- పంచాయతీరాజ్‌లో పర్సెంటేజీల పర్వం
- అంగన్‌వాడీ భవన నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి వసూలు
- లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు
- పనుల నాణ్యతకు తిలోదకాలు
అనంతపురం సిటీ : పంచాయతీ రాజ్ శాఖలో ‘వసూళ్ల రాజాలు’ హల్‌చల్ చేస్తున్నారు. ప్రతి పనికీ ‘రేటు’ కడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్ పెడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారులు మొదలుకుని అటెండర్ల వరకు ప్రతిఒక్కరికీ వారి ‘స్థాయి’ని బట్టి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. వసూళ్ల రాజాలను సంతృప్తి పరిచే క్రమంలో పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు.
ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణరోడ్లు, కోల్డ్‌స్టోరేజీలు, అంగన్‌వాడీ, హాస్టల్ భవన నిర్మాణాలు తదితర పనులు చేపడుతున్నారు. ప్రతి పనిలోనూ అధికారులు ముక్కుపిండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 851 అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని 29 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో నిర్మించాలి. ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 లక్షలు కేటాయించింది. భవనం పైకప్పు వరకు నిర్మాణానికి రూ.5 లక్షలు , పైపనులకు రూ.2 లక్షల ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఈ మొత్తంతో నిబంధనల మేరకు పనులు చేపడితే భవనాలను దృఢంగా నిర్మించవచ్చు. అయితే.. వసూళ్ల రాజాలు ఇందులోనూ కక్కుర్తి పడుతున్నారు.
పనుల నాణ్యత దేవుడెరుగు..తమ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే బిల్లు చేయడం లేదు. ఒక్కో భవన నిర్మాణంపై ఏకంగా రూ.లక్ష దాకా చేతులు తడపాల్సి వస్తోందని అనంతపురం సబ్‌డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భవన నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌కు భవన నిర్మాణ అనుమతులు వచ్చి ఐదు నెలలు అవుతోంది. టాప్ లెవల్ వరకు పనులు చేశారు. ఇప్పటిదాకా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.2.50 లక్షలు అయ్యే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఐదు నెలలుగా ఈ పని కోసం తిరిగినందుకు రూ.లక్ష దాకా అయ్యిందని చెప్పారు. కేవలం ఫైలు కదిలించేందుకే రూ.78 వేలు మామూళ్లు ఇచ్చుకోవాల్సి వచ్చిందని వాపోయారు.
‘ఎంతో కొంత మిగులుతుందనే ఆశతో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా. తీరా చూస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. బుద్ధుంటే పంచాయతీరాజ్ పనులు చేయకూడదు. ఏదో తెలీక పని తీసుకుని నష్టపోయా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టే పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్సెంటేజీల కారణంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. మరీముఖ్యంగా అంగన్‌వాడీ భవనాలను పలుచోట్ల నాసిరకంగా నిర్మిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ముడిపడిన ఈ భవన నిర్మాణాల నాణ్యతపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వసూళ్ల ‘రాజ్’
Published Fri, Mar 24 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
Advertisement
Advertisement