illegal ventures
-
మహేంద్రజాలం!
రాప్తాడు నియోజకవర్గంలో సామంతుల పాలనకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నియోజవకర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో ఇన్చార్జ్గా తన సొంత బంధువులనే మంత్రి నియమించుకుని, పాలనా వ్యవహారాలను వారి చేతుల్లో పెట్టేశారు. ఇదే వారికి బలమైంది. పంచాయతీల ఆర్థిక వనరులను పక్కదారి పట్టించి, సొంత ఖజానాలను నింపుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందుకు స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు, పారిశ్రామిక వాడలోని ఎ.నారాయణ పురం పంచాయతీ పరిధిలో రూ.కోట్లు విలువ చేసే 90 సెంట్ల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో మంత్రి సునీత సమీప బంధువు ఈ స్థలాన్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఓ సామాజిక వర్గం బడాబాబులు కొందరికి ఈ అక్రమాల్లో వాటా ఉన్నట్లు సమాచారం. కబ్జా చేసిన స్థలంలో భవన నిర్మానాలకు తాజాగా అనుమతులు కూడా పొంది, నిర్మాణాలను చేపట్టారు. చివరకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను కూడా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతపురం జిల్లా పంచాయతీ కార్యాలయం మంత్రి సునీత సామంతుడి కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఆ శాఖ ఉన్నతాధికారి సైతం తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి శాఖ విలువలను ఆ సామంతుడికి తాకట్టు పెట్టేశాడు. ఫలితంగా అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఓ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో పలు అక్రమాలకు తెర తీశారు. చివరకు సొంత పార్టీ నేతలే ఈ అక్రమాలపై భగ్గుమనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని 25 పంచాయతీల్లో గుత్తాధిపత్యాన్ని చెలా యిస్తున్న మంత్రి బంధువు.. అందిన కాడికి దోచుకో అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అక్రమార్జనకు తెరలేపాడు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు, భవనాలు, పంచాయతీల ఆదాయ వనరులు.. చివరకు చెత్తను కూడా అతను వదలడం లేదు. వెంచర్‌కు ఆమోదం పొందాల్సిందే అనంతపురం రూరల్ మండల పరిధిలో ఇటీవల వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగాయి. ప్లాట్లు విక్రయించిన ప్రతి ఒక్క రియల్టర్.. మంత్రి సామంతుడికి రాయల్టీ చెల్లించుకోవాల్సిందే. తాజాగా అనంతపురం రూరల్ పరిధిలోని ఎస్కేయూ సమీపంలో వెంచర్ వేసిన ఓ కొత్త రియల్టర్‌కు ఈ విషయం తెలియక ఆ సామంతుడిని కలవలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శిని అతను రంగంలో దించాడు. రియల్టర్‌ను పిలిపించుకుని మాట్లాడిన కార్యదర్శి ఈ ప్రాంతంలో సామంతుడి కప్పం కట్టందే ఏ పనీ చేసేందుకు వీలు లేదంటూ తేల్చిచెప్పినట్లు సమాచారం. సామంతుడి అక్రమాలను ఎదురించేందుకు సిద్ధపడిన ఆ రియల్టర్ అన్నింటా చుక్కెదరవుతూ వచ్చింది. దీంతో గత్యంతరం లేక చివరకు సామంతుడికి దాసోహమనక తప్పలేదు. మంత్రి బంధువును కలిసి నజరానా చెల్లించుకోవడంతో అతని వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది. కార్యదర్శుల్లో అధిక శాతం ఆ సామాజిక వర్గమే.. అనంతపురం రూరల్ పరిధిలోని 25 పంచాయతీల్లో కీలకమైన, అధిక రాబడి ఉన్న పంచాయతీలకు కార్యదర్శులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకుని అక్రమాలకు మంత్రి బంధువు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో రుద్రంపేట, రాచానుపల్లి, ఎ.నారాయణపురం, కురుగుంట, సోములదొడ్డి పంచాయతీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. మంత్రి బంధువు అనుగ్రహం తమకు ఉందనే ధీమాతో పంచాయతీ కార్యదర్శులు అక్రమార్జనకు తెరలేపారు. వీరిలో చాలా మంది ఏసీబీ వలలో చిక్కి, నేటికీ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. లే అవుట్ అప్రూవల్ చేయాలంటే ముందుగా మంత్రి బంధువుకు నజరానా చెల్లించిన తర్వాతే అనుమతి లభిస్తుంది. కార్యదర్శుల ప్రతి కదలిక అతని కనుసన్నల్లో ఉంది. వారు చేసే ప్రతి సంతకంలో అతడికి వాటా ఉంది. గతంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు తన మాటకు విలువ ఇవ్వలేదనే కారణంగా ఆంక్షలతో వేధించాడు. చివరకు వారు ఉద్యోగాన్ని సైతం వదుకునేందుకు సిద్ధమవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. చివరకు జిల్లా పంచాయతీ అధికారిని సైతం అతను ప్రభావితం చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. కక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో తుమ్మచెట్లను ఇటీవల నరికి కలపను అమ్ముకున్నారు. ఈ విక్రయం ద్వారా వచ్చిన దాదాపు రూ.14 లక్షల ఆదాయాన్ని పంచాయతీ ఖజానాకు కాకుండా మంత్రి సామంతుడిగా చెలామణి అవుతున్న పెద్దమనిషి స్వాహా చేశాడు. ఈ విషయం కాస్తా బహిర్గతం కావడంతో అధికారిక విచారణ కొనసాగింది. అయితే ‘ఈ ప్రభుత్వం మాది.. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది’ అంటూ విచారణకు వచ్చిన అధికారులను పక్కదారి పట్టించాడు. సర్దుబాటు చర్యలతో వాస్తవాలను భూస్థాపితం చేయించాడు. దీంతో తప్పుడు నివేదికలతో అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమలదొడ్డి సమీపంలో ఐఎంఎల్ డిపో ఉన్న సమయంలోనూ మంత్రి సామంతుడి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐఎంఎల్ డిపో ద్వారా పంచాయతీకి అందుతున్న రాయల్టీ మొత్తాన్ని తన సొంత ఖజానాకు తరలించుకుని సరికొత్త సంప్రదాయానికి తెరతీశాడు. ఈ లెక్కన దాదాపు రూ.30 లక్షలకు పైబడి పంచాయతీకి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు సమాచారం. -
అక్రమ వెంచర్లపై కొరడా
అడ్డాకుల (దేవరకద్ర): మండల కేంద్రం శివారులో అక్రమంగా వెలచిన అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించిన వాటిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇంతకు ముందు కూడా అధికారులు చర్యలు చేపట్టినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10శాతం స్థలాలను కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో మరోసారి అధికారులు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం అడ్డాకుల శివారులోని సర్వే నంబర్ 16, 131, 132లలో ఏర్పాటు చేసిన వెంచర్లపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీకి స్థలాలకు కేయించకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయడంతో అధికారులు ఇంతకు ముందు నోటీసులు జారీ చేశారు. అయినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు స్పందించకపోవడంతో సర్పంచ్ రఘు, పంచాయతీ కార్యదర్శి జయవర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ భీమన్నయాదవ్ జేసీబీ సాయంతో హద్దురాళ్లను తొలగించారు. అనుమతి లేని ప్లాట్లను ఎవరైనా కొనుగోలు చేస్తే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే ప్లాట్లను విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. లేదంటే కొనుగోలుదారులు నష్టపోతారని చెప్పారు. విమానాశ్రమం వస్తుందని..! అడ్డాకుల, గుడిబండ గ్రామాలకు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. గతం కంటే రెట్టింపు ధరలకు దళారులు ప్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు నష్టపోయే అవకాశం ఉన్నందున ఎవరూ వాటిని కొనుగోలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయం ఏర్పాటు అవుతుందన్న సాకుతో అక్రమ వెంచర్లలోని ప్లాట్లను విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. -
‘హద్దు’ మీరిన రియల్ ఆగడాలు
అధికారులు హద్దురాళ్లు తొలగిస్తున్నా మళ్లీ ఏర్పాటు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు మంచిర్యాల రూరల్ : కొత్త జిల్లా భూంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. అక్రమ లేఅవుట్ వేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని అక్రమ వెంచర్లపై ఇటీవల జిల్లా కలెక్టర్ కొరడా ఝుళిపించినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు హద్దు రాళ్లు తొలగిస్తున్నా మరోవైపు ఏర్పాటు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంచిర్యాల మండలంలో 16 గ్రామపంచాయితీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నస్పూర్, తీగల్‌పహాడ్, వేంపల్లి, ముల్కల్ల, గు డిపేట, హాజీపూర్, దొనబండ, రాపల్లి, పడ్తనపల్లి, నర్సింగాపూర్‌లో విస్తృతంగా రియల్ ఎస్టే ట్ వ్యాపారం సాగుతోంది. నూతనంగా కొము రం భీం జిల్లా, నస్పూర్ మండలం ఏర్పడుతుం డడంతో భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో మండల పరిధిలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. అలాగే వీటిపై ఫిర్యాదులు కూడా అదే స్థారుులో వెల్లువెత్తారుు. దీంతో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారి సారథ్యంలో ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒకే రోజు మండలంలోని ఏర్పాటు చేసిన పలు అక్రమ లేఅవుట్లలో మూకుమ్మడి దాడులు నిర్వహించి హద్దురాళ్లను తొలగించారు. ఆయా అనుమతులు లేని వెంచర్లలో అందంగా ముస్తాబు చేసిన బీటీ రోడ్లను చెదరగొట్టించారు. నస్పూర్‌లో 17 ఎకరాలు, వేంపల్లిలో 37, తీగల్‌పహాడ్‌లో 11, ముల్కల్లలో 32, హాజీపూర్‌లో 6, దొనబండలో 2, పడ్తనపల్లిలో 4, నర్సింగాపూర్‌లో 3, గుడిపేటలో 7 ఎకరాల్లో అనుమతులు లేకుండా వెలిసిన లే అవుట్లలోని హద్దురాళ్లను తీసేరుుంచారు. ఈ మొత్తం 120 ఎకరాలు కాగా ఇందులో ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. ఈ చర్య ఇకపై కూడా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించినా రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. నోటీసులకు స్పందించని వ్యాపారులు 2012 నుంచి ఇప్పటి వరకు అనుమతులు లే కుండా వ్యాపారాలు సాగిస్తున్న రియల్ వ్యాపారులకు అధికారులు నోటీసులు అందజేశారు. అయినా స్పందించకపోవడంతో ఈ హద్దురాళ్ల తొలగింపు చేపట్టారు. రియల్ వ్యాపారులు మాత్రం దసరాకు కొత్త జిల్లా ఏర్పాటు కానుండటంతో ఇదే అదనుగా భావిస్తూ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. హద్దురాళ్లను తొలగించినా తిరిగి వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేస్తూ ప్లాటింగ్ చేస్తున్నారు. తాజాగా జిల్లా, మండల ఏర్పాటుతో భూముల ధర లను అమాంతం పెంచేశారు. కొనేవారికి ఏమైనా ఫర్వాలేదు కాని తమ వ్యాపారం సాగాలన్నా ధోరణితో వ్యవహరిస్తున్నారు. లే అవుట్‌లేని ప్లాట్లను అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు కూడా స్పందించి అన్నీ పరిశీలించిన మీదట స్థలాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ రియల్ వ్యాపారులు మాత్రం రాజకీయ అండదండలతో పాటు తమ పలుకుబడిని వినియోగిస్తూ అనుమతి లేని లే అవుట్ ప్లాట్లను అంటగడుతున్నారు. అధికారులు మరోసారి ఈ దందాపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమ లేఅవుట్లపై చర్యలు తప్పవు మండలంలోని అక్రమ లే అవుట్ చేసి వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవు. అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మూకుమ్మడి దాడులు నిర్వహించి హద్దురాళ్లను ఇప్పటికే తొలగించాం. ప్రజలు కూడా ఇలాంటి ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడొద్దు. - శంకర్, ఈవోపీఆర్డీ, మంచిర్యాల Real estate , illegal ventures, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమ వెంచర్లు, -
అక్రమ వెంచర్లకు పెద్దల అండ
దళారులుగా సర్పంచ్‌లు! పట్టించుకోని అధికారులు పటాన్చెరు: మండలంలో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. పలువురు సర్పంచ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోండడంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. వెంచర్లకు అనుమతులున్నాయని పాత తేదీల్లో దస్తావేజులు సృష్టిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో అక్రమ వెంచర్ల జోరు పెరిగింది. పటాన్చెరు మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో రియల్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. నందిగామ పరిధిలో వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రెవెన్యూ అధికారికి రూ.14 లక్షలు ముట్టజెప్పి భూమి చదును చేసే పనులకు శ్రీకారం చుట్టారని సమాచారం. అనుమతులు లేకుండానే భూమి చదును చేసే పనులు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నందిగామ పరిధిలో అదే వెంచర్ నిర్వాహకులు గతంలో హెచ్ఎండీఏ అనుమతులున్నాయని బోర్డులు పెట్టి ప్రచారం చేశారు. తాజాగా ఆ బోర్డులను తొలగించి భూమిని చదును చేస్తున్నారు. రోడ్లు వేసేందుకు మట్టిని తవ్వి తెస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రైవేటు పట్టాదారు భూమిలో మట్టి తవ్వినా రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనలు రెవెన్యూ అధికారుల సొంత జేబు రాబడికి అనువుగా ఉందే తప్ప ప్రజలకు ఉపయోగపడటం లేదు. భవిష్యత్‌లో పర్యావరణానికి జరిగే నష్టంపై ఎవరూ ఆలోచించడం లేదు. పచ్చని చెట్లను నరికేస్తూ వెంచర్లు వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆ సంగతి పక్కన పెడితే ప్రజలను మోసం చేస్తూ కొత్తగా వస్తున్న వెంచర్లను ఆపాల్సిన సర్పంచ్‌లు దళారులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పటాన్చెరు మండలంలో జరుగుతున్న అక్రమ వెంచర్లను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అక్రమ వెంచర్లతో కొత్తగా వచ్చే ఆవాసాల్లో కనీస మౌలిక వసతులు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. పాటి, ముత్తంగి, ఇస్నాపూర్, భానూర్, నందిగామ గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇస్నాపూర్ సర్పంచ్ తీరుపై ఆ గ్రామ నాయకులు నేరుగా డీపీఓకు, ఇతర అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండానే నందిగామలో సాగుతున్న రియల్ డ్రామాలను అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వేసేయ్.. వెంచర్!
సీఎం ఇలాకాలో జోరుగా అక్రమ వెంచర్లు నాయకులు, రియల్టర్ల పెట్టుబడులు 54 వెంచర్లకు ఆరింటికే అనుమతి అక్రమ దందాపై తూతూ మంత్రంగా చర్యలు యథావిధిగా సాగుతోన్న విక్రయాలు నష్టపోతున్న అమాయక జనం గజ్వేల్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ‘రియల్’ దందా జోరుగా సాగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. వివిధ పథకాల కింద రూ.వేల కోట్లు మంజూరవుతుండడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత రూపురేఖలు మారుతోండడంతో అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది. ఈ దశలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఖాళీ జాగా కన్పిస్తే చాలు వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకపోయినా రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి. అమాయకులను నమ్మించి ప్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా అక్రమ దందా సాగుతోన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా స్థాయి పెరిగింది. ఈ నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో పరిధి పెరిగి పోయింది. ప్రస్తుతం నగరపంచాయతీలో ఇళ్ల సంఖ్య సుమారు 9వేలకుపైగా ఉండగా జనాభా 44 వేలకు చేరింది. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి ఊపందుకుంది. నగర పంచాయతీ పరిధిలో రూ.220కోట్లతో ‘రింగ్‌రోడ్డు’ ప్రతిపాదించడంతో ఇవతలి భూములు బంగారమయ్యాయి. ఈ రోడ్డు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 22 కిలో మీటర్లుగా విస్తరించబోతోంది. ఇందుకోసం 170 ఎకరాల భూమిని సైతం సేకరిస్తున్నారు. మొత్తంగా రోడ్డు లోపలా 4,850 ఎకరాలకు దశ మారిందనే చెప్పాలి. ఇదే అదనుగా కొందరు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 54 వెంచర్లు ఉండగా ఇందులో ఆరింటికి మాత్రమే అనుమతులున్నాయని టౌన్ ప్లానింగ్ అ«ధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇటీవల మరికొన్ని వెలిశాయి. ఖాళీ జాగా కొనుగోలు చేసి అందులో హద్దులు పాతేసి వెంచర్‌గా పరిచయం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తరచూ వివాదాలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో అక్రమంగా వెలిసిన వెంచర్ల కారణంగా తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి నగర పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై దుమారం రేపుతున్నది. వెంచర్ల తతంగంలో గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఎస్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తగా ఆయనపై బదిలీ వేటు పడింది. ఓ వైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధికి నమునాగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతుండగా... ఇదే అదనుగా నాయకులు మాత్రం భూ‘దందా’ల్లో నిమగ్నమయ్యారు. సీఎం అడుగుజాడల్లో నడిచి ప్రగతికి బాటలు వేయాల్సిందిపోయి ‘దందా’లకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు సైతం నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి అక్రమంగా వెలిసిన వెంచర్లపై చర్యలు కరువయ్యాయి. తరచూ హద్దురాళ్ల తొలగింపుతో హడావిడి చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ తర్వాత మిన్నకుండడంతో వెంచర్ల లావాదేవీలు యథావిధిగా సాగుతున్నాయి. రెండురోజులుగా ప్రజ్ఞాపూర్‌లోని 218 సర్వే నంబర్లో 30 గుంటల్లో ఏర్పాటు చేసిన వెంచర్, 220 సర్వే నంబరులో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్, ఇదే గ్రామంలోని 323/పీ సర్వే నంబర్లో ఎకరంన్నర విస్తీర్ణంలో వెలిసిన మరో వెంచర్లో హద్దు రాళ్లను తొలగించి హడావిడి చేశారు. ఈ వ్యవహారంపై టీపీఓ నర్సింహరాజును వివరణ కోరగా అనుమతి లేని వెంచర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని పేర్కొన్నారు.