా కేంద్రం వద్ద పెద్దమొత్తంలో పన్నులు పోగుపడటం సరికాదన్నారు. ఎండీఆర్ఎఫ్ కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను 25 నుంచి 30 శాతానికి పెంచాలన్నారు. కేంద్ర పథకాలను కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసేందుకు సంసిద్ధంగా లేక పోతే ఇతరత్రా రూపాల్లో ఆయా రాష్ట్రాలకు నిధులు అందేలా ఆర్థికసంఘం చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు మెరుగైన ఫలి తాలు సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యు లు అనూప్‌సింగ్, అశోక్ లహరి, అరవింద్ మెహ తా, రమేశ్ ఛాడ్, ఆర్థిక వేత్తలు డా.ప్రేమ్ చంద్, నారాయణ్ వల్లూరి, ప్రొ.భగవాన్ చౌదరి, డా.డి.శివారెడ్డి, ప్రసన్న తంత్రి, ఎన్ఏఖాన్, రాధికా రస్తోగి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలని మేయ ర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హరిత ప్లాజాలో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షు డు జి.రాజేశంగౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మేయర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాలు, ఫ్యాక్టరీలు, తదితర సంస్థల నుంచి నూరు శాతం ఆస్తి పన్ను వసూలుకు ప్రభుత్వం కార్పొరేషన్లకు అనుమతివ్వాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థలు తమ నివేదికల్ని రాష్ట్ర ఆర్థిక కమిషన్‌కు పంపించాలని, అందుకనుగుణంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రాజేశంగౌడ్ చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్లు ఎన్.నరేందర్, సర్దార్ రవీందర్‌సింగ్, లక్ష్మీనారాయణ, సుజాత శ్రీశైలం, డాక్టర్ పాపాలాల్, మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెన్నెడి, ఆ కార్పొరేషన్ల కమిషనర్లు వీపీ గౌతమ్, కె.శశాంక, డి.జాన్ శాంసన్, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కేటాయింపులో వివక్ష
నూనెపల్లె: ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. సాయిబాబానగర్ భగత్‌సింగ్ గ్రంథాలయంలో సోమవారం నంద్యాల డివిజన్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్‌లకు కేటాయిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను విస్మరిస్తున్నారన్నారు. ఈ కారణంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామన్న పేరు తప్ప ఏ పనీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్థికం సంఘం నుంచి తమకు కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 2ను సంఘటిత దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశానికి సర్పంచ్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి మద్దతు ఇచ్చారు. ఎంపీటీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల హుసేని, అధ్యక్షుడు ధర్మవరం వాసు, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రావు, నాయకులు పాల్గొన్నారు.