సాక్షి, కామారెడ్డి: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కౌసల్య ఆస్పత్రి గుట్టు రట్టయింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇష్టారీతిన అబార్షన్లు చేస్తున్న వైనాన్ని అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. ఆస్పత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొంత కాలంగా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు.
అక్కడ గర్భిణికి లింగ నిర్ధారణ స్కానింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆడో, మగో నిర్ధారించి చెబుతున్న విషయాన్ని గమనించి దాడులు నిర్వహించారు. స్కానింగ్ కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తుండడం, లింగ నిర్ధారణ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండడంతో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో అబార్షన్లు కూడా నిర్వహిస్తుండడం, స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యంపై పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు.
కోడ్ భాషలో చెప్పేస్తారు..
కౌసల్య ఆస్పత్రిలో కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ అయితే ‘సీత కష్టం’ అని, మగ బిడ్డ అయితే ‘రామ రామ’ అని కోడ్ భాషలో చెబుతారు. సీత కష్టం అనగానే చాలా మంది అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్‌తో ధర మాట్లాడుకుంటున్నారు. ‘రామ రామ’ అని చెప్పడంతో ఆనందంతో ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఈ ఆస్పత్రి వ్యవహారంపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సరైన ఆధారాలు లేక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సరిహద్దులు దాటి వస్తున్నారు..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోధన్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్, ధర్మాబాద్, ఔరద్ తదితర ప్రాంతాల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి అర్హతలు లేని వారు అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అబార్షన్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది.
మాజీ ప్రజాప్రతినిధే అన్నీ..
రాజంపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అర్హలు లేకున్నా తనే రేడియాలజిస్టు అవతారం ఎత్తి స్కానింగ్‌లు చేయడం, లింగ నిర్ధారణ వివరాలు బయటకు చెబుతూ దండుకుంటున్నట్టు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. వైద్యుల కుటుంబానికి చెందిన సదరు ఆస్పత్రి యజమాని సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదించిన సదరు యజమాని.. శ్రీరాంనగర్ కాలనీలోనే సొంత భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
ఆస్పత్రి సీజ్, యజమానిపై కేసు..
కౌసల్య ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. యజమాని సిద్దిరాములుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో పెరుగుతన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ తెలిపారు. స్కానింగ్ చేసిన వారితో పాటు ప్రోత్సహంచిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆడ పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గడానికి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment