రాప్తాడు నియోజకవర్గంలో సామంతుల పాలనకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నియోజవకర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో ఇన్‌చార్జ్‌గా తన సొంత బంధువులనే మంత్రి నియమించుకుని, పాలనా వ్యవహారాలను వారి చేతుల్లో పెట్టేశారు. ఇదే వారికి బలమైంది. పంచాయతీల ఆర్థిక వనరులను పక్కదారి పట్టించి, సొంత ఖజానాలను నింపుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందుకు స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారు.
అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు, పారిశ్రామిక వాడలోని ఎ.నారాయణ పురం పంచాయతీ పరిధిలో రూ.కోట్లు విలువ చేసే 90 సెంట్ల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో మంత్రి సునీత సమీప బంధువు ఈ స్థలాన్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఓ సామాజిక వర్గం బడాబాబులు కొందరికి ఈ అక్రమాల్లో వాటా ఉన్నట్లు సమాచారం. కబ్జా చేసిన స్థలంలో భవన నిర్మానాలకు తాజాగా అనుమతులు కూడా పొంది, నిర్మాణాలను చేపట్టారు. చివరకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను కూడా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అనంతపురం జిల్లా పంచాయతీ కార్యాలయం మంత్రి సునీత సామంతుడి కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఆ శాఖ ఉన్నతాధికారి సైతం తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి శాఖ విలువలను ఆ సామంతుడికి తాకట్టు పెట్టేశాడు. ఫలితంగా అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఓ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో పలు అక్రమాలకు తెర తీశారు. చివరకు సొంత పార్టీ నేతలే ఈ అక్రమాలపై భగ్గుమనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని 25 పంచాయతీల్లో గుత్తాధిపత్యాన్ని చెలా యిస్తున్న మంత్రి బంధువు.. అందిన కాడికి దోచుకో అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అక్రమార్జనకు తెరలేపాడు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు, భవనాలు, పంచాయతీల ఆదాయ వనరులు.. చివరకు చెత్తను కూడా అతను వదలడం లేదు.
వెంచర్‌కు ఆమోదం పొందాల్సిందే
అనంతపురం రూరల్ మండల పరిధిలో ఇటీవల వ్యవసాయ భూములను వెంచర్‌లుగా మార్చి ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగాయి. ప్లాట్లు విక్రయించిన ప్రతి ఒక్క రియల్టర్.. మంత్రి సామంతుడికి రాయల్టీ చెల్లించుకోవాల్సిందే. తాజాగా అనంతపురం రూరల్ పరిధిలోని ఎస్కేయూ సమీపంలో వెంచర్ వేసిన ఓ కొత్త రియల్టర్‌కు ఈ విషయం తెలియక ఆ సామంతుడిని కలవలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శిని అతను రంగంలో దించాడు. రియల్టర్‌ను పిలిపించుకుని మాట్లాడిన కార్యదర్శి ఈ ప్రాంతంలో సామంతుడి కప్పం కట్టందే ఏ పనీ చేసేందుకు వీలు లేదంటూ తేల్చిచెప్పినట్లు సమాచారం. సామంతుడి అక్రమాలను ఎదురించేందుకు సిద్ధపడిన ఆ రియల్టర్ అన్నింటా చుక్కెదరవుతూ వచ్చింది. దీంతో గత్యంతరం లేక చివరకు సామంతుడికి దాసోహమనక తప్పలేదు. మంత్రి బంధువును కలిసి నజరానా చెల్లించుకోవడంతో అతని వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది.
కార్యదర్శుల్లో అధిక శాతం ఆ సామాజిక వర్గమే..
అనంతపురం రూరల్ పరిధిలోని 25 పంచాయతీల్లో కీలకమైన, అధిక రాబడి ఉన్న పంచాయతీలకు కార్యదర్శులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకుని అక్రమాలకు మంత్రి బంధువు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో రుద్రంపేట, రాచానుపల్లి, ఎ.నారాయణపురం, కురుగుంట, సోములదొడ్డి పంచాయతీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. మంత్రి బంధువు అనుగ్రహం తమకు ఉందనే ధీమాతో పంచాయతీ కార్యదర్శులు అక్రమార్జనకు తెరలేపారు. వీరిలో చాలా మంది ఏసీబీ వలలో చిక్కి, నేటికీ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. లే అవుట్ అప్రూవల్ చేయాలంటే ముందుగా మంత్రి బంధువుకు నజరానా చెల్లించిన తర్వాతే అనుమతి లభిస్తుంది. కార్యదర్శుల ప్రతి కదలిక అతని కనుసన్నల్లో ఉంది. వారు చేసే ప్రతి సంతకంలో అతడికి వాటా ఉంది. గతంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు తన మాటకు విలువ ఇవ్వలేదనే కారణంగా ఆంక్షలతో వేధించాడు. చివరకు వారు ఉద్యోగాన్ని సైతం వదుకునేందుకు సిద్ధమవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. చివరకు జిల్లా పంచాయతీ అధికారిని సైతం అతను ప్రభావితం చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.
కక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో తుమ్మచెట్లను ఇటీవల నరికి కలపను అమ్ముకున్నారు. ఈ విక్రయం ద్వారా వచ్చిన దాదాపు రూ.14 లక్షల ఆదాయాన్ని పంచాయతీ ఖజానాకు కాకుండా మంత్రి సామంతుడిగా చెలామణి అవుతున్న పెద్దమనిషి స్వాహా చేశాడు. ఈ విషయం కాస్తా బహిర్గతం కావడంతో అధికారిక విచారణ కొనసాగింది. అయితే ‘ఈ ప్రభుత్వం మాది.. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది’ అంటూ విచారణకు వచ్చిన అధికారులను పక్కదారి పట్టించాడు. సర్దుబాటు చర్యలతో వాస్తవాలను భూస్థాపితం చేయించాడు. దీంతో తప్పుడు నివేదికలతో అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సోమలదొడ్డి సమీపంలో ఐఎంఎల్ డిపో ఉన్న సమయంలోనూ మంత్రి సామంతుడి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐఎంఎల్ డిపో ద్వారా పంచాయతీకి అందుతున్న రాయల్టీ మొత్తాన్ని తన సొంత ఖజానాకు తరలించుకుని సరికొత్త సంప్రదాయానికి తెరతీశాడు. ఈ లెక్కన దాదాపు రూ.30 లక్షలకు పైబడి పంచాయతీకి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment