NUDA: వడివడిగా నుడా విస్తరణ అడుగులు | NUDA: Nellore Urban Development Authority Expansion Full Details | Sakshi
Sakshi News home page

NUDA: వడివడిగా నుడా విస్తరణ అడుగులు

Published Thu, Sep 22 2022 7:37 PM | Last Updated on Thu, Sep 22 2022 7:40 PM

NUDA: Nellore Urban Development Authority Expansion Full Details - Sakshi

9వ డివిజన్‌లో పూర్తయిన అంబేడ్కర్‌ పార్కు

నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో నుడా ఆవిర్భవించినప్పటికీ నిధులివ్వకుండా నిస్తేజంగా మార్చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు మూడు వేల చ.కి.మీ. పరిధిలోని గ్రామాలను నుడాలోకి తీసుకురావడంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నుడా అధికారాలను అడ్డం పెట్టుకుని అప్పటి పాలకులు అడ్డంగా దోచుకున్నారే తప్ప.. నుడా పేరుతో చేపట్టిన అభివృద్ధి శూన్యంగానే చెప్పొచ్చు.


నెల్లూరు సిటీ:
నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పరిధి భారీగా విస్తరిస్తోంది. పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా నుడా పరిధిని విస్తరిస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు పలు మండలాలు, గ్రామాలను నుడాలో కలుపుతూ జీఓలు విడుదల చేసింది. తాజాగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 13 మండలాల పరిధిలోని 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందులో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఉండడం విశేషం.  

మూడేళ్లలో భారీగా విస్తరణ  
2017 మార్చి 24న నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) ఆవిర్భవించింది. తొలుత నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం ప్రాంతాల్లోని మొత్తం 21 మండలాల పరిధిలోని 156 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,644.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నుడా పరిధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 5,023.44 చ.కి.మీ. వరకు విస్తరించింది.  


► 2020 ఏప్రిల్‌ 24న 135 జీఓ నంబర్‌తో రెండు మండలాల్లోని 65 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో 567.49 చ.కి.మీ. పెరిగింది.  
► 2022 జూన్‌ 15న జీఓ నంబరు 97తో మరో రెండు మండలాల్లోని 39 గ్రామాలను నుడాలో కలపడంతో మరో 475.54 చ.కి.మీ. పరిధి పెరిగింది. 
► తాజాగా 2022 సెప్టెంబరు 15న జీఓ నంబర్‌ 132 ద్వారా 13 మండలాల పరిధిలో 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో మరో 2,336.24 చ.కి.మీ. పరిధి పెరిగింది. ప్రస్తుతం 31 మండలాల పరిధిలోని 426 గ్రామాలతో మొత్తం 5,023.44 చ.కి.మీ. నుడా విస్తరించింది.  


97 ఎకరాల్లో 1,112 ప్లాట్లు ఏర్పాటు  

నుడా అభివృద్ధిలో భాగంగా కావలికి సమీపంలోని జలదంకి మండలం జమ్మలపాళెం వద్ద ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పథకం కింద 97 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ప్లాట్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ ఇచ్చారు. రూ.50 కోట్లతో లేఅవుట్‌లో పార్కులు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్‌ లైట్లు, పచ్చదనంతో కూడిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే 250 ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్‌లో ప్లాట్లు దరఖాస్తు చేసుకునేందుకు  mig.apdtcp.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 9121162478 నంబరులో సంప్రదించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.   

అక్రమ లేఅవుట్లపై కొరడా  
నుడా పరిధిలో అక్రమలేఅవుట్లపై నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్, నుడా వైస్‌ చైర్మన్‌ నందన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. 300కు పైగా లేఅవుట్లను నుడా పరిధిలో ఏర్పాటు చేశారు. వాటిలో 118 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించి ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం కింద క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 55 అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించారు. మరో 20 లేఅవుట్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. 180 ప్లాట్ల యజమానులు వ్యక్తిగతంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 46 దరఖాస్తులు మంజూరు చేశారు. ఇప్పటికే నుడాకు రూ.60 లక్షలు వరకు ఫీజు రూపంలో వచ్చింది.


రూ.3.18   కోట్లతో నుడా కార్యాలయ నిర్మాణం  

నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ ఫుడ్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వెనుక వైపు నుడా కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. రెండు అంతస్తులతో మొత్తం 10,650 చదరపు అడుగుల స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నారు.  ఐదేళ్లుగా అద్దె భవనంలో నుడా కార్యాలయ కలాపాలు జరుగుతున్నాయి. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని నుడాకు చెందిన స్థలంలో కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కొన్ని నెలల్లోనే కార్యాలయం నిర్మాణం పూర్తి కానుంది.   

మూడేళ్లలో రూ. 54.32 కోట్లతో అభివృద్ధి  
నుడా పరిధిలో గత మూడేళ్లలో రూ.54.74 కోట్లు నిధులతో పార్కులు, పాఠశాల నిర్మాణాలు, సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రెయిన్‌లు, కమ్యునిటీ హాల్స్‌ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 135  పనుల్లో 57 పనులు పూర్తయ్యాయి. మరో 30 పనులు జరుగుతున్నాయి. 40 పనులు ప్రారంభించనున్నారు. 3 పనులు టెండర్‌ ప్రాసిసెంగ్‌లో ఉన్నాయి.  మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుడాకు రూ.61.42 కోట్ల నిధులు మంజూరు చేసింది.  (క్లిక్ చేయండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!)

► నెల్లూరు నగరంలో రూ.6.90 కోట్లతో 15 పార్కులు నిర్మించారు. రూ.2.2 కోట్లతో మరో 4 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. నర్తకీ థియేటర్‌ వద్ద రూ.3 కోట్లతో ఫుట్‌పాత్, డివైడర్, రోడ్డు నిర్మాణాలకు కేటాయించారు. చింతారెడ్డిపాళెం బలిజపాళెంలో రూ.35 లక్షలతో పాఠశాల భవనం, రూ.15 లక్షలతో ధోబీఘాట్‌ నిర్మాణం జరిగింది. నవాబుపేటలో  రూ.30 లక్షలతో వజూఖానా, రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోన్నాయి. 48వ డివిజన్‌లో రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్, రూ.30 లక్షలతో తోటబడి వద్ద పార్కు నిర్మాణం జరుగుతోంది.  

► నెల్లూరు రూరల్‌ పరిధిలో రూ.72 లక్షలతో షాద్‌కాలనీ, మారుతీనగర్‌లో పార్కుల నిర్మాణం జరిగింది. డైకాస్‌రోడ్డులోని మహిళా ప్రాంగణం సమీపంలో రూ.30 లక్షలతో ఏవీకే ఎస్టేట్‌ పార్కు నిర్మాణం జరుగుతోంది. రూ.48 లక్షలతో ఆనం వెంకురెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ జరిగింది. అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఎన్‌టీఆర్‌ పార్కులో రూ.30 లక్షలతో టెన్నిస్‌ కోర్టు, రూ.13 లక్షలతో అదనంగా మరికొన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో ఆరు ప్యాకేజీ కింద సీసీరోడ్డు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. 4వ మైలులో రూ.76 లక్షలతో ప్రేయర్‌ హాల్, మరుగుదొడ్లు, వాచ్‌మన్‌ గది నిర్మాణం చేస్తున్నారు. మినీబైపాస్‌రోడ్డులోని హీరో హోండాషోరూమ్‌ వద్ద రూ.19.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రూ.కోటితో బారాషహీద్‌ దర్గాలోకి ప్రవేశమార్గం వద్ద రెండు ఆర్చ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రూ.17.5 కోట్లతో నెక్లెస్‌రోడ్డులో పార్కు, మరమ్మతులు చేయనున్నారు.  

► కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో రూ.5.10 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం జరిగింది. కోవూరు, మైపాడు, నార్త్‌రాజుపాళెం ప్రాంతాల్లో రూ.1.50 కోట్లతో డ్రెయినేజీలు నిర్మించారు. బుచ్చిరెడ్డిపాళెంలో రూ.కోటితో బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు నిర్మాణం చేశారు. రూ.3.25 కోట్లతో బుచ్చిరెడ్డిపాళెంలో డ్రెయినేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి.  
 
► సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1.40 కోట్లతో 5 కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలకు ఇటీవల టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ప్రారంభించనున్నారు. రూ.5.54 కోట్లతో 21 శ్మశానాలను నిర్మించారు. 


మరిన్ని ప్రగతి పనులు చేస్తాం 

నుడా పరిధి విస్తరించడంతో పాటు రాబడిపై దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కంటే రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నుడా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. అక్రమలేఅవుట్‌లకు అవకాశం లేకుండా నుడా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు చేసి ఇబ్బందులు పడకండి.  
– ముక్కాల ద్వారకానాథ్, నుడా చైర్మన్‌ 


అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం 

నుడా పరిధిలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ సూచనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కావలి నుంచి తడ, కృష్ణపట్నం నుంచి కడప మీదుగా ఉన్న ప్రాంతాలు నుడాలో కలిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగవంతంగా అభివృద్ధి జరగనుంది.
– ఓ నందన్, నుడా వైస్‌ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement