అధికారులే గుత్తేదార్లు! | Officers Becoming COntractors For 30 Days Functionality In Nizamabad | Sakshi
Sakshi News home page

అధికారులే గుత్తేదార్లు!

Published Tue, Sep 24 2019 10:42 AM | Last Updated on Tue, Sep 24 2019 10:42 AM

Officers Becoming COntractors For 30 Days Functionality In Nizamabad - Sakshi

ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన పనులలో 80 శాతానికి పైగా పనులను ఇంజినీరింగ్‌ అధికారులే గుత్తేదార్ల అవతారమెత్తి చేయిస్తున్నారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేనందున అధికారులే చేయాల్సి వస్తోందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సాక్షి, నిజామాబాద్‌ : ఇంజినీరింగ్‌ అధికారులే గుత్తేదార్లుగా మారారు. టెండరు ప్రక్రియలు లేకుండా రూ.లక్షల అంచనా వ్యయం కలిగిన పనులను నామినేషన్‌పై చేపడుతున్నారు. ఈ విభిన్న పరిస్థితి ఇప్పుడు విద్యుత్‌ శాఖలో నెలకొంది. పవర్‌ వీక్‌ (విద్యుత్‌ వారం) పేరుతో సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ప నుల్లో సుమారు 80 శాతానికి పైగా అధికారుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. వారే పనులు చే యడం.. వారే ఎంబీ రికార్డులు చేపట్టడం.. బిల్లులు డ్రా చేయడం వంటి పరిస్థితి నెలకొంది.  గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 588 గ్రామాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన పనులను విద్యుత్‌శాఖ గుర్తించింది. పవర్‌వీక్‌లో భాగంగా ఈనెల 9 నుంచి 20 వరకు ఈ పనులను గుర్తించారు. లూజ్‌లైన్లను సరిచేయడం, వంగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, విద్యుత్‌ లైన్‌ మధ్యలో కొత్త స్తంభాన్ని బిగించడం, రీ ఎర్తింగ్, స్ట్రీట్‌లైట్‌ మీటర్‌ పాయింట్లు, రెండు వైర్లు ఉన్న లైన్లకు మూడో వైరు ఏర్పాటు చేయడం.. నాలుగు వైర్లున్న లైన్లకు ఐదోది గుంజడం ఇలా జిల్లావ్యాప్తంగా వందలాదిగా చిన్న చిన్న మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు.

విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఈ పనులను గుర్తించారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేరు. ఇలాంటి పనులు చేసే గుత్తేదార్లు సుమారు 30 మంది లోపే ఉంటారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే విద్యుత్‌శాఖ అధికారులే ఇప్పుడు కాంట్రాక్టర్లుగా మారాల్సి వచ్చిందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

50 గ్రామాల్లో పనులు.. 
ఈ పనులన్నింటినీ అక్టోబర్‌ 5లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 588 గ్రామాలకు గాను ఇప్పటివరకు కేవలం 60 గ్రామాల్లో మాత్రమే విద్యుత్‌ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇంకా అనేక గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. ఒక్కో సెక్షన్‌కు సంబంధించి ఏఈలు అంచనాలు తయారు చేసి.. ప్రతిపాదనలు పంపారు. డీఈలు అగ్రిమెంట్‌ చేసి పనులు చేయిస్తున్నారు.  

ప్రైవేట్‌లో మెటీరియల్‌.. 
విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, ఇతర పరికరాలకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడటంతో ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా విద్యుత్‌శాఖ డిపోలో నుంచే మెటీరియల్‌ తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మరమ్మతు పనులు జరుగుతుండటంతో ప్రైవేటులో కొనుగోలు చేసి.. బిల్లులు డ్రా చేయాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం టెండరు ప్రక్రియ నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో అధికారులే నామినేషన్లపై చేయాల్సి వస్తోందని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement