officers action
-
అధికారులే గుత్తేదార్లు!
ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన పనులలో 80 శాతానికి పైగా పనులను ఇంజినీరింగ్ అధికారులే గుత్తేదార్ల అవతారమెత్తి చేయిస్తున్నారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేనందున అధికారులే చేయాల్సి వస్తోందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, నిజామాబాద్ : ఇంజినీరింగ్ అధికారులే గుత్తేదార్లుగా మారారు. టెండరు ప్రక్రియలు లేకుండా రూ.లక్షల అంచనా వ్యయం కలిగిన పనులను నామినేషన్‌పై చేపడుతున్నారు. ఈ విభిన్న పరిస్థితి ఇప్పుడు విద్యుత్ శాఖలో నెలకొంది. పవర్ వీక్ (విద్యుత్ వారం) పేరుతో సుమారు రూ.ఐదు కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ప నుల్లో సుమారు 80 శాతానికి పైగా అధికారుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. వారే పనులు చే యడం.. వారే ఎంబీ రికార్డులు చేపట్టడం.. బిల్లులు డ్రా చేయడం వంటి పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 588 గ్రామాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన పనులను విద్యుత్‌శాఖ గుర్తించింది. పవర్‌వీక్‌లో భాగంగా ఈనెల 9 నుంచి 20 వరకు ఈ పనులను గుర్తించారు. లూజ్లైన్లను సరిచేయడం, వంగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, విద్యుత్ లైన్ మధ్యలో కొత్త స్తంభాన్ని బిగించడం, రీ ఎర్తింగ్, స్ట్రీట్‌లైట్ మీటర్ పాయింట్లు, రెండు వైర్లు ఉన్న లైన్లకు మూడో వైరు ఏర్పాటు చేయడం.. నాలుగు వైర్లున్న లైన్లకు ఐదోది గుంజడం ఇలా జిల్లావ్యాప్తంగా వందలాదిగా చిన్న చిన్న మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఈ పనులను గుర్తించారు. సాధారణంగా మరమ్మతు పనులను టెండరు ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాగా ఒక్కసారిగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి రావడంతో అంతమంది గుత్తేదారులు జిల్లాలో లేరు. ఇలాంటి పనులు చేసే గుత్తేదార్లు సుమారు 30 మంది లోపే ఉంటారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే విద్యుత్‌శాఖ అధికారులే ఇప్పుడు కాంట్రాక్టర్లుగా మారాల్సి వచ్చిందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 50 గ్రామాల్లో పనులు.. ఈ పనులన్నింటినీ అక్టోబర్ 5లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 588 గ్రామాలకు గాను ఇప్పటివరకు కేవలం 60 గ్రామాల్లో మాత్రమే విద్యుత్ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇంకా అనేక గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. ఒక్కో సెక్షన్‌కు సంబంధించి ఏఈలు అంచనాలు తయారు చేసి.. ప్రతిపాదనలు పంపారు. డీఈలు అగ్రిమెంట్ చేసి పనులు చేయిస్తున్నారు. ప్రైవేట్‌లో మెటీరియల్.. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర పరికరాలకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడటంతో ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా విద్యుత్‌శాఖ డిపోలో నుంచే మెటీరియల్ తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మరమ్మతు పనులు జరుగుతుండటంతో ప్రైవేటులో కొనుగోలు చేసి.. బిల్లులు డ్రా చేయాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం టెండరు ప్రక్రియ నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో అధికారులే నామినేషన్లపై చేయాల్సి వస్తోందని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : పట్టణంలో నాలుగేళ్లపాటు విచ్చలవిడిగా సాగిన అక్రమ లేఅవుట్ల వ్యాపారంపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. రెండు రోజుల నుంచి అనధికార లేఅవుట్లలో వేసిన రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. రియల్ఎస్టేట్ దందాలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలే ఉండటం విశేషం. ప్రస్తుతం వేస్తున్న అక్రమ లేఅవుట్లే కాకుండా, ఇప్పటికే అమ్మకాలు సాగించిన అనధికార లేవుట్లపైనా అధికారులు దృష్టిపెట్టారు. నిజానికి నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఏకంగా రూ.500 కోట్ల వరకూ రియల్ఎస్టేట్ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగినట్టు అంచనా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మూడురోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన అనధికార లేఅవుట్లు, మున్సిపల్ రిజర్వ్ స్థలాల ఆక్రమణలు వంటి అంశాలను ఉపేక్షించనని హెచ్చరించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. దాదాపు 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు పట్టణంలో దాదాపుగా 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు గత నాలుగేళ్ల కాలంలో వేశారు. రోడ్డుపక్కన పెద్దపెద్ద ఆర్చిలు కట్టి తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా రెచ్చిపోయారు. పట్టణంలోని స్టేషన్‌పేట, గ్రేస్‌నగర్, చినమామిడిపల్లిలోని సాయిబాబాగుడి ఎదురుగా తోటలో ఎకరాలకు ఎకరాలు భూములు పూడ్చారు. ఇక పీచుపాలెం, థామస్ బ్రిడ్జిప్రాంతం , జవదాలవారిపేట, పొన్నపల్లి, ఎన్టీఆర్కాలనీ , నందమూరి కాలనీ, రుస్తుంబాద ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఇష్టానుసారం వేసేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లక్షల్లో మామూళ్లు ముట్టాయి. తమతమ వార్డుల్లో జరుగుతున్న లేవుట్ల వ్యవహారంలో కొందరు కౌన్సిర్లు కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శలు ఉన్నాయి. ముందుగా సంబంధిత కౌన్సిలర్లతో రియలర్టర్లు మట్లాడేసుకుంటే , ఈ విషయంలో కౌన్సిల్ సమావేశాల్లో గొడవలు చేయడం, అధికారులపై ఒత్తిడి తేవడం లాంటివి లేకుండా సాఫీగా చేసుకుపోయారనే విమర్శలు ఉన్నా యి. మొత్తంగా నాలుగేళ్లపాటు మున్సిపాలిటీ ఖజానాకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా సాగిన ఈ అక్రమ దందాకు ప్రభుత్వం మారడంతో కళ్లెం పడింది. అనధికార లేఅవుట్లలోనూ అక్రమాలే.. కేవలం అనధికార లేఅవుట్లలోనే కాకుండా, అధికార లేవుట్లలోనూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోయాయి. చినమామిడిపల్లిలో ఓ లేవుట్‌కోసం కమర్షియల్ ప్రాంతాన్ని క్షణాల్లో గృహనివాస ప్రాంతంగా మార్పు చేశారు. ఇక ఈ లేఅవుట్ జనానికి బాగా కనిపించడం కోసం, ఇటువైపు ప్రభుత్వ స్థలంలో కాలువగట్టున ఏళ్ల తరబడి పెంచిన మొక్కలను, చెట్లను నరికేసి అధికారులు సహకరించారు. ఇదే ప్రాంతంలో రైల్వేగేట్ సమస్యకు పరిష్కారంగా మురుగుకాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే ఆ వంతెన కట్టలేకపోతున్నారు గానీ, ఇదే కాలువపై లేవుట్ల కోసం మాత్రం మూడుచోట్ల వంతెనలు కట్టేశారు. ఇక పట్టణ ంలో అపార్టుమెంట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అనధికార లేవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం పట్టణంలో అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అనధికార లేవుట్లను గుర్తించి ఆ స్థలాలను కొనొద్దని సర్వే నంబర్లతో సహా పట్టణంలో బోర్డులు పెట్టాం. ప్రస్తుతం అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేస్తున్నాం. ఇది కొనసాగుతోంది. – వి.చంద్రశేఖర్, టీపీఓ, నరసాపురం -
వేసేయ్.. వెంచర్!
సీఎం ఇలాకాలో జోరుగా అక్రమ వెంచర్లు నాయకులు, రియల్టర్ల పెట్టుబడులు 54 వెంచర్లకు ఆరింటికే అనుమతి అక్రమ దందాపై తూతూ మంత్రంగా చర్యలు యథావిధిగా సాగుతోన్న విక్రయాలు నష్టపోతున్న అమాయక జనం గజ్వేల్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ‘రియల్’ దందా జోరుగా సాగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. వివిధ పథకాల కింద రూ.వేల కోట్లు మంజూరవుతుండడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత రూపురేఖలు మారుతోండడంతో అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది. ఈ దశలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఖాళీ జాగా కన్పిస్తే చాలు వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకపోయినా రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి. అమాయకులను నమ్మించి ప్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా అక్రమ దందా సాగుతోన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా స్థాయి పెరిగింది. ఈ నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో పరిధి పెరిగి పోయింది. ప్రస్తుతం నగరపంచాయతీలో ఇళ్ల సంఖ్య సుమారు 9వేలకుపైగా ఉండగా జనాభా 44 వేలకు చేరింది. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి ఊపందుకుంది. నగర పంచాయతీ పరిధిలో రూ.220కోట్లతో ‘రింగ్‌రోడ్డు’ ప్రతిపాదించడంతో ఇవతలి భూములు బంగారమయ్యాయి. ఈ రోడ్డు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 22 కిలో మీటర్లుగా విస్తరించబోతోంది. ఇందుకోసం 170 ఎకరాల భూమిని సైతం సేకరిస్తున్నారు. మొత్తంగా రోడ్డు లోపలా 4,850 ఎకరాలకు దశ మారిందనే చెప్పాలి. ఇదే అదనుగా కొందరు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 54 వెంచర్లు ఉండగా ఇందులో ఆరింటికి మాత్రమే అనుమతులున్నాయని టౌన్ ప్లానింగ్ అ«ధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇటీవల మరికొన్ని వెలిశాయి. ఖాళీ జాగా కొనుగోలు చేసి అందులో హద్దులు పాతేసి వెంచర్‌గా పరిచయం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తరచూ వివాదాలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో అక్రమంగా వెలిసిన వెంచర్ల కారణంగా తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి నగర పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై దుమారం రేపుతున్నది. వెంచర్ల తతంగంలో గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తగా ఆయనపై బదిలీ వేటు పడింది. ఓ వైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధికి నమునాగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతుండగా... ఇదే అదనుగా నాయకులు మాత్రం భూ‘దందా’ల్లో నిమగ్నమయ్యారు. సీఎం అడుగుజాడల్లో నడిచి ప్రగతికి బాటలు వేయాల్సిందిపోయి ‘దందా’లకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు సైతం నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి అక్రమంగా వెలిసిన వెంచర్లపై చర్యలు కరువయ్యాయి. తరచూ హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ తర్వాత మిన్నకుండడంతో వెంచర్ల లావాదేవీలు యథావిధిగా సాగుతున్నాయి. రెండురోజులుగా ప్రజ్ఞాపూర్‌లోని 218 సర్వే నంబర్లో 30 గుంటల్లో ఏర్పాటు చేసిన వెంచర్, 220 సర్వే నంబరులో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్, ఇదే గ్రామంలోని 323/పీ సర్వే నంబర్లో ఎకరంన్నర విస్తీర్ణంలో వెలిసిన మరో వెంచర్లో హద్దు రాళ్లను తొలగించి హడావిడి చేశారు. ఈ వ్యవహారంపై టీపీఓ నర్సింహరాజును వివరణ కోరగా అనుమతి లేని వెంచర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని పేర్కొన్నారు.