Prajnapur
-
నేడు గజ్వేల్‌లో ‘హరితహారం’
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్ : హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం గజ్వేల్‌లో మొక్కలు నాటనున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒకటి, ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో మరొకటి, ఇందిరాచౌక్ దగ్గర ఇంకొకటి మొత్తం మూడు మొక్కలను సీఎం నాటుతారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, రోడ్లపై, ఔటర్‌రింగ్ రోడ్డుపై, ప్రభుత్వ–ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుని ఇందిపార్కు చౌరస్తాలో ‘కదంబ’మొక్క నాటడంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగిస్తారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లో వినాయక ఆలయం ముందు ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో ఓ మొక్క నాటుతారని సమాచారం. సైరన్ మోగిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఏకకాలంలో ప్రజలు మొక్కలు నాటుతారు. ఏర్పాట్లు పూర్తి.. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇళ్లలో పెంచేందుకు చింత, మామిడి, నేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి తెప్పించారు. దాదాపు 1.25 లక్షల మొక్కలను ములుగు, గజ్వేల్ నర్సరీలతో పాటు కల్పకవనం అర్బన్ పార్కుల్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి మొక్కలను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కోక్లస్టర్లో 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకు వీలుగా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1.25 లక్షల గుంత లను తవ్వించారు. సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, నేరేడు), 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సిద్ధం చేశారు. ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ఇంట్లో రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్లలోని ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేశారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీగార్డులను కూడా అధికారులు సిద్ధం చేశారు. మొక్కలు నాటిన తర్వాత వర్షాలు సరిగా పడకపోతే నీటిసౌకర్యం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. కాగా, గజ్వేల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గజ్వేల్ మున్సిపాలిటీ, అర్బన్ ఫారెస్ట్ ఏరియాల్లో కలిపి మొత్తం 1.36 లక్షల మొక్కలు నాటాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 799 ప్రాంతాల్లో కంటి వెలుగు.. ఆగస్టు 15న మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 799 ప్రాంతాల్లో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని, ప్రతి కేంద్రంలో కూడా కచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కంటి పరీక్షలు చేయడానికి అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు, అద్దాలను గ్రామాలకు చేర్చాలని చెప్పారు. -
వేసేయ్.. వెంచర్!
సీఎం ఇలాకాలో జోరుగా అక్రమ వెంచర్లు నాయకులు, రియల్టర్ల పెట్టుబడులు 54 వెంచర్లకు ఆరింటికే అనుమతి అక్రమ దందాపై తూతూ మంత్రంగా చర్యలు యథావిధిగా సాగుతోన్న విక్రయాలు నష్టపోతున్న అమాయక జనం గజ్వేల్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ‘రియల్’ దందా జోరుగా సాగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. వివిధ పథకాల కింద రూ.వేల కోట్లు మంజూరవుతుండడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత రూపురేఖలు మారుతోండడంతో అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది. ఈ దశలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఖాళీ జాగా కన్పిస్తే చాలు వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకపోయినా రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి. అమాయకులను నమ్మించి ప్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా అక్రమ దందా సాగుతోన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా స్థాయి పెరిగింది. ఈ నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో పరిధి పెరిగి పోయింది. ప్రస్తుతం నగరపంచాయతీలో ఇళ్ల సంఖ్య సుమారు 9వేలకుపైగా ఉండగా జనాభా 44 వేలకు చేరింది. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి ఊపందుకుంది. నగర పంచాయతీ పరిధిలో రూ.220కోట్లతో ‘రింగ్‌రోడ్డు’ ప్రతిపాదించడంతో ఇవతలి భూములు బంగారమయ్యాయి. ఈ రోడ్డు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 22 కిలో మీటర్లుగా విస్తరించబోతోంది. ఇందుకోసం 170 ఎకరాల భూమిని సైతం సేకరిస్తున్నారు. మొత్తంగా రోడ్డు లోపలా 4,850 ఎకరాలకు దశ మారిందనే చెప్పాలి. ఇదే అదనుగా కొందరు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 54 వెంచర్లు ఉండగా ఇందులో ఆరింటికి మాత్రమే అనుమతులున్నాయని టౌన్ ప్లానింగ్ అ«ధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇటీవల మరికొన్ని వెలిశాయి. ఖాళీ జాగా కొనుగోలు చేసి అందులో హద్దులు పాతేసి వెంచర్‌గా పరిచయం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తరచూ వివాదాలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో అక్రమంగా వెలిసిన వెంచర్ల కారణంగా తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి నగర పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై దుమారం రేపుతున్నది. వెంచర్ల తతంగంలో గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తగా ఆయనపై బదిలీ వేటు పడింది. ఓ వైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధికి నమునాగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతుండగా... ఇదే అదనుగా నాయకులు మాత్రం భూ‘దందా’ల్లో నిమగ్నమయ్యారు. సీఎం అడుగుజాడల్లో నడిచి ప్రగతికి బాటలు వేయాల్సిందిపోయి ‘దందా’లకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు సైతం నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి అక్రమంగా వెలిసిన వెంచర్లపై చర్యలు కరువయ్యాయి. తరచూ హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ తర్వాత మిన్నకుండడంతో వెంచర్ల లావాదేవీలు యథావిధిగా సాగుతున్నాయి. రెండురోజులుగా ప్రజ్ఞాపూర్‌లోని 218 సర్వే నంబర్లో 30 గుంటల్లో ఏర్పాటు చేసిన వెంచర్, 220 సర్వే నంబరులో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్, ఇదే గ్రామంలోని 323/పీ సర్వే నంబర్లో ఎకరంన్నర విస్తీర్ణంలో వెలిసిన మరో వెంచర్లో హద్దు రాళ్లను తొలగించి హడావిడి చేశారు. ఈ వ్యవహారంపై టీపీఓ నర్సింహరాజును వివరణ కోరగా అనుమతి లేని వెంచర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని పేర్కొన్నారు. -
‘ఆశాజ్యోతి’కి వెలుగునిస్తాం!
గజ్వేల్ రూరల్: ప్రజ్ఞాపూర్‌లోని ఆశాజ్యోతి కేంద్రానికి అదనపు నిధులు మంజూరు చేసి ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య హామీ ఇచ్చారు. మంగళవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ను ఆయన సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆశాజ్యోతి కేంద్ర విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఆశాజ్యోతి కేంద్రం పదేళ్లుగా ఎయిడ్స్ రోగులకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సంస్థను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో ఆశాజ్యోతి కేంద్రం ఉన్నందున, సీఎంతో చర్చించి నిధులు విడుదలైయ్యే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆశాజ్యోతి కేంద్రంలోని చిన్నారులను ఆదుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి డెరైక్టర్ ఆల్విన్ సంస్థకు సహాయ సహకారాలు అందించాలని ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్, హెల్త్ డెరైక్టర్ సూర్యప్రకాశ్, సుపీరియర్ ఫాదర్ ఫెలిక్స్, కోఆర్డినేటర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.