ప్రతీకాత్మక చిత్రం
అసలే అక్రమాలు.. ఆపై ఆక్రమణలు. నుడా పరిధిలో రియల్ ఎస్టేట్ యజమానులు భూదందాకు తెగించారు. గత టీడీపీ హయాంలో నుడా పాలకులు, అధికారుల అండతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి లేఅవుట్ ఫీజులు చెల్లించకుండా యథేచ్ఛగా రియల్ అక్రమాలకు తెరతీశారు. ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అండంతో ఇందుకు బాధ్యులైన అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నుడా అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ పరిధిలో టీడీపీ హయాంలో 32.63 ఎకరాల్లో 7 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 6.3 ఎకరాల ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని అక్రమించి లే అవుట్‌లో కలిపేసుకుని ప్లాట్లు వేశారు. పైగా ఈ లేఅవుట్లకు నుడా అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయం కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించారు. భూ ఆక్రమణకు పాల్పడిన లేఅవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నెల్లూరు అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (నుడా) పరిధిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నుడా అనుమతులు తప్పనిసరి. గతంలో టీడీపీ సర్కార్ హయాంలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లను వేశారు. అందులో 118 అక్రమ లేఅవుట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్)ను ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్, వైస్ చైర్మన్ నందన్ లేఅవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు
నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైస్‌చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే నుడా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లు, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీలు, పోలీసుశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు.
42 లేఅవుట్ల క్రమబద్ధీకరణ
118 అక్రమ లేఅవుట్లలో 42 లేవుట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. అందులో ఇప్పటికే 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని నుడా అనుమతులు పొందారు. మరో 20 లేవుట్ల క్రమబద్ధీకరణ ప్రాసెస్‌లో ఉంది. కొన్ని అక్రమ లేవుట్లలోని ప్లాట్ల యజమానులు స్వయంగా 14 శాతం పన్నులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే 180 ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో నుడాకు రూ.50.46 లక్షలు ఆదాయం వచ్చింది. 118 అక్రమలేవుట్ల క్రమబద్ధీకరించుకుంటే మరో రూ.3.5 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు సమాచారం.
అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేది లేదు
నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను వేస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రజలు కూడా లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించి కొనుగోలు చేపట్టాలి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ షిప్ లేఅవుట్లలో భాగస్వామ్యం కండి. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
– ఓ నందన్, నుడా వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment