ప్రజ్ఞాపూర్‌లో అనుమతి లేని వెంచర్లలో రాళ్లను తొలగిస్తున్న అధికారులు
- సీఎం ఇలాకాలో జోరుగా అక్రమ వెంచర్లు
- నాయకులు, రియల్టర్ల పెట్టుబడులు
- 54 వెంచర్లకు ఆరింటికే అనుమతి
- అక్రమ దందాపై తూతూ మంత్రంగా చర్యలు
- యథావిధిగా సాగుతోన్న విక్రయాలు
- నష్టపోతున్న అమాయక జనం
గజ్వేల్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ‘రియల్’ దందా జోరుగా సాగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. వివిధ పథకాల కింద రూ.వేల కోట్లు మంజూరవుతుండడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత రూపురేఖలు మారుతోండడంతో అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది. ఈ దశలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఖాళీ జాగా కన్పిస్తే చాలు వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు.
అనుమతులు లేకపోయినా రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి. అమాయకులను నమ్మించి ప్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా అక్రమ దందా సాగుతోన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా స్థాయి పెరిగింది. ఈ నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో పరిధి పెరిగి పోయింది. ప్రస్తుతం నగరపంచాయతీలో ఇళ్ల సంఖ్య సుమారు 9వేలకుపైగా ఉండగా జనాభా 44 వేలకు చేరింది.
ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి ఊపందుకుంది. నగర పంచాయతీ పరిధిలో రూ.220కోట్లతో ‘రింగ్‌రోడ్డు’ ప్రతిపాదించడంతో ఇవతలి భూములు బంగారమయ్యాయి. ఈ రోడ్డు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 22 కిలో మీటర్లుగా విస్తరించబోతోంది. ఇందుకోసం 170 ఎకరాల భూమిని సైతం సేకరిస్తున్నారు. మొత్తంగా రోడ్డు లోపలా 4,850 ఎకరాలకు దశ మారిందనే చెప్పాలి. ఇదే అదనుగా కొందరు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తంగా ఇప్పటివరకు 54 వెంచర్లు ఉండగా ఇందులో ఆరింటికి మాత్రమే అనుమతులున్నాయని టౌన్ ప్లానింగ్ అ«ధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇటీవల మరికొన్ని వెలిశాయి. ఖాళీ జాగా కొనుగోలు చేసి అందులో హద్దులు పాతేసి వెంచర్‌గా పరిచయం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తరచూ వివాదాలు
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో అక్రమంగా వెలిసిన వెంచర్ల కారణంగా తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి నగర పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై దుమారం రేపుతున్నది. వెంచర్ల తతంగంలో గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తగా ఆయనపై బదిలీ వేటు పడింది.
ఓ వైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధికి నమునాగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతుండగా... ఇదే అదనుగా నాయకులు మాత్రం భూ‘దందా’ల్లో నిమగ్నమయ్యారు. సీఎం అడుగుజాడల్లో నడిచి ప్రగతికి బాటలు వేయాల్సిందిపోయి ‘దందా’లకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు సైతం నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి
అక్రమంగా వెలిసిన వెంచర్లపై చర్యలు కరువయ్యాయి. తరచూ హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ తర్వాత మిన్నకుండడంతో వెంచర్ల లావాదేవీలు యథావిధిగా సాగుతున్నాయి. రెండురోజులుగా ప్రజ్ఞాపూర్‌లోని 218 సర్వే నంబర్‌లో 30 గుంటల్లో ఏర్పాటు చేసిన వెంచర్, 220 సర్వే నంబరులో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్, ఇదే గ్రామంలోని 323/పీ సర్వే నంబర్‌లో ఎకరంన్నర విస్తీర్ణంలో వెలిసిన మరో వెంచర్‌లో హద్దు రాళ్లను తొలగించి హడావిడి చేశారు. ఈ వ్యవహారంపై టీపీఓ నర్సింహరాజును వివరణ కోరగా అనుమతి లేని వెంచర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని పేర్కొన్నారు.