nuda
-
NUDA: ‘నుడా’ చైర్మన్ మార్పు?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీఠం మార్పు విషయమై అధికార పార్టీ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థ చుట్టూ ఉన్న ‘నుడా’ పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు బోధన్, ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో కలుపుకుని మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ‘నుడా’ విస్తరించి ఉంది. అయితే ప్రస్తుతం ‘నుడా’ చైర్మన్‌గా చామకూర ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. మూడున్నరేళ్ల క్రితం చైర్మన్‌గా ఉత్తర్వులు పొందిన ప్రభాకర్‌రెడ్డి ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నారు. కాగా ఈ పదవి కోసం మరికొందరు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆశావహుడు ఈ పీఠం దక్కించుకునేందుకు ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అతిత్వరలో ఉత్తర్వులు వస్తాయని సదరు ఆశావహుడు ఆశాభావం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. నిజామాబాద్ నగర అభివృద్ధి, విస్తరణలో ‘నుడా’ పాత్ర అత్యంత కీలకం. దీంతో ఈ పదవి విషయంలో పలువురు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఒకరి ప్రయత్నా లు తుది దశకు చేరినట్లు తెలుస్తుండడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెల కొంది. ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం సైతం గత మూడున్నరేళ్లుగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉంది. ఈ పీఠం కోసం సైతం పలువురు ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే పోటీ తీవ్రంగా ఉండడం, మా ర్కెట్ కమిటీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య ఈ పదవి విషయంలో గుంజాటన ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఎ టూ తేల్చకుండా మార్కెట్ కమిటీ పాలకవర్గం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. మార్కెట్ కమిటీ పరిస్థితి ఇలా ఉండగా, ‘నుడా’ పదవి విషయంలో పరిస్థితి మరోలా ఉంది. మొత్తం మీద జిల్లాలో కీలకమైన ఈ రెండు నామినేటెడ్ పదవుల భర్తీ, మార్పుల విషయంలో దేనికదే ప్రత్యేక పరిస్థితి కలిగి ఉండడంతో విచిత్ర వాతావరణం నెలకొంది. దసరా నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించనుండడంతో ఆ తదుపరి నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర మంలో కీలకమైన ఈ రెండు నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు గట్టిగానే ప్నయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం ఎప్పుడొస్తుందా అని పలువురు ఎదురు చూస్తుండగా, ‘నుడా’ పీఠంపైకి కొత్త ముఖం వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
NUDA: వడివడిగా నుడా విస్తరణ అడుగులు
నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో నుడా ఆవిర్భవించినప్పటికీ నిధులివ్వకుండా నిస్తేజంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు మూడు వేల చ.కి.మీ. పరిధిలోని గ్రామాలను నుడాలోకి తీసుకురావడంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నుడా అధికారాలను అడ్డం పెట్టుకుని అప్పటి పాలకులు అడ్డంగా దోచుకున్నారే తప్ప.. నుడా పేరుతో చేపట్టిన అభివృద్ధి శూన్యంగానే చెప్పొచ్చు. నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధి భారీగా విస్తరిస్తోంది. పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా నుడా పరిధిని విస్తరిస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు పలు మండలాలు, గ్రామాలను నుడాలో కలుపుతూ జీఓలు విడుదల చేసింది. తాజాగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 13 మండలాల పరిధిలోని 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందులో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఉండడం విశేషం. మూడేళ్లలో భారీగా విస్తరణ 2017 మార్చి 24న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆవిర్భవించింది. తొలుత నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం ప్రాంతాల్లోని మొత్తం 21 మండలాల పరిధిలోని 156 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,644.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నుడా పరిధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 5,023.44 చ.కి.మీ. వరకు విస్తరించింది. ► 2020 ఏప్రిల్ 24న 135 జీఓ నంబర్‌తో రెండు మండలాల్లోని 65 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో 567.49 చ.కి.మీ. పెరిగింది. ► 2022 జూన్ 15న జీఓ నంబరు 97తో మరో రెండు మండలాల్లోని 39 గ్రామాలను నుడాలో కలపడంతో మరో 475.54 చ.కి.మీ. పరిధి పెరిగింది. ► తాజాగా 2022 సెప్టెంబరు 15న జీఓ నంబర్ 132 ద్వారా 13 మండలాల పరిధిలో 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో మరో 2,336.24 చ.కి.మీ. పరిధి పెరిగింది. ప్రస్తుతం 31 మండలాల పరిధిలోని 426 గ్రామాలతో మొత్తం 5,023.44 చ.కి.మీ. నుడా విస్తరించింది. 97 ఎకరాల్లో 1,112 ప్లాట్లు ఏర్పాటు నుడా అభివృద్ధిలో భాగంగా కావలికి సమీపంలోని జలదంకి మండలం జమ్మలపాళెం వద్ద ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పథకం కింద 97 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ప్లాట్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ ఇచ్చారు. రూ.50 కోట్లతో లేఅవుట్లో పార్కులు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ లైట్లు, పచ్చదనంతో కూడిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే 250 ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్లో ప్లాట్లు దరఖాస్తు చేసుకునేందుకు mig.apdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 9121162478 నంబరులో సంప్రదించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లపై కొరడా నుడా పరిధిలో అక్రమలేఅవుట్లపై నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, నుడా వైస్ చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. 300కు పైగా లేఅవుట్లను నుడా పరిధిలో ఏర్పాటు చేశారు. వాటిలో 118 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించి ఎల్ఆర్ఎస్ స్కీం కింద క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 55 అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించారు. మరో 20 లేఅవుట్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. 180 ప్లాట్ల యజమానులు వ్యక్తిగతంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 46 దరఖాస్తులు మంజూరు చేశారు. ఇప్పటికే నుడాకు రూ.60 లక్షలు వరకు ఫీజు రూపంలో వచ్చింది. రూ.3.18 కోట్లతో నుడా కార్యాలయ నిర్మాణం నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వైపు నుడా కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. రెండు అంతస్తులతో మొత్తం 10,650 చదరపు అడుగుల స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఐదేళ్లుగా అద్దె భవనంలో నుడా కార్యాలయ కలాపాలు జరుగుతున్నాయి. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని నుడాకు చెందిన స్థలంలో కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కొన్ని నెలల్లోనే కార్యాలయం నిర్మాణం పూర్తి కానుంది. మూడేళ్లలో రూ. 54.32 కోట్లతో అభివృద్ధి నుడా పరిధిలో గత మూడేళ్లలో రూ.54.74 కోట్లు నిధులతో పార్కులు, పాఠశాల నిర్మాణాలు, సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రెయిన్లు, కమ్యునిటీ హాల్స్ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 135 పనుల్లో 57 పనులు పూర్తయ్యాయి. మరో 30 పనులు జరుగుతున్నాయి. 40 పనులు ప్రారంభించనున్నారు. 3 పనులు టెండర్ ప్రాసిసెంగ్‌లో ఉన్నాయి. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుడాకు రూ.61.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!) ► నెల్లూరు నగరంలో రూ.6.90 కోట్లతో 15 పార్కులు నిర్మించారు. రూ.2.2 కోట్లతో మరో 4 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. నర్తకీ థియేటర్ వద్ద రూ.3 కోట్లతో ఫుట్‌పాత్, డివైడర్, రోడ్డు నిర్మాణాలకు కేటాయించారు. చింతారెడ్డిపాళెం బలిజపాళెంలో రూ.35 లక్షలతో పాఠశాల భవనం, రూ.15 లక్షలతో ధోబీఘాట్ నిర్మాణం జరిగింది. నవాబుపేటలో రూ.30 లక్షలతో వజూఖానా, రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోన్నాయి. 48వ డివిజన్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్, రూ.30 లక్షలతో తోటబడి వద్ద పార్కు నిర్మాణం జరుగుతోంది. ► నెల్లూరు రూరల్ పరిధిలో రూ.72 లక్షలతో షాద్కాలనీ, మారుతీనగర్‌లో పార్కుల నిర్మాణం జరిగింది. డైకాస్‌రోడ్డులోని మహిళా ప్రాంగణం సమీపంలో రూ.30 లక్షలతో ఏవీకే ఎస్టేట్ పార్కు నిర్మాణం జరుగుతోంది. రూ.48 లక్షలతో ఆనం వెంకురెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ జరిగింది. అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కులో రూ.30 లక్షలతో టెన్నిస్ కోర్టు, రూ.13 లక్షలతో అదనంగా మరికొన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో ఆరు ప్యాకేజీ కింద సీసీరోడ్డు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. 4వ మైలులో రూ.76 లక్షలతో ప్రేయర్ హాల్, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది నిర్మాణం చేస్తున్నారు. మినీబైపాస్‌రోడ్డులోని హీరో హోండాషోరూమ్ వద్ద రూ.19.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రూ.కోటితో బారాషహీద్ దర్గాలోకి ప్రవేశమార్గం వద్ద రెండు ఆర్చ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రూ.17.5 కోట్లతో నెక్లెస్‌రోడ్డులో పార్కు, మరమ్మతులు చేయనున్నారు. ► కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో రూ.5.10 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం జరిగింది. కోవూరు, మైపాడు, నార్త్‌రాజుపాళెం ప్రాంతాల్లో రూ.1.50 కోట్లతో డ్రెయినేజీలు నిర్మించారు. బుచ్చిరెడ్డిపాళెంలో రూ.కోటితో బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు నిర్మాణం చేశారు. రూ.3.25 కోట్లతో బుచ్చిరెడ్డిపాళెంలో డ్రెయినేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ► సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1.40 కోట్లతో 5 కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ప్రారంభించనున్నారు. రూ.5.54 కోట్లతో 21 శ్మశానాలను నిర్మించారు. మరిన్ని ప్రగతి పనులు చేస్తాం నుడా పరిధి విస్తరించడంతో పాటు రాబడిపై దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కంటే రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నుడా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. అక్రమలేఅవుట్లకు అవకాశం లేకుండా నుడా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు చేసి ఇబ్బందులు పడకండి. – ముక్కాల ద్వారకానాథ్, నుడా చైర్మన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం నుడా పరిధిలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సూచనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కావలి నుంచి తడ, కృష్ణపట్నం నుంచి కడప మీదుగా ఉన్న ప్రాంతాలు నుడాలో కలిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగవంతంగా అభివృద్ధి జరగనుంది. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
‘రియల్’ అక్రమాలపై నుడా కొరడా
అసలే అక్రమాలు.. ఆపై ఆక్రమణలు. నుడా పరిధిలో రియల్ ఎస్టేట్ యజమానులు భూదందాకు తెగించారు. గత టీడీపీ హయాంలో నుడా పాలకులు, అధికారుల అండతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి లేఅవుట్ ఫీజులు చెల్లించకుండా యథేచ్ఛగా రియల్ అక్రమాలకు తెరతీశారు. ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అండంతో ఇందుకు బాధ్యులైన అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నుడా అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ పరిధిలో టీడీపీ హయాంలో 32.63 ఎకరాల్లో 7 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 6.3 ఎకరాల ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని అక్రమించి లే అవుట్లో కలిపేసుకుని ప్లాట్లు వేశారు. పైగా ఈ లేఅవుట్లకు నుడా అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయం కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించారు. భూ ఆక్రమణకు పాల్పడిన లేఅవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నుడా అనుమతులు తప్పనిసరి. గతంలో టీడీపీ సర్కార్ హయాంలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లను వేశారు. అందులో 118 అక్రమ లేఅవుట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్)ను ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్, వైస్ చైర్మన్ నందన్ లేఅవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైస్‌చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే నుడా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీలు, పోలీసుశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు. 42 లేఅవుట్ల క్రమబద్ధీకరణ 118 అక్రమ లేఅవుట్లలో 42 లేవుట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. అందులో ఇప్పటికే 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని నుడా అనుమతులు పొందారు. మరో 20 లేవుట్ల క్రమబద్ధీకరణ ప్రాసెస్‌లో ఉంది. కొన్ని అక్రమ లేవుట్లలోని ప్లాట్ల యజమానులు స్వయంగా 14 శాతం పన్నులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే 180 ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో నుడాకు రూ.50.46 లక్షలు ఆదాయం వచ్చింది. 118 అక్రమలేవుట్ల క్రమబద్ధీకరించుకుంటే మరో రూ.3.5 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేది లేదు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను వేస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రజలు కూడా లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించి కొనుగోలు చేపట్టాలి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ షిప్ లేఅవుట్లలో భాగస్వామ్యం కండి. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
పగటిపూట ఆరోపణలు.. రాత్రుళ్లు రాజీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పగటిపూట ఆరోపణలు చేస్తూ.. రాత్రుళ్లు రాజీలు చేసుకోవడం టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నైజమని, అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ ప్రశ్నించారు. నెల్లూరులోని రాజన్నభవన్లో మంగళవారం విద్యార్థి విభాగం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తే దానిని కోటంరెడ్డి ఓ కథగా అల్లి వైఎస్సార్సీపీకి ఆపాదించడం దారుణమన్నారు. బురదజల్లితే అబద్దాలు వాస్తవాలు అయిపోవన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సెల్‌ఫోన్ షాపులో ఉండగా గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దానిపై కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నానా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఉదయం తమ పార్టీపై ఆరోపణలు చేసి రాత్రిపూట తమపార్టీ నేతలతో రాజీలు చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన కాల్‌డేటాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు పంపుతామని, అందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదని బాలాజీనగర్ పోలీసులను ప్రశ్నించగా, ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ వెంటనే బాలాజీనగర్ పోలీసులకు ఫోన్ చేసి పోస్టులు పెట్టిన వారు ఎవరైనా సరే అరెస్ట్ చేయాలని ఆదేశించారని గుర్తుచేశారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇప్పటికైనా చౌకబారు విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ హాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బి.సత్యకృష్ణ, కాకు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దోచుకోవడానికే దుబారా
కావలి : కావలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పెద్ద తలకాయలు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. వివిధ రకాల పనులు కోసమంటూ పలు శాఖలు ద్వారా నిధులను మంజూరు చేసుకొని, మొక్కుబడిగా పనులు చేస్తూ నిధులు స్వాహా జైత్రయాత్ర చేపడుతున్నారు. కావలి పట్టణ పరిధిలో ట్రంక్‌రోడ్డును ఆనుకుని ఉత్తర శివారు ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ఉండేది. అయితే పట్టణం విస్తరిస్తుండడంతో దీన్ని మండలంలోని మోర్లవారిపాళెం ప్రాంతానికి తరలించారు. పాత డంపింగ్ యార్డ్ ఉన్న సర్వే నంబర్ 789లో మొత్తం 8 ఎకరాల స్థలం ఉంది. ఇందులో పార్క్ నిర్మించడానికి 3.2 ఎకరాలను ‘నుడా’కు అప్పగించారు. ఈ స్థలానికి ప్రహరీ లక్షణంగా ఉంది. అయితే ఈ స్థలంలో చెత్తచెదారం ఉండటంతో వాటిని పూర్తిగా తొలగించి, గ్రావెల్ పోసి ఎత్తు లేపాలని ‘నుడా’ అధికారులు స్థానిక మున్సిపాలిటీకి సూచించారు. అయితే ఈ పనులకు సంబంధించిన ప్రక్రియను మున్సిపాలిటీ నేటి వరకు ప్రారంభించనే లేదు. ఈ పనులు పూర్తి కావడానికి కనీసం రెండు నెలలు పడుతుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతనే నుడా నిర్మించ తలపెట్టిన పార్క్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీ చేయాల్సిన ప్రాథమిక పనులకు నిధులు లేక మిన్నకుండిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోగా ప్రభుత్వ నిధులు దిగమింగడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. నుడా ఏర్పడిన తర్వాత కావలికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో వీరి కన్ను నుడాపై పడింది. నుడా ద్వారా కావలిలో పార్క్ నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో అందుకు సంబంధించి ముందుగానే ప్రహరీని నూతనంగా నిర్మాణం చేపట్టాలనే పేరుతో రూ.50 లక్షలకు అంచనాలు తయారు చేయాలని నుడా అధికారులకు సూచించారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఉండే అధికారులు రూ.43,73,605 వ్యయంతో ప్రహరీ నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. అన్ని సాంకేతిక ప్రక్రియలను పూర్తిచేసి టెండరు కూడా పిలిచారు. ఈ టెండరు ఎవరి కంటే వారికి దక్కనీయకుండా టీడీపీ నాయకులే బినామీ పేర్లతో దక్కించుకోవడానికి అంతా సిద్ధం చేశారు. అసలు పార్క్ నిర్మాణ పనులకు నిధులే మంజూరు కాలేదు. ఆ పనులు ప్రారంభం కాకుండానే టీడీపీ నాయకులు ఆ ప్రదేశంలో ఉన్న ప్రహరీ కూల్చేసి కొత్త ప్రహరీ పేరుతో నిధులను లూటీ చేస్తున్న వైనం అధికార వర్గాలే విస్తుపోతున్నాయి. నిధులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు ‘నుడా’ పాలక వర్గం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనవసరమైన పనులు చేపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నుడా చైర్మన్‌గా దీపా వెంకట్?
వర్గ పోరాటాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఎత్తుగడ కేంద్ర మంత్రి వెంకయ్యతో అవసరాలు కూడా కారణమే సాక్షి ప్రతినిధి – నెల్లూరు : నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) మొదటి చైర్మన్ పదవి దక్కించుకోవాలని అనేక మంది టీడీపీ నేతలు ఆశ పడుతున్న తరుణంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు, బీజేపీ కోటా సమీకరణల్లో సహాయ మంత్రి హోదా లభించే ఈ పదవి దీపాకు కట్టబెట్టాలని టీడీపీ ఉన్నత స్థాయి వర్గాలు ఆలోచిస్తున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడిన టీడీపీ సీనియర్లు అనేక మంది నుడా చైర్మన్ పదవి మీద కన్నేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ మనీ అందించిన డాక్టర్ జెడ్ శివప్రసాద్ తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు మరింత మంది నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుతున్నప్పటికీ, అది కాకపోతే నుడా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిటీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఆశీస్సులు ఈయనకు పుష్కలంగా ఉండటంతో సరైన సమయంలో ఆ వైపు నుంచి నరుక్కు వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈయనతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి సతీమణి అనూరాధ కూడా ఈ పదవి మీద కన్నేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఇటీవల లభించిన మహిళా కార్పొరేషన్ సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించారు. పట్టభద్రుల స్థానానికి జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన దేశాయిశెట్టి హనుమంత రావు ఈ సారి తాను పోటీ చేయలేనని చెబుతున్నారు. గతంలో తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి నుడా చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ హై కమాండ్‌ను కోరుతున్నారు. నెల్లూరుకు చెందిన ముఖ్యమైన నాయకులంతా నుడా చైర్మన్ గిరీ మీద కన్ను వేయడంతో ఈ పదవి ఎవరికి ఇచ్చినా నుడా అభివృద్ధిలో వర్గ రాజకీయాలు చోటు చేసుకుంటాయని మున్సిపల్ మంత్రి నారాయణ భావిస్తున్నారు. చైర్మన్‌తో పాటు 20 మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందున, చైర్మన్ పదవి రాజకీయాల్లో క్రియాశీలంగా లేని వారికి ఇస్తే ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులకు ఇబ్బంది లేకుండా పోతుందని ఆయన ఆలోచిçస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీపా వెంకట్ పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. వెంకయ్యతో అవసరం కోసమే.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలున్నాయి. నుడా ఏర్పాటైనా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులు తేలేక పోతే రాబోయే రెండున్నరేళ్లలో అభివృద్ధి చూపించే పరిస్థితి ఉండదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ పని జరగాలంటే వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్‌కు నుడా చైర్మన్ పదవి ఇవ్వడమే ఏకైక మార్గమని అంచనా వేస్తున్నారు. పైగా కీలకమైన పదవి బీజేపీ కోటా కింద ఇచ్చేసినట్లు చెప్పుకోవచ్చనే రాజకీయ వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు. దీపాకు ఈ పదవి ఇస్తే టీడీపీలో వర్గాల పోరుకు చెక్ పడుతుందని కూడా పార్టీ హై కమాండ్ ఆలోచిస్తోంది. చైర్మన్ కాకుండా 20మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందువల్ల ఈ పదవుల్లో ద్వితీయ శ్రేణి నేతలను నియమించి కేడర్‌ను సంతృప్తి పరచేలా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే నుడా ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రక్రియ మొత్తం ముగిసి పాలక వర్గం నియమించడానికి కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు రాకుండా చూసుకోవడం మేలని టీడీపీ ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. -
నుడాకు ఓకే
రెండేళ్ల నిరీక్షణ తరువాత క్యాబినేట్లో ఆమోదముద్ర చిత్తూరు జిల్లాకు చెందిన రెండింటితో కలిపి 21 మండలాలు పదవుల కోసం పైరవీలు ప్రారంభించిన టీడీపీ నేతలు నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అ«ధారిటీ(నుడా) మంగళవారం క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర పొందింది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న అంశానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. 2014 నవంబర్‌లో ఐఏఎస్ చక్రధర్‌బాబు, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు నుడా ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. నెల్లూరు జిల్లాలోని 33 మండలాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే చాలాకాలం పాటు నుడా అంశంలో కదలిక లేదు. మఽళ్లీ ఇటీవల నుడా వైపు అడుగులు పడ్డాయి. రెండు సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొదటగా 33 మండలాలతో కూడిన ప్రతిపాదన పంపగా, రెండవసారి 14 మండలాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు. అయితే కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం 21 మండలాలతో కూడిన నుడాకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నుడాలో కలిపిన ప్రాంతాలు ఇవే.. నెల్లూరు కార్పొరేషన్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు, నాయుడుపేట నగర పంచాయితీలను నుడాలో కలిపారు. వాటితో పాటు కావలి రూరల్‌లోని గౌరవరం, అనుమడుగు, రుద్రకోట గ్రామాలతో పాటు జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కోవూరు, టీపీగూడూరు, ముత్తుకూరులోని కొంత భాగం, వెంకటాచలం, మలుబోలు, చిల్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, తడ మండలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలను నుడా జాబితాలో చేర్చారు. అయితే నుడాలో కలిపిన మండలాలు అన్నీ హైవేకు రెండువైపులా కలుపుకుంటూ వెళ్లారు. శ్రీసిటీకి చెందిన 7వేల ఎకరాలను మొత్తం నుడాలో కలిపారు. నుడాలో మొత్తం సుమారు 13లక్షల జనాభా, 1600 చదరపు కి.మీ విస్తీర్ణం ఉంది. నుడా ద్వారానే అనుమతులు ఇప్పటి వరకు భారీ పరిశ్రమలు, భవనాలు తదితర వాటికి అనుమతుల కోసం అమరావతికి వెళ్ళాల్సి వచ్చేది. అయితే నుడా ఏర్పడ్డంతో పరిశ్రమలు, భారీ భవనాలకు అనుమతులకు నుడా ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నుడాకు భారీ ఆదాయం సమకూరుతుంది. నుడా ఆదాయాన్ని రోడ్లు, పార్క్‌లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. కార్పొరేషన్ పరిధిలోని భవన అనుమతులు కూడా నుడా ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది. నుడా పదవుల కోసం అధికార పార్టీ నేతల పైరవీలు క్యాబినెట్లో మంగళవారం నుడాకు ఆమోద ముద్ర పడటంతో అధికార పార్టీ నేతలు పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. నుడాకు చైర్మన్, 20 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో నామినేటెడ్ చైర్మన్ పదవి కోసం నాయకులు పావులు కదుపుతున్నారు. అయితే మరికొంత మంది ఆశావహులు కూడా నుడా చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నారు. సభ్యుల పదవుల కోసం టీడీపీలోని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, నుడా వైస్ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.