మంత్రి పయ్యావుల ఇలాకాలో చెలరేగిపోతున్న టీడీపీ నేతలు
గాలిమరల సెక్యూరిటీ ఏజెన్సీని వదిలివెళ్లాలని హుకుం
నాలుగు రోజుల క్రితం నింబగల్లు సబ్‌స్టేషన్‌కు తాళాలు
ఇప్పటికే పలుచోట్ల సెక్యూరిటీని తొలగించి తమ మనుషులను పెట్టుకున్న టీడీపీ నేతలు
స్థానిక నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని సీఎం, లోకేశ్‌కు ఏజెన్సీ ఫిర్యాదు
స్పందించని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు మొదలుకుని అధికారుల వరకూ అందరినీ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమకు తలవంచకపోతే ఇక్కడ పనిచేసుకోలేరని నేరుగా హెచ్చరిస్తున్నారు.
ఇలా కూటమి సర్కారు కొలువుదీరిన నాటినుంచి ఉరవకొండలో చోటామోటా నాయకులు, మండల స్థాయి లీడర్లు చెలరేగిపోతున్నారు. మాట వినకపోతే దౌర్జన్యాలకూ తెగబడుతున్నారు. తాజాగా.. ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి వస్తున్న బెదిరింపులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది.
సెక్యూరిటీ ఏజెన్సీకి బెదిరింపులు
గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గాలిమరలు (విండ్‌మిల్స్) ఏర్పాటుచేశారు. వీటి భద్రతను ఎస్‌ఐఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ 100 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తోంది. కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి తమ మనుషులను పెట్టుకోవాలని.. మాట వినకపోతే ఇక్కడ ఉండలేరంటూ ఉరవకొండకే చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మనుషులు ఏజెన్సీని బెదిరిస్తున్నారు.
కొన్నిచోట్ల వీరు బరితెగించి సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు లాగి యూనిఫాం వేసుకుని విధుల్లో చేరారు. వీరి ఆగడాలు చూసి ఏమీచేయలేక అక్కడున్న కంపెనీ ఇంజనీర్లు నోరెత్తడంలేదు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టీడీపీ నేతలు ఉరవకొండకు సమీపంలోని నింబగల్లు విండ్‌మిల్ సబ్‌స్టేషన్‌లో గొడవకు దిగి కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిసింది.
ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో మళ్లీ తెరిచారు. ప్రస్తుతానికి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించి కొత్తవారిని పెట్టారు. మరోవైపు.. ఎస్‌ఐఎస్ సంస్థకు 2026 వరకూ కాంట్రాక్టు ఉంది. కానీ, తక్షణమే కాంట్రాక్టు వదిలివెళ్లాలని పచ్చమూకలు బెదిరిస్తున్నాయి.
ముఖ్యమంత్రికి ఫిర్యాదు..
ఈ దౌర్జన్యాలు, బెదిరింపులపై సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌కూ ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకాలు కల్పిస్తూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని.. నిజానికి.. తాము స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించామని, అయినా సరే వెళ్లిపోవాలని తమను ఒత్తిడి చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కానీ, వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా టీడీపీ నేతల బెదిరింపులూ కొనసాగుతున్నాయి.
మంత్రి ఇలాకాలో తమ్ముళ్ల ఆగడాలు..
» విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఎనిమిదెకరాలు మొక్కజొన్న పంట వేయగా టీడీపీ నేతలు ఆ భూమి మాదంటూ పంటను ధ్వంసం చేశారు.
» ఇదే మండలం చీకలగురికి గ్రామంలో ఓబులేసు, చౌడమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో కందిపంట వేశారు. ఈ భూమి కూడా తమదేనంటూ పంటను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారు.
»మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లకు సమీపంలో టీడీపీ మండల స్థాయి లీడర్ జూదం నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడకుండా వదిలేశారు.
» ఉరవకొండలో చౌకబియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. డీలర్ల సహకారంతో టీడీపీ లీడర్లు దందా సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment