పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది.
అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!.
పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్‌డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి.
ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు
- సరిగా తినలేకపోవడం
- శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం
- వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం
- త్వరితగతిన అలసిపోవడం
- స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి.
ఎందువల్ల వస్తుందంటే..
గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు.
చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment