అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా  | Municipal Officers Take Action On Illegal Lay Outs In Narsapuram | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా 

Published Mon, Jul 1 2019 10:37 AM | Last Updated on Mon, Jul 1 2019 10:38 AM

Municipal Officers Take Action On Illegal Lay Outs In Narsapuram - Sakshi

సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : పట్టణంలో నాలుగేళ్లపాటు విచ్చలవిడిగా సాగిన అక్రమ లేఅవుట్ల వ్యాపారంపై మున్సిపల్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. రెండు రోజుల నుంచి అనధికార లేఅవుట్లలో వేసిన రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. రియల్‌ఎస్టేట్‌ దందాలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలే ఉండటం విశేషం.  ప్రస్తుతం వేస్తున్న అక్రమ లేఅవుట్లే కాకుండా, ఇప్పటికే అమ్మకాలు సాగించిన అనధికార లేవుట్లపైనా అధికారులు దృష్టిపెట్టారు. నిజానికి నాలుగేళ్లుగా మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఏకంగా రూ.500 కోట్ల వరకూ రియల్‌ఎస్టేట్‌ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగినట్టు అంచనా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మూడురోజుల క్రితం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన అనధికార లేఅవుట్లు, మున్సిపల్‌ రిజర్వ్‌ స్థలాల ఆక్రమణలు వంటి అంశాలను ఉపేక్షించనని హెచ్చరించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. 

దాదాపు 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు 
పట్టణంలో దాదాపుగా 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు గత నాలుగేళ్ల కాలంలో వేశారు. రోడ్డుపక్కన పెద్దపెద్ద ఆర్చిలు కట్టి తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా రెచ్చిపోయారు. పట్టణంలోని స్టేషన్‌పేట, గ్రేస్‌నగర్, చినమామిడిపల్లిలోని సాయిబాబాగుడి ఎదురుగా తోటలో ఎకరాలకు ఎకరాలు భూములు పూడ్చారు. ఇక  పీచుపాలెం, థామస్‌ బ్రిడ్జిప్రాంతం , జవదాలవారిపేట, పొన్నపల్లి, ఎన్టీఆర్‌కాలనీ , నందమూరి కాలనీ, రుస్తుంబాద ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఇష్టానుసారం వేసేశారు. మున్సిపల్‌ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లక్షల్లో మామూళ్లు ముట్టాయి. తమతమ వార్డుల్లో జరుగుతున్న లేవుట్ల వ్యవహారంలో కొందరు కౌన్సిర్లు కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శలు ఉన్నాయి. ముందుగా సంబంధిత కౌన్సిలర్లతో రియలర్టర్లు మట్లాడేసుకుంటే , ఈ విషయంలో కౌన్సిల్‌ సమావేశాల్లో గొడవలు చేయడం, అధికారులపై ఒత్తిడి తేవడం లాంటివి లేకుండా సాఫీగా చేసుకుపోయారనే విమర్శలు  ఉన్నా యి. మొత్తంగా నాలుగేళ్లపాటు  మున్సిపాలిటీ ఖజానాకు  ఒక్క రూపాయి కూడా దక్కకుండా సాగిన ఈ అక్రమ దందాకు ప్రభుత్వం మారడంతో కళ్లెం పడింది.

అనధికార లేఅవుట్లలోనూ అక్రమాలే..
కేవలం అనధికార లేఅవుట్లలోనే కాకుండా, అధికార లేవుట్లలోనూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోయాయి. చినమామిడిపల్లిలో ఓ లేవుట్‌కోసం కమర్షియల్‌ ప్రాంతాన్ని క్షణాల్లో గృహనివాస ప్రాంతంగా మార్పు చేశారు. ఇక ఈ లేఅవుట్‌ జనానికి బాగా కనిపించడం కోసం, ఇటువైపు ప్రభుత్వ స్థలంలో కాలువగట్టున ఏళ్ల తరబడి పెంచిన మొక్కలను, చెట్లను నరికేసి అధికారులు సహకరించారు. ఇదే ప్రాంతంలో రైల్వేగేట్‌ సమస్యకు పరిష్కారంగా మురుగుకాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే ఆ వంతెన కట్టలేకపోతున్నారు గానీ, ఇదే కాలువపై లేవుట్ల  కోసం మాత్రం మూడుచోట్ల వంతెనలు కట్టేశారు. ఇక పట్టణ ంలో అపార్టుమెంట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. 

అనధికార లేవుట్లపై  చర్యలు తీసుకుంటున్నాం
పట్టణంలో అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అనధికార లేవుట్లను గుర్తించి ఆ స్థలాలను కొనొద్దని సర్వే నంబర్లతో సహా పట్టణంలో బోర్డులు పెట్టాం.  ప్రస్తుతం అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేస్తున్నాం. ఇది కొనసాగుతోంది.
– వి.చంద్రశేఖర్, టీపీఓ, నరసాపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement