అధ్యయన కేంద్రాల అక్రమార్జన
- ‘మెయింటెనెన్స్’ పేరిట వసూళ్ల పర్వం
- ఒక్కో విద్యార్థిపై రూ.3వేల నుంచి రూ.5వేలు అదనపు భారం
- రూ.15వేలు కడితే పరీక్ష రాయాల్సిన పని కూడా లేదట!
- మూడు పువ్వులు ఆరు కాయలుగా విద్యా వ్యాపారం
...........................................................
కర్నూలు జిల్లాలోని ఒక అధ్యయన కేంద్రంలో ప్రణతి అనే విద్యార్థిని దూరవిద్య ద్వారా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కేంద్రం నిర్వాహకులు ఆమెకు ఫోన్ చేసి డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు ఉంటాయని, రూ.3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజు మొత్తం చెల్లించేశాం కదా, ఇదెందుకు అని అడిగితే పరీక్షల నిర్వహణకు సవాలక్ష ఖర్చులు ఉంటాయని, ఎందరినో ప్రభావితం చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అడిగిన డబ్బులు చెల్లించకపోతే హాల్‌టికెట్ ఇవ్వబోమన్నారు. ఒక్క ప్రణతి విషయంలోనే కాదు... సింహభాగం దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు అందరూ ఇదే బాటలో నడుస్తున్నారు.
...........................................................
ఎస్కేయూ : ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నారు. ఈ సమాచారాన్ని ఎస్కేయూ ఉన్నతాధికారులు ఆయా అధ్యయన కేంద్రాలకు ముందస్తుగా అందించారు. ఈ నేపథ్యంలో వాటి నిర్వాహకులు మెయింటెనెన్స్ పేరిట వసూళ్లు మొదలెట్టేశారు. కోర్సు ఫీజు కట్టిన విద్యార్థి అదనంగా రూ.3 వేల నుంచి రూ.5వేలు కడితేనే కానీ హాల్‌టికెట్ ఇచ్చేది లేదంటున్నారు. హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచకుండా నేరుగా అధ్యయన కేంద్రాలకు పంపుతుండటం వల్ల వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
మరీ విడ్డూరం ఏమిటంటే.. ఒక్కో పేపరుకు రూ.3 వేలు చొప్పున 5 పేపర్లకు రూ.15 వేలు కడితే విద్యార్థులు పరీక్షలు కూడా రాయాల్సిన పని లేదట. నిర్వాహకులే వారి స్థానంలో మరొకరిని పంపి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు ఇలా ఏటా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 212 అధ్యయన కేంద్రాలలో 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి వచ్చే నికర ఆదాయం కన్నా అధ్యయన కేంద్రాల అక్రమార్జన కనీసం అంటే రెట్టింపు ఉంటుందనేది పరిశీలకుల అంచనా.
ఫీజులో 20 శాతం ఇస్తున్నా...
ప్రతి డిగ్రీ అడ్మిషన్‌కు విద్యార్థి వర్సిటీకి చెల్లిస్తున్న కోర్సు ఫీజులో 20 శాతం అధికారికంగా అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. ఇవి కాక పరీక్ష నిర్వహణ కేంద్రానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులూ వర్సిటీ చెల్లిస్తుంది. అయినప్పటికీ వారు విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు. వీటిపై ఎస్కేయూ దూరవిద్య విభాగం పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలూ లేకపోలేదు. గతేడాది కొన్ని పరీక్ష కేంద్రాలకు మాత్రమే పరిశీలకులను నియమించారు. వారు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అధ్యయన కేంద్రాల అక్రమార్జన యథేచ్ఛగా సాగింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు దూరవిద్య విభాగం అధికారులు తగిన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.