కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం
సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు అన్ని శాఖల్లోనూ ఇదే తంతు
లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధ పడండి
మీ కంపెనీ తరఫున పనులు చేసి.. బిల్లులు తాము తీసుకుంటామంటూ ఒత్తిడి
ఆ అక్రమాలకు తామెందుకు బాధ్యత వహించాలంటున్న కాంట్రాక్టర్లు
తమ బిల్లులు ఇప్పించి.. 60 సీ కింద ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సూచన
దాంతో 2014–19 విధానానికే మరింత పదును పెడుతున్న టీడీపీ ముఖ్యనేతలు
సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు అన్ని శాఖల్లోనూ ఇదే తంతు
‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’ – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.
‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్ఫెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’ – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.
సాక్షి, అమరావతి: గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.
ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు.
పాత విధానంలో దూకుడుగా
కాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్‌ఎస్‌ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment