illegal lay-outs
-
‘రియల్’ అక్రమాలపై నుడా కొరడా
అసలే అక్రమాలు.. ఆపై ఆక్రమణలు. నుడా పరిధిలో రియల్ ఎస్టేట్ యజమానులు భూదందాకు తెగించారు. గత టీడీపీ హయాంలో నుడా పాలకులు, అధికారుల అండతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి లేఅవుట్ ఫీజులు చెల్లించకుండా యథేచ్ఛగా రియల్ అక్రమాలకు తెరతీశారు. ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అండంతో ఇందుకు బాధ్యులైన అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నుడా అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ పరిధిలో టీడీపీ హయాంలో 32.63 ఎకరాల్లో 7 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 6.3 ఎకరాల ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని అక్రమించి లే అవుట్లో కలిపేసుకుని ప్లాట్లు వేశారు. పైగా ఈ లేఅవుట్లకు నుడా అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయం కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించారు. భూ ఆక్రమణకు పాల్పడిన లేఅవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నుడా అనుమతులు తప్పనిసరి. గతంలో టీడీపీ సర్కార్ హయాంలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లను వేశారు. అందులో 118 అక్రమ లేఅవుట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్)ను ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్, వైస్ చైర్మన్ నందన్ లేఅవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైస్‌చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే నుడా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీలు, పోలీసుశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు. 42 లేఅవుట్ల క్రమబద్ధీకరణ 118 అక్రమ లేఅవుట్లలో 42 లేవుట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. అందులో ఇప్పటికే 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని నుడా అనుమతులు పొందారు. మరో 20 లేవుట్ల క్రమబద్ధీకరణ ప్రాసెస్‌లో ఉంది. కొన్ని అక్రమ లేవుట్లలోని ప్లాట్ల యజమానులు స్వయంగా 14 శాతం పన్నులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే 180 ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో నుడాకు రూ.50.46 లక్షలు ఆదాయం వచ్చింది. 118 అక్రమలేవుట్ల క్రమబద్ధీకరించుకుంటే మరో రూ.3.5 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేది లేదు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను వేస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రజలు కూడా లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించి కొనుగోలు చేపట్టాలి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ షిప్ లేఅవుట్లలో భాగస్వామ్యం కండి. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
గ్రామాల్లో అక్రమ లే–అవుట్లు 10,000 పైనే
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని పంట భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,049 ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు 2015లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించగా ఇప్పుడు వాటి సంఖ్య పది వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రతి లే అవుట్లో సగటున 50 ఇంటి ప్లాట్లు ఉంటాయని అంచనా వేసినా దాదాపు 5 లక్షల మంది అక్రమ లే అవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి గ్రామాల పరిధిలో కొత్తగా ఇళ్ల ప్లాట్లతో లే అవుట్ వేయాలంటే అనుమతి తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే 2002 ఫిబ్రవరి 26న గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్మెంట్ (లేఅవుట్ అండ్ బిల్డింగ్)పై సమగ్ర విధానాలతో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త లే అవుట్ వేయాలంటే రోడ్లు, పార్కు, ఆటస్థలం లేదా పాఠశాల తదితరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని సంబంధిత గ్రామ పంచాయతీకి ఉచితంగా రాసివ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇలా ఉచితంగా రాసి ఇవ్వాల్సిన స్థల పరిమితి లే – అవుట్ మొత్తం విస్తీర్ణంలో పది శాతం విస్తీర్ణానికి పైబడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం.. అనుమతి లేకుండా ఏర్పాటయ్యే అక్రమ లే–అవుట్లలలో నిబంధనల ప్రకారం ఇంటి ప్లాన్ అప్రూవల్, కరెంట్ కనెక్షన్, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయరు. బ్యాంకు లోను కూడా రాదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకున్నా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇబ్బంది లేకుండా రెగ్యులరైజేషన్ అక్రమ లే–అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఎన్నో ఏళ్ల కిత్రం తెలియక అక్రమ లే–అవుట్లలో స్థలం కొన్న వారికి ఇబ్బంది లేకుండా, గ్రామ పంచాయతీలకు నష్టం జరగకుండా రెగ్యులరైజ్ చేయడంపై మార్గాలను సూచించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అక్రమ లే–అవుట్ల రెగ్యులరైజ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, గ్రామాల్లో అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ శాఖ విడిగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లు కట్టుకున్నా ఆందోళనే.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో చిన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్న రాము కష్టార్జితంతో పట్టణ శివారులోని కొత్త లే అవుట్లో నాలుగు సెంట్ల స్థలం కొనుక్కున్నాడు. ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అక్రమ లే అవుట్ అని తెలియడంతో నివ్వెరపోయాడు. లక్షలు ధారపోసి కొన్న స్థలాన్ని అలా వదిలేయలేక అక్రమ మార్గంలో భారీగా డబ్బులు ముట్టజెప్పి అనుమతులు తెచ్చుకున్నాడు. బ్యాంకు రుణం రాకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌గా అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇంత చేశాక తాను ఇల్లు కట్టింది అక్రమ లే అవుట్లో కావడంతో భవిçష్యత్‌లో ఇబ్బందులు తప్పవని మనసులో ఓ మూల భయం రామును తొలుస్తూనే ఉంది. -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
తమ్ముళ్ల పంథా...రియల్ దందా
మడకశిరలో టీడీపీ నేతలు ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండతో అక్రమాలకు తెరతీశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసేశారు. అమాయకులకు వాటిని అంటగట్టి రూ.కోట్లు కొళ్లగొట్టారు. టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లో జరిగిన ఈ రియల్ దందాకు అధికారులూ సహకరించినట్లు తెలుస్తోంది. సాక్షి, మడకశిర: మడకశిర 2012లో ఆగస్టులో నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైంది. పైగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అధికారులు, ప్రైవేటు ఉద్యోగులంతా మడకశిరలోనే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతుండడంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. పలువురు మున్సిపల్ అధికారులు సహకారంతో లేఅవుట్లు వేసి రూ.కోట్లు సంపాదించారు. ఈ రియల్ దందాకు గతంలో ఇక్కడ పని చేసిన ఓ ప్రముఖ అధికారి, మున్సిపల్ కార్యాలయంలో పని చేసే మరో అధికారి సహకరించినట్లు తెలిసింది. ప్రధాన రోడ్ల పక్కనే.. టీడీపీ నాయకులు పట్టణంలోని ప్రధాన రోడ్లకిరువైపులా ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు వేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 20పైగా లేఅవుట్లు ఉండగా, ఇందులో 10 అక్రమంగా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరాపురం, మధుగిరి, పెనుకొండ, పావగడ రోడ్లలో ఈ అక్రమ లేఅవుట్లు వెలిశాయి. టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ప్రముఖుల అండదండలతోనే ఈ బిజినెస్‌కు బీజం పడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతి ఫలంగా వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ప్లాట్లను కేటాయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహం పట్టణంలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడం...అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులంతా అవి నిబంధనలకు విరుద్ధంగా వేసినట్లు తెలుసుకుని గగ్గోలు పెట్టారు. న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వద్ద మొరపెట్టుకున్నారు. పైగా అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఇటీవల మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు. అక్రమ లేఅవుట్ల గురించి చర్చించారు. అక్రమ లేఅవుట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మడకశిరలో వెలసిన అక్రమ లేఅవుట్లు పలువురికి నోటీసుల జారీ ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ షేక్‌మాలిక్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. 7 లేవుట్లు అక్రమంగా వేసినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసు లు జారీ చేశారు. మొత్తం మీద టీడీపీ హయాంలో ఈ వ్యాపారం రూ.కోట్లల్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కఠినంగా వ్యవహరిస్తాం మడకశిరలో అక్రమంగా వేసిన లేఅవుట్లపై కఠినంగా వ్యవహరిస్తాం. ఎంతటి వారైనా వదిలేదిలేదు. 7 లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వెంటనే లేఅవుట్లను సక్రమం చేసుకోవాలి. లేక పోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ లేఅవుట్లలో ఎవరూ స్థలాలను కొనుగోలు చేయవద్దు. ఇలాంటి లేఅవుట్లలోని ఇళ్లకు కరెంట్ సరఫరా, డ్రైనేజీ సౌకర్యం ఉండవు. – షేక్‌మాలిక్, మున్సిపల్ కమిషనర్, మడకశిర -
అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : పట్టణంలో నాలుగేళ్లపాటు విచ్చలవిడిగా సాగిన అక్రమ లేఅవుట్ల వ్యాపారంపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. రెండు రోజుల నుంచి అనధికార లేఅవుట్లలో వేసిన రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. రియల్ఎస్టేట్ దందాలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలే ఉండటం విశేషం. ప్రస్తుతం వేస్తున్న అక్రమ లేఅవుట్లే కాకుండా, ఇప్పటికే అమ్మకాలు సాగించిన అనధికార లేవుట్లపైనా అధికారులు దృష్టిపెట్టారు. నిజానికి నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఏకంగా రూ.500 కోట్ల వరకూ రియల్ఎస్టేట్ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగినట్టు అంచనా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మూడురోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన అనధికార లేఅవుట్లు, మున్సిపల్ రిజర్వ్ స్థలాల ఆక్రమణలు వంటి అంశాలను ఉపేక్షించనని హెచ్చరించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. దాదాపు 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు పట్టణంలో దాదాపుగా 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు గత నాలుగేళ్ల కాలంలో వేశారు. రోడ్డుపక్కన పెద్దపెద్ద ఆర్చిలు కట్టి తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా రెచ్చిపోయారు. పట్టణంలోని స్టేషన్‌పేట, గ్రేస్‌నగర్, చినమామిడిపల్లిలోని సాయిబాబాగుడి ఎదురుగా తోటలో ఎకరాలకు ఎకరాలు భూములు పూడ్చారు. ఇక పీచుపాలెం, థామస్ బ్రిడ్జిప్రాంతం , జవదాలవారిపేట, పొన్నపల్లి, ఎన్టీఆర్కాలనీ , నందమూరి కాలనీ, రుస్తుంబాద ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఇష్టానుసారం వేసేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లక్షల్లో మామూళ్లు ముట్టాయి. తమతమ వార్డుల్లో జరుగుతున్న లేవుట్ల వ్యవహారంలో కొందరు కౌన్సిర్లు కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శలు ఉన్నాయి. ముందుగా సంబంధిత కౌన్సిలర్లతో రియలర్టర్లు మట్లాడేసుకుంటే , ఈ విషయంలో కౌన్సిల్ సమావేశాల్లో గొడవలు చేయడం, అధికారులపై ఒత్తిడి తేవడం లాంటివి లేకుండా సాఫీగా చేసుకుపోయారనే విమర్శలు ఉన్నా యి. మొత్తంగా నాలుగేళ్లపాటు మున్సిపాలిటీ ఖజానాకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా సాగిన ఈ అక్రమ దందాకు ప్రభుత్వం మారడంతో కళ్లెం పడింది. అనధికార లేఅవుట్లలోనూ అక్రమాలే.. కేవలం అనధికార లేఅవుట్లలోనే కాకుండా, అధికార లేవుట్లలోనూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోయాయి. చినమామిడిపల్లిలో ఓ లేవుట్‌కోసం కమర్షియల్ ప్రాంతాన్ని క్షణాల్లో గృహనివాస ప్రాంతంగా మార్పు చేశారు. ఇక ఈ లేఅవుట్ జనానికి బాగా కనిపించడం కోసం, ఇటువైపు ప్రభుత్వ స్థలంలో కాలువగట్టున ఏళ్ల తరబడి పెంచిన మొక్కలను, చెట్లను నరికేసి అధికారులు సహకరించారు. ఇదే ప్రాంతంలో రైల్వేగేట్ సమస్యకు పరిష్కారంగా మురుగుకాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే ఆ వంతెన కట్టలేకపోతున్నారు గానీ, ఇదే కాలువపై లేవుట్ల కోసం మాత్రం మూడుచోట్ల వంతెనలు కట్టేశారు. ఇక పట్టణ ంలో అపార్టుమెంట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అనధికార లేవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం పట్టణంలో అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అనధికార లేవుట్లను గుర్తించి ఆ స్థలాలను కొనొద్దని సర్వే నంబర్లతో సహా పట్టణంలో బోర్డులు పెట్టాం. ప్రస్తుతం అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేస్తున్నాం. ఇది కొనసాగుతోంది. – వి.చంద్రశేఖర్, టీపీఓ, నరసాపురం -
అక్రమ ‘హద్దురాళ్ల’ తొలగింపు
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో కొనసాగుతున్న అక్రమ వెంచర్ల దందాపై ఈ నెల 26న ‘వెంచర్ వేసేయ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో నగర పంచాయతీ అధికారులు అనుమతుల్లేని వెంచర్లపై కొరఢా ఝులిపిస్తున్నారు. శనివారం నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో గల 542 సర్వే నెంబరులోని రెండున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లో హద్దు రాళ్లను తొలగించారు. టీపీవో నర్సింహరాజు ఆధ్వర్యంలో ఈ తొలగింపు ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమంలో టీపీఎస్ పావని, చైన్‌మెన్ పాషా తదితరులు పాల్గొన్నారు.