Fetal baby
-
బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..శిశువులకు ఎందుకొస్తుంది..?
పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది. అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!. పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు సరిగా తినలేకపోవడం శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం త్వరితగతిన అలసిపోవడం స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి. ఎందువల్ల వస్తుందంటే.. గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు. చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?) -
ఆడబిడ్డ అయితే ‘సీత కష్టం’.. మగబిడ్డ అయితే 'రామ రామ'
సాక్షి, కామారెడ్డి: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కౌసల్య ఆస్పత్రి గుట్టు రట్టయింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇష్టారీతిన అబార్షన్లు చేస్తున్న వైనాన్ని అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. ఆస్పత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొంత కాలంగా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు. అక్కడ గర్భిణికి లింగ నిర్ధారణ స్కానింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆడో, మగో నిర్ధారించి చెబుతున్న విషయాన్ని గమనించి దాడులు నిర్వహించారు. స్కానింగ్ కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తుండడం, లింగ నిర్ధారణ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండడంతో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో అబార్షన్లు కూడా నిర్వహిస్తుండడం, స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యంపై పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. కోడ్ భాషలో చెప్పేస్తారు.. కౌసల్య ఆస్పత్రిలో కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ అయితే ‘సీత కష్టం’ అని, మగ బిడ్డ అయితే ‘రామ రామ’ అని కోడ్ భాషలో చెబుతారు. సీత కష్టం అనగానే చాలా మంది అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్‌తో ధర మాట్లాడుకుంటున్నారు. ‘రామ రామ’ అని చెప్పడంతో ఆనందంతో ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఈ ఆస్పత్రి వ్యవహారంపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సరైన ఆధారాలు లేక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిహద్దులు దాటి వస్తున్నారు.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోధన్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్, ధర్మాబాద్, ఔరద్ తదితర ప్రాంతాల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి అర్హతలు లేని వారు అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అబార్షన్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధే అన్నీ.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అర్హలు లేకున్నా తనే రేడియాలజిస్టు అవతారం ఎత్తి స్కానింగ్‌లు చేయడం, లింగ నిర్ధారణ వివరాలు బయటకు చెబుతూ దండుకుంటున్నట్టు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. వైద్యుల కుటుంబానికి చెందిన సదరు ఆస్పత్రి యజమాని సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదించిన సదరు యజమాని.. శ్రీరాంనగర్ కాలనీలోనే సొంత భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఆస్పత్రి సీజ్, యజమానిపై కేసు.. కౌసల్య ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. యజమాని సిద్దిరాములుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో పెరుగుతన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ తెలిపారు. స్కానింగ్ చేసిన వారితో పాటు ప్రోత్సహంచిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆడ పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గడానికి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని ఆమె చెప్పారు. -
గర్భస్థ శిశువుకు ఆధునిక వైద్యం
కర్నూలు(హాస్పిటల్): గర్భస్థ శిశువుకు ఉండే లోపాలను ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చని ఫీటల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ గాయత్రి ఇండ్ల చెప్పారు. ఫాగ్సీ కర్నూలు, లోటస్ అల్ట్రాసౌండ్, ఫీటల్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ హోటల్లో గర్భస్థ శిశువు లోపాలపై వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి ఇండ్ల మాట్లాడుతూ స్కానింగ్, స్క్రీనింగ్ ద్వారా జన్యులోపాలను, ఇతర అవయవలోపాలను, బిడ్డ ఎదుగుదలను గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. గర్భస్థ శిశువుకు సైతం మల్టీస్పెషాలిటీ స్థాయిలో కేర్ అవసరమన్నారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, పీడియాట్రిక్ సర్జన్లు కలిసి గర్భస్థ శిశువుకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై డాక్టర్ ఉమారామ్(చెన్నై), డాక్టర్ చిన్మయి, డాక్టర్ అమిత(హైదరాబాద్) ప్రసంగించారు. కార్యక్రమంలో ఫాగ్సీ సెక్రటరీ డాక్టర్ మాణిక్యరావు, చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చలపతి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. -
షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు
ముంబై: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం నిబంధనలను షారుఖ్ దంపతులు ఉల్లంఘించారని వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది కోర్టులో గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్లు దేశ్‌పాండే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడతామని సెప్టెంబర్ 12న చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలపాలంటూ షారుఖ్ దంపతులతోపాటు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.